ICC Latest ODI Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో టాప్-10 జాబితాలో టీమిండియా నుంచి ఇద్దరే ఆటగాళ్లకు చోటు దక్కింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక పాయింట్ కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. అతడి ఖాతాలో 790 పాయింట్లు ఉన్నాయి. అటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ ఖాతాలో 786 పాయింట్లు ఉన్నాయి. వన్డే ర్యాంకుల్లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 892 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలోనూ పాకిస్థాన్ ఆటగాడే ఉన్నాడు. ఇమాముల్ హక్ 815 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు వాండర్ డస్సెన్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో డస్సెన్ సెంచరీతో మెరిశాడు.
Read Also: Best Camera Phones: రూ. 20 వేలలోపు లభ్యమయ్యే టాప్-10 కెమెరా ఫోన్స్
అటు వన్డే టీమ్ ర్యాంకుల్లో టీమిండియా మూడో స్థానానికి చేరింది. ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో సిరీస్ గెలవడంతో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి 109 పాయింట్లతో టీమిండియా మూడో స్థానాన్ని ఆక్రమించింది. 128 పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా 121 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. అటు ఐసీసీ వన్డే ర్యాంకుల్లో ఆస్ట్రేలియా (101 పాయింట్లు) ఐదో స్థానంలో, దక్షిణాఫ్రికా (99 పాయింట్లు) ఆరో స్థానంలో, బంగ్లాదేశ్ (98 పాయింట్లు) ఏడో స్థానంలో, శ్రీలంక (92 పాయింట్లు) 8వ స్థానంలో, వెస్టిండీస్ (70 పాయింట్లు) 9వ స్థానంలో, ఆప్ఘనిస్తాన్ (69 పాయింట్లు) 10వ స్థానంలో కొనసాగుతున్నాయి.
మరోవైపు ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఇప్పటి వరకు మొదటి ర్యాంకులో ఉన్న టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా స్థానాన్ని న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ 704 పాయింట్లతో కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్ వన్డేలో చివరి మ్యాచ్‌కు బుమ్రా దూరం కావటంతో ఈ మార్పు జరిగింది. బుమ్రా 703 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.