కృష్ణా జిల్లా గన్నవరంలో గూడవల్లి వద్ద బుడమేరు కాలువ కట్ట తెగిపోయింది.. దీంతో.. బుడమేరు కాలువ నుంచి జాతీయ రహదారి 16పైకి వరద నీరు చేరుతుంది.. నిడమానూరు నుండి గూడవల్లి వరకు జాతీయ రహదారిపైకి వరద నీరు చేరిపోయింది..
వరద బాధితులను ఆదుకనేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేశామన్నారు.. ఇక, ఆహారం అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనజీర్ కు అప్పగించారు.. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం..
బెజవాడలో వరదలపైనే ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాత్రి గంటన్నర సేపు సింగ్ నగర్ లో పర్యటించిన సీఎం చంద్రబాబు. బోట్ల ద్వారా తరలించిన, స్వచ్ఛందంగా బయటకు వచ్చిన బాధితులతో మాట్లాడారు.. వారి ఆవేదన, బాధలను, రెండు రోజులుగా పడుతున్న కష్టాలను సీఎంకు వివరించారు బాధితులు. ఊహించని ఉత్పాతం వల్ల పడిన ఇబ్బందులను సీఎం చంద్రబాబుకు వివరించారు వరద బాధితులు. ఇప్పటికీ బంధువులు, ఇరుగు పొరుగు వారు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నారని తెలుపుతూ…
బెజవాడ వాసులు క్రమంగా ఊపిరి పీల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ప్రకాశం బ్యారేజీకి గంట గంటకూ వరద తగ్గుతోంది.. మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమంగా వరద తగ్గుతోంది.. మధ్యాహ్నం 12 గంటలకు రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. రాత్రి 9 గంటల వరకు ప్రకాశం బ్యారేజీకి 11.20 లక్షల క్యూసెక్కులకు తగ్గింది ఇన్ఫ్లో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు వర్షాలు, వరదల కారణంగా 19 మంది మృతిచెందారు.. ఇద్దరు గల్లంతు అయినట్టు పేర్కొంది.. ఇక, 136 పశువులు, 59,700 కోళ్లు మరణించాయని.. 134 పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 6 వేల పశువులకు వ్యాక్సిన్ అందించడం జరిగిందని వెల్లడించింది.
AP and Telangana Rains LIVE UPDATES: వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విజయవాడ-హైదరాబాద్ రూట్లో రాకపోకలకు లైన్ క్లియర్ అయ్యింది.. ఐతవరం దగ్గర హైవే పై చేరిన వరద నీరు తగ్గటంతో వాహనాలను అనుమతి ఇస్తున్నారు అధికారులు.. అయితే.. హైవేపై బురద పేరుకు పోవటంతో వాహనాలను నెమ్మదిగా ఆ ప్రాంతాన్ని దాటిస్తున్నారు..
గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.. వర్షాలు, వరదల దెబ్బకి విమాన ప్రయాణాలకు డిమాండ్ వచ్చింది.. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, రైలు మార్గాలలో అంతరాయం ఏర్పడడంతో... గన్నవరం విమానాశ్రయంలో రద్దీ పెరిగిపోయింది.. అయితే, పెరిగిన రద్దీతో టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.