Mobile Prices: మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవాళ్లకు చేదువార్త అందింది. దేశవ్యాప్తంగా త్వరలోనే మొబైల్ ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొబైల్ డిస్‌ప్లేకు అనుసంధానించే స్పీకర్లు, సిమ్ ట్రేలు, పవర్ కీల దిగుమతులపై 15% సుంకం విధిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్& కస్టమ్స్(CBIC) ప్రకటించింది. ఈ భారాన్ని ఆయా కంపెనీలు వినియోగదారులపైనే మోపే అవకాశం ఉంది. ఇదే జరిగితే స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నాయి. చాలా కంపెనీలు ఇండియాలోనే స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నప్పటికీ విడిభాగాలను మాత్రం చైనా, ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి.
Read Also: China Interest Rates: చైనాలో రియల్ సంక్షోభం.. వడ్డీ రేట్ల తగ్గింపు
ప్రస్తుతం మొబైల్ ఫోన్ల డిస్‌ప్లేపై కేంద్ర ప్రభుత్వం 10 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తోంది. డిస్‌ప్లే అసెంబ్లీ తయారీలో వినియోగించే భాగాలపై సుంకం ఏమీ విధించడం లేదు. అయితే ఇకపై సిమ్ ట్రే, యాంటెన్నా పిన్, స్పీకర్ నెట్, పవర్ కీ, స్లైడర్ స్విచ్, బ్యాటరీ భాగం, ఫింగర్ ప్రింట్‌కు ఉపయోగపడే ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్‌లు డిస్‌ప్లేతో వచ్చినా, విడిగా దిగుమతి చేసుకున్నా 15 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది. చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీలు ఒప్పో, వివో ఇటీవల పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్నాయి. అయితే మొబైల్ భాగాలకు సంబంధించిన కస్టమ్స్ నిబంధనల పట్ల స్పష్టత లేకపోవడం వల్లే పొరపాటు జరిగిందని పేర్కొన్నాయి. దీంతో సుంకం ఎగవేతలను నివారించేందుకే ఈ స్పష్టత ఇస్తున్నట్లు సీబీఐసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు ఇప్పుడు 15 శాతం పన్ను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మొబైల్ తయారీ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.