సఫారీ గడ్డపై టెస్ట్ ఫైట్‌కు సిద్ధమైంది… టీమిండియా. ఇప్పటివరకూ అందని టెస్ట్ సిరీస్‌ను… ఈసారి ఎలాగైనా సాధించాలన్న కసితో ఉంది. మరోవైపు ప్రొటీస్ కూడా సొంతగడ్డపై కోహ్లీ సేనను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత ప్రాభవం కోల్పోయిన జట్టును… మళ్లీ తలెత్తుకునేలా చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగబోతున్నారు.
ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటనల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా… ఇవాళ్టి నుంచి సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ వేట మొదలెట్టబోతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా కనిపిస్తున్న కోహ్లీ సేన.. దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోబోతోంది. గాయం కారణంగా రోహిత్ శర్మ దూరమవడంతో… కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగబోతున్నారు.
పుజారా, కోహ్లీ, రిషబ్‌పంత్‌లతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే కనిపిస్తోంది. అయితే, ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. న్యూజిలాండ్‌తో కాన్పూర్ టెస్టులో సెంచరీతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్.. గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న తాజా మాజీ వైస్‌కెప్టెన్ అజింక్య రహానే, తెలుగు ఆటగాడు హనుమ విహారి ఐదో స్థానం కోసం పోటీ పడుతున్నారు. సఫారీ గడ్డపై మంచి రికార్డు ఉన్న రహానే వైపు కోహ్లీ మొగ్గుచూపుతాడా? లేక ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌పై నమ్మకముంచుతాడా? అనేది చూడాలి.
ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగబోతున్నట్లు ఇప్పటికే కోచ్ రాహుల్ ద్రవిడ్ హింట్ ఇవ్వడంతో… బుమ్రా, మహమ్మద్ సిరాజ్, షమీతో పాటు శార్దూల్ ఠాకూర్ తుదిజట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్ బరిలోకి దిగబోతున్నాడు.
ఇక దక్షిణాఫ్రికా జట్టు విషయానికొస్తే… సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత… ఆ టీమ్ డీలా పడింది. బోర్డు ఆర్థిక నష్టాలు కూడా ఆటగాళ్లపై ప్రభావం చూపాయి. ఇప్పుడు ప్రపంచ అత్యుత్తమ జట్టుపై సొంత గడ్డ మీద విజయం సాధించడం ద్వారా… తిరిగి పూర్వ వైభవాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉంది… సఫారీ టీమ్.
ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. పచ్చికతో నిండిన సెంచూరియన్ పిచ్‌పై తొలి రోజు నుంచే సీమర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉండగా.. మ్యాచ్ సాగే కొద్దీ మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. తొలి రెండు రోజుల్లో వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించే వచ్చనేది… లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.