Virat Kohli Breaks Rahul Dravid Record: నిన్న పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించి, భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన విషయం తెలిసిందే! పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌ను.. తన చారిత్రక ఇన్నింగ్స్‌తో భారత్‌ను లాక్కొచ్చి, అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఈ క్రమంలోనే కోహ్లీ కొన్ని అరుదైన రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో చేసిన అర్థశతకంతో కోహ్లీ ఐసీసీ టోర్నీల్లో మొత్తం 24 హాఫ్ సెంచరీలు చేశాడు. దీంతో.. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక అర్థశతకాలు చేసిన సచిన్ రికార్డ్‌ని (23) బద్దలుకొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నాళ్లూ రోహిత్ శర్మ పేరిట అత్యధిక పరుగుల (143 మ్యాచ్‌ల్లో 3741) రికార్డ్‌ను.. 110 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ (3794 పరుగులు) బ్రేక్ చేసి టాప్ స్కోరర్‌గా అవతరించాడు. అంతేకాదు.. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (14), టీ20ల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక సార్లు నాటౌట్‌గా (18) నిలిచిన క్రికెటర్‌గానూ అవతరించాడు. వీటితో పాటు మరో ఘనతని సైతం తన పేరిట లిఖించుకున్నాడు.
అన్ని ఫార్మాట్లలో కలిపి.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్‌ని కోహ్లీ వెనక్కు నెట్టి, ఆరో స్థానానికి ఎగబాకాడు. ద్రవిడ్ 509 ఇన్నింగ్స్‌లో 45.41 సగటున 24,208 పరుగులు చేయగా (48 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలు).. విరాట్ మొత్తం 528 మ్యాచ్‌ల్లో 53.80 సగటున 24,212 పరుగులు (71 సెంచరీలు, 126 హాఫ్ సెంచరీలు) చేశాడు. ఈ జాబితాలో సచిన్ (34,357) అగ్రస్థానంలో ఉండగా.. కుమార సంగక్కర (28,016), రికీ పాంటింగ్ (27,483), మహేల జయవర్దనే (25,957), జాక్ కలిస్ (25,534) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు.