విజయ్ హజారే ట్రోఫీ 2025-26 మూడో రౌండ్ మ్యాచ్‌లు నేడు ఆరంభం అయ్యాయి. ఈరోజు ఢిల్లీ, సౌరాష్ట్ర.. ముంబై, ఛత్తీస్‌గఢ్ టీమ్స్ తలపడుతున్నాయి. ఢిల్లీ జట్టు తరఫున కింగ్ విరాట్ కోహ్లీ, ముంబై టీమ్ తరఫున హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బరిలోకి దిగలేదు. బీసీసీఐ అల్టిమేటం ప్రకారం.. రోహిత్, కోహ్లీలు విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఇప్పటికే ఆడారు. ఇక జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం రో-కోలు జాతీయ జట్టుతో త్వరలో కలవనున్నారు.
అయితే విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో మరో మ్యాచ్ ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 6న ఢిల్లీ, రైల్వేస్ మధ్య జరిగే మ్యాచ్‌లో కింగ్ బరిలోకి దిగనున్నాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ట్రోఫీలో మొదటి మ్యాచ్‌లో సెంచరీ (131) చేసిన కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (77) బాదాడు. ఇక రోహిత్ శర్మ మాత్రం మరో మ్యాచ్ ఆడే అవకాశం లేదు. తొలి మ్యాచ్‌లో సెంచరీ (155) బాదిన హిట్‌మ్యాన్.. రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన రో-కోలు కేవలం వన్డేల్లోనే మాత్రమే కొనసాగుతున్నారు.