దేశ రాజకీయాల్లో మరోసారి సీబీఐ చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం.. విపక్ష పాలిత రాష్ట్రాలపై సీబీఐ సాయంతో కక్ష సాధిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు సీబీఐకి నో ఎంట్రీ బోర్డు చూపిస్తున్నాయి. భవిష్య్తతులో మరిన్ని రాష్ట్రాలు అదే దారిలో నడిచే అవకాశాలున్నాయి. అసలు సీబీఐకి ఈ దుస్థితి ఎందుకొచ్చింది..? కేంద్రం నిజంగానే సీబీఐని దుర్వినియోగం చేస్తోందా..? పరిస్థితుల్ని రాష్ట్రాలు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయా..?
రాష్ట్రాల్లో సీబీఐని నిషేధించాలనే డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పటికే పది రాష్ట్రాల్లో నో ఎంట్రీ బోర్డు ఉండగా.. మరిన్ని రాష్ట్రాలు కూడా అదే బాటలో ఉన్నాయ్. ఇటీవల బీహార్ సీబీఐకి నో ఎంట్రీ బోర్డు చూపించడం.. పట్నా వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ నిర్ణయానికి మద్దతు పలకడం హాట్ టాపిక్ అయింది.
అవినీతి ఏ స్థాయిలో జరిగినా.. దాని అంతు చూడాలనే ఉద్దేశంతో సీబీఐ ఏర్పాటైంది. అవినీతిపరుల కట్టడి కోసం కొన్ని ప్రత్యేకాధికారాలు కూడా ఇచ్చారు. కానీ సీబీఐ పనితీరు రోజురోజుకీ నిరాశాజనకంగా ఉంటోందనే వాదన వినిపిస్తోంది. అవినీతి కట్టడికి ప్రతి రాష్ట్రంలో ఏసీబీ ఉంది. అయితే రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా.. మొహమాటాలకు తావుండకుండా ఉండాలనే ఉద్దేశంతో.. సంక్లిష్టమైన, హైప్రొఫైల్ కేసుల్ని సీబీఐకి అప్పగిస్తూ వస్తున్నారు. అయితే గత రెండు దశాబ్దాలుగా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. సీబీఐ బద్నాం అవుతూనే ఉంది. అటు కేంద్రానికి నో చెప్పలేక.. ఇటు కోర్టుల ముందు వివరణ ఇచ్చుకోలేక.. సీబీఐ సతమతమౌతోంది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ.. పంజరంలో చిలకగా పేరు తెచ్చుకుని.. తాను నమోదు చేసిన ప్రతి కేసుకు సమాధానం చెప్పాల్సి రావడం కేవలం సీబీఐ స్వయంకృతమే కాదు.. అలవిమాలిన రాజకీయ జోక్యం కూడా కారణమే.
రాజ్యాంగం సూచించిన సమాఖ్య స్ఫూర్తిని సరిగా అర్థం చేసుకోకుండా.. కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూడటం.. దీనికి రాష్ట్రాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఘర్షణ మొదలైంది. ఈ గొడవ దర్యాప్తు సంస్థల్ని కూడా వదల్లేదు. స్వయం ప్రతిపత్తి ఉన్న దర్యాప్తు సంస్థలపై ఎవరికి వారు ఆధిపత్యం ప్రదర్శించాలని చూడటం. తమ మాటే నెగ్గాలనుకోవడం సమస్యలకు దారితీస్తోంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన సీబీఐని.. అధికార పార్టీకి జవాబుదారీగా మార్చడం.. అవినీతిపరుల్ని కట్టడి చేయాల్సిన దర్యాప్తు సంస్థను.. రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొల్పడంతో.. విలువలు పతనమయ్యాయి.
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1946 సెక్షన్ ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు నిర్వహించాలనుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. రాష్ట్రాలకు ఇష్టంలేక తమ సమ్మతిని ఉపసంహరించుకుంటే సీబీఐ హైకోర్టును ఆశ్రయించవచ్చు. హైకోర్టు అనుమతించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగేదేమీ ఉండదు. పోలీసింగ్ అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి కేంద్రం జోక్యం చేసుకోకూడదని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, పంజాబ్, మేఘాలయ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌తో కలిపి తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి తమ రాష్ట్రంలో ప్రవేశాన్ని నిషేధించాయి. గతంలో ఏపీ ప్రభుత్వం కూడా సీబీఐకి అనుమతి నిరాకరించింది.
సీబీఐ ప్రవేశానికి సంబంధించి బీహార్ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్‌కు మద్దతిచ్చిన కేసీఆర్ త్వరలోనే తెలంగాణలో సీబీఐని కూడా నిషేధిస్తారంటూ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవిత పేరు వినిపిస్తోంది. దీనిపై ఆమె కోర్టుకెళ్లి తన పేరు ఉపయోగించుకుండా స్టే తెచ్చుకున్నారు. ఈ స్కాంలో దూకుడుగా ఉన్న సీబీఐ త్వరలో కవితను కూడా విచారించే అవకాశం ఉందన్న ముందస్తు ఆలోచనతో కేసీఆర్ సీబీఐని నిషేధించే అవకాశం కనపడుతోందనే వాదన ఉంది.
అన్ని రాష్ట్రాలు తమ తమ పరిధిల్లో సీబీఐ ప్రవేశాన్ని నిరాకరించాలని కేసీఆర్ కోరారు. రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేంద్రం ఈ సంస్థను ఉపయోగిస్తోందని మండిపడ్డారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని మోడీ సర్కారు వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై దాడులకు తెగబడుతోందని ఇప్పటికే ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, బెంగాల్, బీహార్లో సీబీఐ దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి. మహారాష్ట్రంలో కూడా సీబీఐ బూచి చూపించే ప్రభుత్వాన్ని పడగొట్టారనే ఆరోపణలున్నాయి. బీహార్‌లో సీబీఐ చర్యలపై మహాఘట్‌బంధన్ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. బీహార్‌లోకి సీబీఐ ప్రత్యక్ష ప్రవేశంపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు బీహార్ ప్రభుత్వం గతంలో సీబీఐకి ఇచ్చిన సమ్మతి అధికారాన్ని ఉపసంహరించుకుంది. బీహార్ కంటే ముందు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా సీబీఐ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయా ఇప్పటికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి. సీబీఐకి వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్న చాలా రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలనలో ఉన్నాయి.
సీబీఐ, ఈడీ పనితీరు పారదర్శకంగా ఉండాలి. కేంద్ర ఏజెన్సీలో నిజాయితీపరులకు కొదువలేదు. అయితే కొందరు అధికారులు కేంద్రంతో కుమ్మక్కై.. రాష్ట్రాల్లో సర్కారులు కూల్చే పనికి వంతపాడుతున్నారనే విమర్శలున్నాయి. అయితే సీబీఐ ఒక్కటే కేంద్ర దర్యాప్తు సంస్థ కాదు. ఇంకా ఈడీ, ఐటీ లాంటి సంస్థలున్నాయి. మరి వీటిని ఎలా అడ్డుకుంటారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు వస్తే.. తప్పు చేయలేదని రుజువు చేసుకోవాలి కానీ.. దర్యాప్తు సంస్థల్ని నిషేధించడం ఏం పద్ధతనే వాదన కూడా ఉంది. కేంద్రం నిజంగా సీబీఐని దుర్వినియోగం చేస్తుంటే.. అప్పుడు ఓకే. కానీ నిజంగానే రాష్ట్రాల్లో అవినీతి జరిగితే.. ఎవరు శిక్షించాలనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాష్ట్రాల్లో ఏసీబీలున్నా.. అవి అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేస్తాయనే అపవాదు ఉంది. పారదర్శక దర్యాప్తు కోసమే కీలక కేసుల్ని సీబీఐకి అప్పగించటం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు రాజకీయాల పేరుతో సీబీఐకి నో ఎంట్రీ బోర్డు చూపిస్తే.. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అనే చర్చ జరుగుతోంది.
చట్టాల ప్రకారం సీబీఐ రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల మేరకే విచారణ జరుగుతుంది. ఓ రాష్ట్రంలో సొంతంగా సీబీఐ కేసులు నమోదు చేసి విచారణ చేయలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించు. వారిపై సీబీఐ .. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా దాడులు చేయవచ్చు. అయితే ఇలా చేయడానికి కూడా సీబీఐకి అన్ని ప్రభుత్వాలు జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇస్తూనే ఉంటుంది. కానీ సీబీఐ రాజకీయ అస్త్రంగా మారిన తరవాత విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల జనరల్ కన్సెంట్ రద్దు చేస్తున్నారు. గతంలో ఏపీలో చంద్రబాబు సర్కారు సీబీఐకి ఇచ్చిన ఈ జనరల్ కన్సెంట్ ను రద్దు చేసి చాలా మందికి మార్గం చూపింది. కొన్ని రాష్ట్రాల్లో జనరల్ కన్సెంట్ రద్దు చేసినా.. ఆ తర్వాత పునరుద్ధరించారు. ఇక్కడ ప్రభుత్వాలు సీబీఐని బద్నాం చేస్తున్నాయని, రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి పనులు చేయడం ఎవరికీ మంచిది కాదని నిపుణులు అంటున్నారు. కేంద్రం సీబీఐని స్వతంత్రంగా పనిచేయనివ్వాలి. రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తుకు సహకరించాలి. అప్పుడే కుంభకోణాల అంతు తేలి.. దోషులకు శిక్ష పడుతుంది. కానీ పొలిటికల్ ప్రయోజనాలు చూసుకుంటూ.. సీబీఐపై కక్ష సాధిస్తే.. అంతిమంగా వ్యవస్థకు నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు లేకపోలేదు.
సీబీఐ తమ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేయడానికి గతంలో సాధారణ సమ్మతి ఇచ్చి, తర్వాత కాలంలో వాటికి రద్దు చేసి నో ఎంట్రీ చెప్పిన రాష్ట్రాలు అనేకం ఉన్నాయి. అయితే సీబీఐ విషయంలో కేంద్రం చేస్తోంది తప్పా.. రైటా..? రాష్ట్రాల ఆరోపణలు నిజమా.. అబద్ధమా..? ఈ ప్రశ్నలకు జవాబులు అంత త్వరగా తెమిలే అవకాశం లేదు. రాజకీయ ప్రయోజనాలు, ఆయా పరిస్థితుల్ని బట్టి అభిప్రాయాలు మారిపోతాయి.
2018లో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి నుంచి, మోదీ సర్కారు నుంచి బయటకు వచ్చినపుడు ఇరు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కారు తమపై కక్ష సాధింపు చర్యలు ఉంటాయేమోనన్న అనుమానంతో సీబీఐకు ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. దాంతో రాష్ట్రంలో సీబీఐ కేసులు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే బాటలో బెంగాల్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయ, కేరళ, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లు తమ రాష్ట్రాల్లో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే సాధారణ సమ్మతి ఉత్తర్వుల్ని ఉపసంహరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత జనరల్ కన్సెంట్‌ను పునరుద్ధరించింది. గతంలో కర్ణాటకలోనూ సీబీఐకి నో ఎంట్రీ చెప్పినా… ఆ తర్వాత జనరల్ కన్సెంట్‌ను పునరుద్ధరించారు. బెంగాల్‌లో ఓ కేసు విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులను అక్కడి పోలీసులు అడ్డుకుని ఏకంగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
సీబీఐ గత పదేళ్లలో టేకప్ చేసిన కేసులేవీ కొలిక్కిరాకపోవడం కూడా దర్యాప్తు సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసింది. అత్యున్నత అధికారుల కూడా ఘర్షణ పడటం.. సీబీఐని మరింతగా భ్రష్టు పట్టించింది. డైరక్టర్, జాయింట్ డైరక్టర్ ఓ కేసు విషయంలో ఘర్షణ పడటం, దీని గురించి కోర్టు క్లాస్ పీకాల్సి రావడం చిన్న విషయం కాదు. కోల్ స్కామ్, కామన్వెల్త్ స్కామ్ ఇలా చాల కేసుల్లో అతీగతీ లేదు. కేవలం కేసుల నమోదు సమయంలో సెన్సేషనే తప్ప.. అంతిమ ఫలితం ఏమిటనేది పెద్ద మిస్టరీగా ఉండిపోతోంది. సీబీఐకి చిత్తం వచ్చినట్టుగా దర్యాప్తు వేగవంతం చేయడం, ఇష్టం లేకపోతే కేసులు సాగదీయటం లాంటి ధోరణులు కూడా విమర్శలకు కారణం. సీబీఐ కేసులు నమోదుచేసినంత స్థాయిలో.. శిక్షలు పడకపోడవం ఆ సంస్థ విశ్వసనీయతకు భంగం కలిగిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి మనసెరిగి.. విచారణ చేసే తీరు కూడా సీబీఐకి తలవంపులు తెచ్చింది. లక్షల కోట్ల కుంభకోణం జరిగిపోయింది.. దేశ సంపద లూటీ చేశారనే సంచలన ఆరోపణలతో కేసులు నమోదు చేసే సీబీఐ.. ఏళ్ల తరబడి విచారణ సాగదీసి.. కొండను తవ్వి ఎలుకను పడుతోంది. అందుకే సీబీఐ అంటే లైట్ తీస్కునే పరిస్థితి వచ్చేసింది. గతంలో సీబీఐ దర్యాప్తు అంటే అవినీతిపరుల్లో భయం ఉండేది. కానీ ఇప్పుడు సీబీఐని మేనేజ్ చేయడానికి చాలా పద్ధతులున్నాయని సంతోషించే దుస్థితి వచ్చింది.
గతంలో పోలీస్ శాఖ కంటే సీబీఐ సమర్థంగా పనిచేస్తుందనే నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు కేసు సీబీఐకి వెళ్లిందంటే.. తెర మరుగైనట్టే అనే అభిప్రాయం బలపడింది. సాధారణ కేసుల సంగతి పక్కనపెడితే.. దేశవ్యాప్తంగా కలకలం రేపిన కేసుల్లో కూడా సీబీఐ పురోగతి సాధించలేకపోతోంది. సీబీఐ పనితీరు, దాని చుట్టూ ముసురుకుంటున్న రాజకీయ ఆరోపణలు.. ఆ సంస్థ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని పావులుగా వాడుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేస్తోందని పలు సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. అయితే, రాష్ట్రాలు తమ సమ్మతి ఉపసంహరించుకున్నంత మాత్రాన సీబీఐ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా ఊరుకునే పరిస్థితుల్లేవు. అందుకు గతంలో జరిగిన ఘటనలే నిదర్శనం. దాణా కుంభకోణంలో విచారణ నుంచి తప్పించుకునేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐని తమ రాష్ట్రాలోకి రాకుండా ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ ఉత్తర్వులను కొట్టివేయించడంతో లాలూ జైలుకెళ్లారు. హిమాచల్ ప్రదేశ్ సీఎంగా పనిచేసిన వీరభద్రసింగ్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టింది. వీరభద్ర సింగ్ సీబీఐని తమ రాష్ట్రంలోకి రావద్దంటూ జీవో ఇచ్చారు. సుప్రీంకోర్టు సదరు జీవోను కొట్టివేయడంతో వీరభద్రసింగ్ జైలుకు వెళ్లారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకోడా అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ ప్రారంభించింది. జార్ఖండ్‌లో సీబీఐకి అనుమతి లేదంటూ ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టు సదరు జీవోను రద్దు చేయడంతో సీబీఐ తనపని తాను చేసుకుపోయింది. సీఎం హోదాలో మధు కోడా అరెస్టయి జైలుకు వెళ్లారు. బిహార్‌లో నితీశ్ బీజేపీని కాదని ఆర్జేడీతో జట్టు కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఉప ముఖ్యమంత్రి తేజస్వి మీద సీబీఐ ఉద్యోగాల కుంభకోణం కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో బిహార్ కూడా ఇటీవలే జనరల్ కన్సెంట్‌ను ఎత్తేసింది. సీబీఐ తేజస్వి మీద కేసును ఢిల్లీలో నమోదు చేసింది కాబట్టి దర్యాప్తునకు ఇబ్బంది ఉండదని, తమ వేట కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీ ప్రత్యేక పోలీస్ చట్టం ప్రకారం ఏర్పడ్డ సీబీఐ ఏ రాష్ట్రంలోనైనా పని చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఈడీకి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. అవినీతి, పెద్ద మొత్తంలో నగదు బదిలీకి సంబంధించి ఈడీ చేపడుతున్న నల్లధనం చెలామణి కేసులే ఎక్కువగా ఉంటున్నాయి.నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐని అడ్డుకోగలుగుతాయి. ఈడీ వంటి సంస్థల్ని కట్టడి చేయలేవు. రాజకీయ నాయకులు అవినీతి ఆరోపణలకు సందివ్వకుండా పాలన చేయాలి కానీ.. ఇలా దర్యాప్తు సంస్థల్ని బద్నాం చేయడం ప్రమాదకర ధోరణులకు దారితీస్తోంది.
సీబీఐని పంజరంలో చిలకగా సుప్రీంకోర్టు కొన్నేళ్ల కిందట అభివర్ణించింది. సీబీఐకి అనేకమంది రాజకీయ యజమానులున్నారని నిష్టుర సత్యం పలికింది. ప్రభుత్వమనే పంజరం నుంచి సీబీఐకి స్వేచ్ఛ కల్పించాలని కేంద్రాన్ని కోరింది. యూపీఏ ప్రభుత్వ హయాం చివరి ఏడాదిలో కానీ, ఇప్పుడు ఎన్డీఏ ఎనిమిదేండ్ల పాలనలో కానీ పంజరంలోని చిలుకను వదిలిపెట్టలేదని జరుగుతున్న పోకడలను చూస్తే అర్థమవుతోంది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్..సీబీఐ 1963లో హోంమంత్రిత్వ శాఖ తీర్మా నం ద్వారా ఉనికిలోకి వచ్చింది. సీబీఐ అనేది చట్టబద్ధమైన సంస్థ కాదు. రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత, అవినీతికి సంబంధించిన విషయాలపై దర్యాప్తు అవసరం అనిపించింది. దానికోసం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం తెచ్చి, 1946లో దాన్ని అమలుచేశారు. కేంద్ర హోం శాఖ 1963 ఏప్రిల్ 1 నాటి తీర్మానం ద్వారా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే పేరు వచ్చింది. సీబీఐ స్థాపన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా జరిగింది తప్ప చట్టం ద్వారా కాదు. ఇదే విషయా న్ని ప్రస్తావిస్తూ 2013 నవంబర్ 6న, గౌహతి హైకోర్టు సీబీఐకి చట్టపరమైన హోదా లేదని పేర్కొంది. దీనిపై అప్పీల్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
సీబీఐ పనితీరును మెరుగుపరిచేందుకు, దానికి ప్రభుత్వ పంజరం నుంచి స్వేచ్ఛ కల్పించేందుకు మద్రాస్ హైకోర్టు 2021 ఆగస్టులో అనేక ఆదేశాలు జారీచేసింది. జస్టిస్ ఎన్.కిరుబాకరన్, బి.పుగలేంధితో కూడిన ధర్మాసనం అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐలో సౌకర్యాలను మెరుగుపరచాలని, తద్వారా దాన్ని స్కాట్లాండ్ యార్డ్ పోలీస్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ..ఎఫ్‌బీఐ స్థాయికి తీసుకురావాలని చెప్పింది. భారత ఎన్నికల సంఘం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లాగా సీబీఐ మరింత స్వతంత్రంగా ఉండాలని కోర్టు కోరింది. సీబీఐకి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వ నియంత్రణ లేకపోతే సీబీఐ స్వతంత్రంగా పనిచేస్తుందని అభిప్రాయపడింది. ఈ ఉత్తర్వులన్నీ పంజరంలోని చిలుకను విడుదల చేసే ప్రయత్నమే అని కోర్టు కామెంట్ చేసింది. సీబీఐకి చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు వీలైనంత త్వరగా ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
మద్రాస్ హైకోర్టు ఆదేశించినట్లు సీబీఐతో పాటు ఈడీని కుడా రాజకీయ జోక్యం లేకుండా స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా తీర్చిదిద్దనంతవరకు ఆ సంస్థలు ప్రత్యర్థి రాజకీయ నాయకులపై చేసే దాడులు, పెట్టే కేసులపై అనేక అనుమానాలు, ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. సీబీఐ విచారించిన కేసుల్లో 2021 నాటికి శిక్షా రేటు 60 శాతంగా ఉంది. ఈ శిక్షా రేటు 2010కి ముందు 70 శాతం వరకు ఉంది. మద్రాస్ హైకోర్టుకు సమర్పించిన సమాచారాన్ని బట్టి సీబీఐ పెట్టిన కేసుల్లో 40 శాతం కూడా నేర నిరూపణ కాలేదు. సీబీఐ నేరారోపణ చేసినట్లయతే నేరం నిరూపించాల్సిన బాధ్యత సీబీఐపైనే ఉంటుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విషయానికి వస్తే.. ఈడీ నేరం ఆరోపిస్తుంది. ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి తాను నిర్దోషినని నిరూపించుకోవాలి. అంటే ఈడీకి నేర నిరూపణ బాధ్యత ఉండదు.
లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయ మంత్రి చెప్పిన వివరాల ప్రకారం 2004-14 మధ్యకాలంలో 112 సోదాలు జరిగాయి. వీటిలో రూ.5,346. 16 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు.104 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు నమోదయ్యాయి. కానీ మోడీ హయాంలో 2014-22 మధ్యకాలంలో ఏకంగా 2,974 సోదాలు జరిగాయి. రూ.95, 432.08 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్లు, 839 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు నమోదయ్యాయి. మోడీ ప్రభుత్వం మనీల్యాండరింగ్ నిరోధక చట్టం లో చేసిన మార్పులు రాజ్యంగబద్ధమా కాదా అన్న విషయాన్ని తేల్చమని 2019లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేసును ఏడుగురు జడ్జిల ధర్మాసనానికి బదిలీ చేసింది. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతున్న సమయంలోనే ప్రభుత్వానికి, ఈడీకి అవధుల్లేని అధికారాలను కల్పించే పీఎమ్‌ఎల్‌ఏకు చేసిన ప్రధాన సవరణలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2022 జూలై 27న తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు.
మోదీ ప్రభుత్వం పీఎంఎల్‌ఏకు చేసిన సవరణలు ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొని చేసినట్లు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈడీని, సీబీఐని ప్రభుత్వాలను కూల్చడానికి మోడీ ప్రభుత్వం వాడుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సి, విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్లను వదిలేసి, రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయడం ఏంటనే ప్రశ్నలకు కేంద్రంతో పాటు దర్యాప్తు సంస్థలు సమాధానం చెప్పాల్సి ఉంది. సీబీఐకి అవినీతి కట్టడి చేసే అధికారం ఉంది నిజమే. కానీ సరైన ఆధారాల్లేకుండా రహస్య ప్రయోజనాల కోసం నేతల్ని అరెస్ట్ చేయడం.. అధికారిక ప్రకటనకు ముందే లీకులు ఇవ్వడం అనుమానాస్పదంగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా లీకులపై సీబీఐకి అక్షింతలు వేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వ తీరు కారణంగా సీబీఐ అభాసు పాలవుతుంటే.. మరికొన్నిసార్లు డైరక్టర్ స్థాయి వ్యక్తులే దిగజారిపోయి.. పాలకపార్టీల తొత్తులుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోర్టులు సూచించినట్టుగా.. సీబీఐని వీలైనంత త్వరగా సంస్కరించాలి. అప్పుడే అపోహలకు అడ్డుకట్ట పడుతుంది. సీబీఐపై కూడా అనవసర ఒత్తిళ్లు తగ్గి.. స్వేచ్ఛగా పనిచేయగలుగుతుంది. సీబీఐ దర్యాప్తు సామర్థ్యం విషయంలో ఎవరికీ అనుమానం లేదు. కానీ దర్యాప్తు సంస్థ ఉద్దేశాలు, దాడులు చేస్తున్న సమయాలే వివాదానికి మూలకారణం. ఇప్పటికైనా సీబీఐ పద్ధతి మార్చుకుంటే.. కచ్చితంగా ఆ సంస్థ ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరుతుంది. లేకపోతే ఎప్పటిలాగే సీబీఐ అంతేలే అని జనం సరిపెట్టుకుంటారు.