స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే అరెస్ట్ చేశారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని.. స్కిల్ డెవలప్మెంట్‌కేసులో నిందితుడిగా న్యాయస్థానం నిర్ధారించిందన్నారు. బంద్‌కు పిలుపునిస్తే ప్రజల్లో స్పందన లేదన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌ను రాజకీయ కుట్రగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ యువకులకు సంబంధించిందని.. ఎవరికీ ట్రైనింగ్ ఇవ్వకుండా , ఇన్‌స్టిట్యూట్ కట్టకుండా డబ్బులు కొల్లగొట్టారని ఆయన విమర్శించారు. అవినీతి జరిగిందా లేదా అనేది చూడాలన్నారు. అవినీతి చేసిన వారు ఎవరైనా శిక్షింపబడాల్సిందేనన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీసులు భారీ భద్రత నడుమ రోడ్డుమార్గంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని ఏసీబీ కోర్టు జైలు అధికారులకు తెలిపింది. తగిన భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించలేదు. చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న ఆయన న్యాయవాదుల విజ్ఞప్తికి ఏసీబీ కోర్టు సమ్మతి తెలిపింది.
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రెండేళ్లు జైలుకు వెళ్లిన వ్యక్తి, రిచెస్ట్ సీఎం.. కానీ ఏమి పని చేశాడో తెలియదని విమర్శించారు. హఠాత్తుగా ఆస్తులు పెంచేసుకుని, అక్రమంగా డబ్బులు సంపాదించిన వారంతా రాజ్యాధికారం దక్కించుకున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరినీ నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన అంశంలో తన మద్దతు ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు జీవితమంతా అక్రమ మార్గాలేనని సజ్జల మండిపడ్డారు. ఈ కుంభకోణానికి రూపకర్త, నిర్మాత, దర్శకత్వం అన్నీ చంద్రబాబేనని ఆరోపించారు. ఈ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే నిన్న(శనివారం) అరెస్ట్ చేశారని సజ్జల స్పష్టం చేశారు.
చంద్రబాబు మీద పెట్టిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో పక్కా దృఢమైన ఆధారాలతో పెట్టడం జరిగిందని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ ఒక్క కేసే కాదు.. ఇంకా చంద్రబాబు మీద ప్రాసిక్యూట్ చేయాల్సినవి ఇంకా ఆరేడు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. చట్టాన్ని తృణప్రాయంగా తన చేతిలో ఉన్న ఒక ఆయుధంగా మలుచుకుని తప్పించుకుంటూ వస్తున్నాడని ఆరోపించారు.