Team India Coach Rahul Dravid Tested Covid Positive:ప్రతిష్టాత్మక ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. రేపో.. మాపో టీమిండియా యూఏఈకి బయలుదేరాల్సి ఉండగా.. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ ఐదురోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో టీమిండియా యూఏఈకి ఆలస్యంగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియాకప్ టోర్నీకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ కోచ్ ద్రవిడ్‌కు కరోనా రావడంతో జట్టు సభ్యుల్లో కొంత ఆందోళన మొదలైంది. టోర్నీలో ద్రవిడ్ పాల్గొనడం ప్రశ్నార్థకంగా మారడంతో ఆయన స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ టీమ్‌తో వెళ్లే అవకాశం ఉందని జోరుగా చర్చ జరుగుతోంది. ఆసియాకప్ కోసమే కోచ్ ద్రవిడ్‌తో సహా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో పాటు సీనియర్ సెలక్షన్ కమిటీ స్టాఫ్ జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నారు.
Read Also: Mobile Prices: మొబైల్ కొనుగోలు చేసేవాళ్లకు షాక్.. త్వరలోనే పెరగనున్న ధరలు
ఈనెల 28న పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ ఉండటంతో టీమిండియా పర్యవేక్షణ బాధ్యతలను ద్రవిడ్ స్థానంలో లక్ష్మణ్‌కు బీసీసీఐ అప్పగించనున్నట్లు తెలుస్తోంది. భారత్- పాక్ మ్యాచ్‌కు కేవలం 4 రోజుల గ్యాపే ఉండడంతో లక్ష్మణ్‌ను యూఏఈకి పంపడం లాంఛనంగానే కనిపిస్తోంది. ఇటీవల జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు రాహుల్ ద్రవిడ్ గైర్హాజరు కావడంతో ప్రధాన కోచ్ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్ తీసుకున్నాడు. ఇప్పుడు కూడా ఆసియా కప్ కోసం జట్టు పర్యవేక్షణ బాధ్యతలను లక్ష్మణ్ తీసుకోనున్నాడు. ఒకవేళ మ్యాచ్ నాటికి ద్రవిడ్‌కు కరోనా నెగిటివ్ వస్తే అతడు టీమ్‌తో కలిసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆసియా కప్‌లోని సగం మ్యాచ్‌లకు ద్రవిడ్ దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది.