IND Vs BAN: బంగ్లాదేశ్ పర్యటనలో తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్ కోల్పోయిన టీమిండియా ఎట్టకేలకు జూలు విదిల్చింది. మూడో వన్డేలో భారీ స్కోరు చేసింది. చిట్టగ్రామ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతడు కెరీర్‌లో చేసిన తొలి వన్డే సెంచరీని చిరస్మరణీయం చేసుకున్నాడు. 131 బంతుల్లో 10 సిక్సర్లు, 24 ఫోర్లతో ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు. అతడికి విరాట్ కోహ్లీ మంచి సహకారం అందించాడు. విరాట్ కోహ్లీ కెరీర్‌లో 44వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడు 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ తప్ప జట్టులో మరెవరూ కనీసం హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయారు.
Read Also: Kollu Ravindra: వైసీపీకి బీసీల దమ్మేంటో త్వరలోనే చూపిస్తాం
ఓపెనర్ శిఖర్ ధావన్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలం అయ్యాడు. అతడు కేవలం 3 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. అటు ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా మారిన కేఎల్ రాహుల్ కూడా వైఫల్యాలను కొనసాగిస్తున్నాడు. విధ్వంసకర సెంచరీ బాదిన ఇషాన్ కిషన్‌పై నెటిషన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో తొలి వన్డే నుంచి ఇషాన్ కిషన్‌ను ఆడించినా సరిపోయేదని కామెంట్ చేస్తున్నారు. నిన్ను తక్కువ అంచనా వేసార్రా బుడ్డోడా అంటూ కొందరు నెటిజన్‌లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే 410 పరుగులు చేయాలి. ఒక దశలో టీమిండియా 450కి పైగా పరుగులు చేస్తుందని అభిమానులు భావించారు. కానీ చివరి 10 ఓవర్లలో బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కేవలం 400 పరుగుల మార్కును మాత్రమే టీమిండియా దాటగలిగింది.