మన పక్కనే ఉన్న చిన్న దేశాలు కూడా క్రికెట్ బాగా ఆడుతున్నాయి. కానీ ఆసియా టైగర్ గా పేరున్న భారత్ జట్టు మాత్రం తీవ్రంగా తడబడుతోంది. ఆసియా కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. కప్పు సంగతి తర్వాత ఫైనల్ బెర్త్ కే ఎసరు వచ్చింది. కష్టాల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఆటలో అదరగొడుతుంటే.. టీమిండియా మాత్రం ఘోరంగా నిరాశపరుస్తోంది. అసలు టీమిండియాకు ఏమైంది..? ఐపీఎల్ వీరులు అసలు మ్యాచుల్లో ఆడరా..?
నిన్నటిదాకా జట్టులో ప్రతి స్థానానికీ ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు పోటీపడ్డారు. సెలక్టర్లకు ఎవర్ని ఎంపిక చేయాలో అర్థం కాని పరిస్థితి ఉండేది. ఒకేసారి రెండు దేశాలకు రెండు టీముల్ని పంపి.. క్వాలిటీ క్రికెట్ ఆడిన టీమిండియా.. ఇప్పుడు అనూహ్యంగా తడబడుతోంది. రిజర్వ్ బెంచ్ లో కూడా ఛాంపియన్లు ఉన్నారనే స్టేజ్ నుంచి ఎవరు ఎలా ఆడతారో తెలియని అయోమయం నెలకొంది.
ఎప్పుడో 2007లో టీ20 ప్రపంచకప్ మొదలైనపుడు ట్రోఫీ అందుకుంది భారత్. అప్పట్నుంచి ఇంకో కప్పు కోసం నిరీక్షణ కొనసాగుతోంది. గత ఏడాది ఘోరమైన ప్రదర్శనతో కనీసం గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది టీమ్‌ఇండియా. ఈసారైనా తప్పులు దిద్దుకుని కప్పుకేసి దూసుకెళ్తుందనుకుంటే.. ఆసియా కప్‌లో సాధారణ ప్రదర్శనతో ఆశలు, అంచనాలను ఒక్కసారిగా తగ్గించేసింది. సూపర్-4లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన రోహిత్ సేన.. ఇక ఫైనల్ చేరుతుందనుకోవడం అత్యాశే అవుతుంది. ఆసియా కప్‌లో టైటిల్ ఫేవరెట్ అనుకున్న జట్టు ఫైనల్ కూడా చేరకుండా నిష్క్రమించే పరిస్థితి రావడం ప్రపంచకప్ సన్నాహాలను ప్రశ్నార్థకం చేస్తోంది.
ప్రపంచకప్‌కు ఇంకో నెలన్నరే సమయం ఉంది. ఈ స్థితిలో టీమ్‌ఇండియా ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో సత్తా చాటి ఆత్మవిశ్వాసం పెంచుకుంటుందని, మెగా టోర్నీలో ఆడించే జట్టుపై ఒక అవగాహనకు వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఈ టోర్నీలో ప్రదర్శన ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీసేలా ఉంది. అలాగే జట్టు, కూర్పు విషయంలో సెలక్టర్లలో, టీమ్ మేనేజ్‌మెంట్‌లో గందరగోళం పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ నిలకడ లేమి జట్టును దెబ్బ తీసింది. ఆటగాళ్లలో పట్టుదల, సరైన దృక్పథం లోపించిన విషయం టోర్నీలో స్పష్టంగా కనిపించింది. ఏ ఒక్క ఆటగాడూ టోర్నీలో నిలకడగా రాణించకపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తించే విషయం.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఆసియా కప్ సందర్భంగా మూడు విభాగాల్లోనూ టీమ్‌ఇండియా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. బ్యాటింగ్‌లో త్రిమూర్తులు రోహిత్, రాహుల్, కోహ్లి అభిమానుల అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయారు. రోహిత్ శ్రీలంకపై బాగానే ఆడాడు కానీ.. అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లో నిరాశ పరిచాడు. రోహిత్ చాన్నాళ్ల నుంచి తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదన్నది వాస్తవం. ఇక కోహ్లి అతి కష్టం మీద ఈ టోర్నీలో పరుగులు చేయగలిగాడు కానీ.. బ్యాటింగ్‌లో సాధికారత అయితే కనిపించలేదు. అతనింకా పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసం అందుకోలేదన్నది స్పష్టం. లంకతో మ్యాచ్‌లో మదుశంక లాంటి కొత్త బౌలర్ బంతిని విరాట్ అడ్డంగా ఆడి బౌల్డయిన తీరు అభిమానులకు పెద్ద షాక్. ఇక గాయం కారణంగా చాలా రోజులు జట్టుకు దూరమై ఈ టోర్నీలో పునరాగమనం చేసిన రాహుల్ లయ అందుకోలేకపోయాడు. పాక్‌తో సూపర్-4 మ్యాచ్‌లో అతను మెరుగ్గానే కనిపించినా.. పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మిగతా మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. మొత్తంగా చూస్తే టాప్ ఆర్డర్ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ మెరుపులు తొలి మ్యాచ్‌కే పరిమితం అయ్యాయి. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ అతను బ్యాటుతో, బంతితో తేలిపోయాడు. దినేశ్ కార్తీక్ రూపంలో తనకు ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ పంత్ జాగ్రత్త పడట్లేదు. అదే నిర్లక్ష్యపు షాట్లతో అవకాశాలను వృథా చేసుకుంటున్నాడు. ఇక సూర్యకుమార్ మంచి ఫామ్‌లోనే ఉన్నప్పటికీ.. బలహీన హాంకాంగ్ మీద మాత్రమే చెలరేగాడు. కీలక మ్యాచ్‌ల్లో జట్టు ఆశలను నిలబెట్టలేకపోయాడు.
బ్యాటింగ్ కంటే బౌలింగ్ మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. బుమ్రా లేని పేస్ విభాగం సాధారణంగా కనిపిస్తోంది. పేస్ దళాన్ని ముందుండి నడిపించడంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ విఫలమయ్యాడు. డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేస్తాడని పేరున్న అతను.. పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్ చివర్లో ఒకే ఓవర్లో 19 పరుగులిచ్చి ఓటమికి కారణమయ్యాడు. ఈ మధ్యే జట్టులోకి వచ్చిన అర్ష్‌దీప్ పర్వాలేదనిపిస్తున్నాడు. అవేష్ ఖాన్ అవకాశాలను ఉపయోగించుకోలేక తుది జట్టులో చోటు కోల్పోయాడు. బుమ్రా తిరిగొస్తే పేస్ విభాగం మెరుగుపడవచ్చు. అయితే ప్రస్తుత జట్టులో మిగతా పేసర్ల ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో షమి లాంటి సీనియర్ వైపు మళ్లీ చూడాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. పని భారం ఎక్కువవుతోందని, అలాగే భవిష్యత్తు దిశగా యువ పేసర్ల వైపు మొగ్గు చూపితే.. వారు అవకాశాలను ఉపయోగించుకోకపోవడంతో షమిని తిరిగి జట్టులోకి తేవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. శ్రీలంకతో మ్యాచ్‌ను మినహాయిస్తే స్పిన్నర్ చాహల్ టోర్నీలో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. ఇక టోర్నీలో ఫీల్డింగ్ కూడా గొప్పగా ఏమీ లేదు. పాక్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తేలికైన క్యాచ్ వదిలేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
గత ఏడాది ప్రపంచకప్ వైఫల్యం తర్వాత జట్టులో, యాజమాన్యంలో చాలా మార్పులే జరిగాయి. కెప్టెన్ మారాడు. కొత్త కోచ్ వచ్చాడు. కోహ్లి స్థానంలో పగ్గాలందుకున్న రోహిత్ మాత్రమే జట్టును నడిపించలేదు. మ్యాచ్‌లు పెరిగిపోవడం, పని ఒత్తిడి, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా వేర్వేరు సిరీస్‌లకు వేర్వేరు కెప్టెన్లు సారథ్యం వహించారు. అలాగే చాలామంది కుర్రాళ్లకు అవకాశమిచ్చారు. వివిధ స్థానాల్లో వేర్వేరు ఆటగాళ్లను ప్రయత్నించి చూశారు. దీని వల్ల గత పది నెలల్లో టీమ్‌ఇండియా ఎప్పుడు ఎక్కడ, ఎవరితో సిరీస్ ఆడిందో చెప్పాలన్నా కష్టమయ్యే పరిస్థితి తలెత్తింది. ఇక ఏ సిరీస్‌లో ఎవరు జట్టును నడిపించారో, ఎవరెవరు జట్టులో ఉన్నారో, ఎవరు ఏ స్థానంలో ఆడారో అభిమానులకు అర్థం కాని గందరగోళం తలెత్తింది. సామాన్య అభిమానులే కాదు.. ఆటగాళ్ల ప్రదర్శనను సమీక్షించి ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేయాల్సిన వాళ్లు కూడా కొంత అయోమయానికి గురయ్యారంటే అతిశయోక్తి కాదు. తరచుగా ఆటగాళ్లను మారుస్తూ వెళ్లడంతో ఎవ్వరూ జట్టులో కుదరుకోలేకపోయారు. అవకాశాలు అందుకున్న కుర్రాళ్లలో మరీ గొప్ప ప్రదర్శన ఎవ్వరూ చేయలేదు. దీంతో జట్టులో ఇప్పటికే ఉన్న సీనియర్లలో ఎవరినీ పక్కన పెట్టే పరిస్థితి కనిపించలేదు. ఆసియాకప్‌కు వచ్చేసరికి చాలా వరకు సీనియర్లనే ఆడించారు. వాళ్లూ అంచనాలను అందుకోలేకపోయారు. ఇప్పుడిక ప్రపంచకప్ జట్టులో ఎవరికి ప్రాధాన్యమిస్తారో చూడాలి.
ఆసియా కప్ లో టీమిండియా మినహా మిగతా జట్లన్నింటికీ వారి దేశాల్లో తీవ్ర సమస్యలున్నాయి. అయినా సరే వాళ్లు గెలవాలనే కసితో ఆడుతున్నారు. మన ఆటగాళ్లలో విజయం సాధించాలనే కోరిక చచ్చిపోయిందా అనే అనుమానాలు వస్తున్నాయి. టీమ్ క్వాలిటీ పరంగానే కాదు.. దేశాల పరంగా చూసినా.. మిగతా టీములు ఏవీ భారత్ కు పోటీ కాదు. శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. పాకిస్తాన్ ఉగ్రవాదంతో సావాసం చేస్తోంది. తాలిబన్ల కారణంగా అఫ్గనిస్తాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడింది. బంగ్లాదేశ్ పేదరికంతో అల్లాడుతోంది. అయినా సరే ఆయా దేశాల ఆటగాళ్లు మాత్రం క్రికెట్ పై బాగా ఫోకస్ పెట్టి సీరియస్ గా ఆడుతున్నారు. టీమిండియా ప్లేయర్లలో సీరియస్ నెస్ లోపించింది. ఐపీఎల్ ను సీరియస్ గా తీసుకుంటూ.. అసలు మ్యాచుల్ని వదిలేసే ట్రెండ్ ముదరటం.. ఆందోళన కలిగిస్తోంది.
ఐపీఎల్, ఎండార్స్ మెంట్లపై అతి శ్రద్ధ చూపుతున్న ఆటగాళ్లు.. మ్యాచుల్ని మాత్రం గాలికొదిలేస్తున్నారు. మిగతా టీముల సంగతి తర్వాత.. కనీసం దాయాది దేశంపై ఆడేటప్పుడు కూడా గెలవాలనే కసి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
టీమిండియాలో ప్లేయర్ అంటే సెలబ్రిటీనే. వద్దన్నా అడ్వర్టైజ్ మెంట్లు వచ్చి పడిపోతాయి. ఆ రెమ్యూనరేషన్ ముందు మ్యాచులు ఆడితే వచ్చే డబ్బు పెద్ద లెక్క కాదు. ఇక స్టార్ క్రికెటర్ల సంగతి చెప్పక్కర్లేదు. రోహిత్, కోహ్లీ లాంటి వాళ్లు ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. దీంతో క్రికెటర్లు ఈజీమనీకి అలవాటుపడ్డారని, మ్యాచులు గెలవాలనే సంగతి మర్చిపోయారని విమర్శలు వస్తున్నాయి.
అసలు మ్యాచుల్లో బాగా ఆడాలంటే.. ప్రాక్టీస్ సెషన్లు చాలా ముఖ్యం. చాలా మంది క్రికెటర్లు ఎండార్స్ మెంట్ల మోజులో.. ప్రాక్టీస్ ఎగ్గొడుతున్నారనేది బహిరంగ రహస్యం. ఓ మ్యాచ్ బాగా ఆడకపోయినా కొంపేం మునగదు. అదే యాడ్ మిస్సైతే కోట్లు పోతాయి.. ఇదే ఇప్పటి ప్లేయర్ల కాన్సెప్ట్. క్రికెట్ ను ప్యాషన్ గా తీసుకుని ఆడే రోజులు పోయి.. క్రికెట్ అంటే ఫ్యాషన్ గా తయారైన కాలంలో ఆడుతున్నారు ఆటగాళ్లు. ఏ మ్యాచ్ ఆడితో ఎన్ని డబ్బులొస్తున్నాయో లెక్కేస్తున్నారు కానీ.. క్రికెట్ అంటే ఒక ఎమోషన్.. ఒక దేశం పరువు అనే సంగతి కన్వీనియంట్ గా మర్చిపోతున్నారు. ఈ యాటిట్యూడే కొంప ముంచుతోంది.
దిగ్గజ ఆటగాళ్లు అన్ని విషయాల్లోనూ యవ ఆటగాళ్లకు మార్గదర్శనం చేయాలి. కానీ కీలక ఆటగాళ్లే ప్రాక్టీస్ సెషన్లు ఎగ్గొడుతుంటే.. అప్ కమింగ్ ప్లేయర్లు ఏం నేర్చుకుంటారనేది అసలు ప్రశ్న. ఒకప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకోవాలని నూరిపోసేవాళ్లు సీనియర్లు. కానీ ఇప్పుడు ఒక్కసారి ఫెయిలైతేనే వేటు వేస్తే.. ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిపోతుందనే వాదన తెరపైకి వస్తోంది. చిన్న గ్యాప్ దొరికినా ఫోటోషూట్లు చేసేస్తున్నారు క్రికెటర్లు. దీనికి తోడు సోషల్ మీడియాలో హడావుడి సరేసరి. కొంతమంది యూట్యూబ్ ఛానెళ్లు పెట్టారు. మరికొందరు ఫాలోవర్లను పెంచుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్ నే షూటింగ్ స్పాట్ గా మార్చేస్తున్నారు. ఈ గందరగోళంలో పడి.. అసలు టీమ్ స్పిరిట్ అంటే ఏంటో తెలియకుండా పోతోంది. రెగ్యులర్ గా టీమ్ మీటింగ్స్ జరిగే అవకాశమే లేదు. చివరకు టీమ్ మేనేజర్ కూడా ఆటగాళ్లంతా కనిపిస్తే పండగే అనుకునే దుస్థితి.
యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి తెరపైకి తెచ్చిన ఐపీఎల్.. అసలు ఆటకు ఎసరు పెడుతోంది. ఒక్క సీజన్ ఐపీఎల్ లో ఆడితే లైఫ్ సెటిలైనట్టే. టైమ్ ఉంటే ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడదాం.. లేకపోతే మళ్లీ ఐపీఎల్లో చూస్కుందాం అన్నట్టుగా ఉంది యువ ఆటగాళ్ల ధోరణి. ఐపీఎల్ లో మనీ కంటే క్రికెట్ కు పెద్దపీట వేయకపోతే.. ఊహించని నష్టాలు వస్తాయని మాజీలు హెచ్చరిస్తున్నారు. కానీ ఐపీఎల్ ఇప్పుడు ప్రపంచలోనే సక్సెస్ ఫుల్ స్పోర్ట్స్ బిజినెస్ మోడల్ అయిపోయింది. ఐపీఎల్ ను విమర్శించడం మహాపాపం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఐపీఎల్ కోసం ప్రాణం పెట్టి ఆడుతున్న ఆటగాళ్లు.. టీమిండియాకు వచ్చేసరికి నాన్ సీరియస్ గా ఉంటున్నారు. దీనికి తగ్గట్టుగానే ఫలితాలొస్తున్నాయి.
క్రికెట్ అనేది ఇండియాలో ఓ బలమైన ఎమోషన్. కపిల్ డెవిల్స్ వాల్డ్ కప్ గెలిస్తే.. ప్రపంచాన్ని జయించినంత సంబరపడ్డారు అభిమానులు. ఆటగాళ్లు కూడా మొన్నటిదాకా గెలపోటముల్ని సీరియస్ గా తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఓడినా, గెలిచినా పెద్ద తేడా ఏమీ లేదు. ఎన్ని డబ్బులొచ్చాయనేదే లెక్క. వ్యక్తిగత కారణాలు, విశ్రాంతి పేరుతో కీలక టోర్నీలకు డుమ్మా కొడుతున్న క్రికెటర్లు.. ఆ సమయంలో కూడా అడ్వర్టైజ్ మెంట్లు, ఫోటోషూట్లు మానడం లేదు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ఉన్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. రెస్ట్ తీసుకోవడం ఇలాగేనా అనే ప్రశ్నలు వచ్చినా పట్టించుకోవడం లేదు.
ఆటను ఆటలాగే చూడాలి. ఫలితాన్ని స్పోర్టివ్ గా తీసుకోవాలి. ఈ విషయాలు కరెక్టే. అదే సమయంలో నాన్ సీరియస్ గా ఆడటం.. కచ్చితంగా ఆటకు, దేశానికి, అభిమానులకు ద్రోహం చేసినట్టే. కానీ ఎంతమంది క్రికెటర్లకు ఈ గిల్టీ ఫీలింగ్ ఉందంటే చెప్పడం కష్టమే. బాగా ఆడితే ఐపీఎల్ లో ఛాన్స్ వస్తుంది. టీమిండియాలో ఆడే అవకాశం ఉంటుంది. డబ్బు, పేరు ప్రతిష్ఠలు అదనం. కానీ ఇప్పుడు కాన్సెప్ట్ అది కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా ఉంది పరిస్థితి. ఐపీఎల్ తో ఆటకు అట్రాక్షన్ వచ్చిందనుకున్నారు కానీ.. అసలు ఆత్మే చచ్చిపోయిందనేది ఆలస్యంగా వెలుగుచూస్తున్న వాస్తవం. ఆటగాళ్లు ఫ్రీ టైమ్ లో ఎండార్స్ మెంట్లు చేసే సంస్కృతి పోయి.. మ్యాచులు కూడా వదిలేసి ఫోటోషూట్లే ముఖ్యమనుకునే కల్చర్ నడుస్తోంది. చిన్న దేశాల ఆటగాళ్లు మ్యాచ్ ఫీజులు ఇవ్వకపోయినా.. దేశం కోసం ప్రాణం పెట్టి ఆడుతుంటే.. మన ఆటగాళ్లు మాత్ర ఏటా భారీగా ఫీజులు పెంచుకుంటూ.. ఆటను మాత్రం అటకెక్కించేశారు.
టీమిండియా లో చోటు దక్కించుకోవాలంటే గతంలో దేశవాళీ క్రికెట్ టోర్నీలు అయిన రంజీ ట్రోఫీ , సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే టోర్నీల్లో రాణించాల్సి ఉండేది. ఆ దేశవాళి టోర్నీల్లో అద్బుతంగా రాణించిన క్రికెటర్లను టీమిండియా సీనియర్ టీంకు బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేసేవారు. అయితే ఎప్పుడైతే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి దేశవాళీ క్రికెట్ టోర్నీల ప్రాముఖ్యత తగ్గిపోయింది.
ఒకప్పుడు టీమిండియాకు ట్రయల్ రన్స్ గా ఉన్న రంజీ, సయ్యద్ ముస్తాక్, విజయ్ హజారేలు ఇప్పుడు ఐపీఎల్ కు ట్రయల్ రన్ గా మారిపోయాయి. ఇక టీమిండియాలో ఎంపిక కావాలంటే ఐపీఎల్ లో రాణించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఐపీఎల్ లో అదరగొట్టిన ప్లేయర్లు టీమిండియా తరఫున మాత్రం తేలిపోతున్నారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో భారత్ లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ 27 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. గతేడాది 18 వికెట్లు తీశాడు. 2020లో 21 వికెట్లు తీశాడు. ఇలా గత మూడు ఐపీఎల్ సీజన్లలోనూ చాహల్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో మాత్రం తేలిపోతున్నాడు. మూడు మ్యాచ్ ల్లో కలిపి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.
ఇక బౌలింగ్ లో వేరియేషన్స్ లేకపోయినా ఐపీఎల్ లో రాణిస్తున్నాడనే ఒక్క కారణంతో అవేష్ ఖాన్ ను టీమిండియాకు సెలెక్ట్ చేస్తూనే ఉన్నారు. 2021లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన అతడు ఆ సీజన్ లో 21 వికెట్లు తీశాడు. ఇక ఈ ఏడాది 18 వికెట్లు రాబట్టాడు. దాంతో టీమిండియాలోకి ఎంపికైయ్యాడు. కానీ, అవేష్ ఖాన్ మాత్రం ఇంగ్లండ్ పర్యటన నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ వరకు దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. ఆసియా కప్ లో 2 మ్యాచ్ లు ఆడి రెండు వికెట్లు తీశాడు. కానీ, ఓవర్ కు 12 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. ఆసియా కప్ లో 6 ఓవర్లు వేసి 72 పరుగులు ఇచ్చాడు.
వీరిద్దరి తర్వాత ఉన్నది కేఎల్ రాహుల్. ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ రన్ మెషీన్ లా ఉన్నాడు. 2018 నుంచి ప్రతి సీజన్ లోనూ 500కు పైగా పరుగులు సాధిస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది అయితే 616 పరుగులు చేశాడు. కానీ, టీమిండియాకు మాత్రం ఆ స్థాయిలో ఆడటం లేదు.
చూస్తే.. జట్టు మామూలుగా లేదు. ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో పొట్టి ఫార్మాట్లో ఆరితేరినవారే. అందుకే రాబోతున్న టీ20 ప్రపంచకప్‌లో గట్టి పోటీదారుగా భావిస్తున్న టీమ్‌ఇండియా.. ఆసియాకప్‌లోనైతే తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. బుమ్రా లేకున్నా.. జడేజా అర్ధంతరంగా నిష్క్రమించినా ఏమాత్రం అంచనాలు తగ్గలేదు. జట్టు బలంపై అంత నమ్మకం. కానీ టీమ్‌ఇండియాకు షాక్! ఆ జట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకూ షాక్! ఇలాగే కొనసాగితే ఆసియా కప్‌లోని మిగిలిన ఒక మ్యాచ్‌తోపాటు వచ్చే ప్రపంచకప్‌లోనూ టీమ్‌ఇండియాకు ఇబ్బందులు తప్పవు. యువ బౌలర్లు ఒత్తిడికి గురవుతారని.. సీనియర్‌కు బౌలింగ్ ఇస్తే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. డెత్ ఓవర్లలో పరుగులు నియంత్రించడం ఎంత కీలకమో ఇప్పటికైనా భారత ఆటగాళ్లు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రికెట్ అంటే ఎంటర్ టైన్ మెంట్ కాదు.. కోట్లాది మంది అభిమానుల సెంటిమెంట్ అని గుర్తుంచుకోవాలి. మ్యాచ్ అన్నాక ఏదో ఒక జట్టే గెలుస్తుంది.. ఈరోజు మనకు కలిసిరాలేదు అని చెప్పుకుంటూ పోతే.. టీమిండియా జీరో స్థాయికి పడిపోయే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా లోటుపాట్లు సరిచేసుకుని.. మునుపటి ఫామ్ అందుకోకపోతే.. చిన్న టీమ్ కూడా మనల్ని లెక్కచేసే పరిస్థితి ఉండదు. ప్రపంచంలో ఏ క్రికెట్ జట్టుకూ లేనన్ని వనరులు టీమిండియాకు ఉన్నాయి. డబ్బుకు కొదువ లేదు. సౌకర్యాల సంగతి అడగక్కర్లేదు. మ్యాచ్ ఫీజులు, బీసీసీఐ కాంట్రాక్టులు కూడా భారీగానే ఉన్నాయి. ఎటొచ్చీ అసలైన ఆటే పడకేసింది. ఐపీఎల్ తర్వాత టీమిండియా ప్రదర్శన ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. దాయాది పాకిస్తాన్ కు చెందిన మాజీ ఆటగాళ్లు కూడా జాలిపనేంత దయనీయంగా ఉంది మన టీమ్ పరిస్థితి.
నిజానికి టీమిండియా ఆటగాళ్లు అంత అధ్వాన్నంగా ఏమీ లేరు. గతంలో ఎప్పుడూ లేనంత బలంగా ఉంది టీమ్. ఎప్పుడూ లేని విధంగా కెప్టెన్సీ చేయగలిగే ఐదారుగురు ఆటగాళ్లు, కీపింగ్ చేయగలిగే ముగ్గురు ప్లేయర్లు, ఆరు నుంచి ఏడు బౌలింగ్ ఆప్షన్లు, ఇద్దరు ఆల్ రౌండర్లు అందుబాటులో ఉన్నారు. అయినా సరే ఎవరికీ రెగ్యులర్ ప్లేస్ లేదు. ఎవరి స్థానానికీ గ్యారెంటీ లేదు. ఎవరెప్పుడు ఎలా ఆడతారో ఎవరికీ తెలియదు. టీమ్ ఆటతీరుపై కెప్టెన్, కోచ్ కే అవగాహన లేకపోతే.. కీలక సమయాల్లో జట్టును ఎలా ఎంపిక చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆసియా కప్ లో వైఫల్యం టీమిండియా పేలవ ఫామ్ నే కాదు.. భవిష్యత్ అవకాశాల్ని కూడా సంక్లిష్టం చేస్తోంది. టీమ్ లో అందరూ మ్యాచ్ విన్నర్లే. కానీ ఎవర్నీ నమ్మలేని స్థితి. ఇంత విచిత్రమైన పరిస్థితి మరే టీమ్ లో లేదు. సరిగ్గా ప్రపంచ కప్ కు ముందు టీమిండియాలో ఇంత కన్ఫ్యూజన్ అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా మెరుగైన ఆటతీరు చూపిస్తారా.. లేకపోతే ఎప్పటిలాగే లైట్ తీస్కుంటారా అనేది టీమిండియా ఆటగాళ్లు తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది.