Kollu Ravindra: టీడీపీ బీసీ సాధికార కమిటీ ఛైర్మన్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ సోదరులను కనీసం కూర్చోబెట్టి మాట్లాడకుండా సీఎం జగన్ అవమానించారని ఆరోపించారు. వైసీపీకి బీసీలంటే ఓటు బ్యాంక్ మాత్రమే కానీ బ్యాక్ బోన్ కాదన్నారు. బీసీలకు పెద్ద పీట వేస్తామని విజయవాడ సాక్షిగా జగన్ బహిరంగంగా ప్రకటించారని.. పెద్ద పీట వేయడమంటే నిల్చోబెట్టి అవమానించడమేనా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుర్చీలో కూర్చొని.. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, నాయకులను నిల్చోని మాట్లాడటం యావత్ బీసీ సోదరులందరికి అవమానకరం అని విమర్శించారు. ఇదేనా బీసీల పట్ల వైసీపీకున్న గౌరవం అని నిలదీశారు. ఒక బీసీ మంత్రితో మోకాళ్ల దండంతో మోకరిల్లించుకున్నారని.. బడుగు, బలహీన మంత్రుల అధికారాలను లాక్కొని సామంత రాజులకు అప్పగించారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
Read Also: Vizag Chit Fund Fraud: చిట్టీ పేరుతో కుచ్చుటోపీ.. నాలుగు కోట్లతో పరార్
వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 42 నెలల్లో 26 మంది బీసీలను హత్య చేశారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు చేశారు. 2,650 మంది బీసీ సోదరులపై దాడులకు పాల్పడ్డారన్నారు. బీసీలను అణచేసి తమ అదుపులో పెట్టుకోవాలని వైసీపీ చూస్తోందన్నారు. బీసీ పీకలపై కత్తులు పెట్టి స్వార్ధానికి వాడుకుని వైసీపీ నేతలు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని కొల్లు రవీంద్ర విమర్శలు చేశారు. బీసీల దమ్మేంటో త్వరలోనే వైసీపీకి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ స్వార్ధపూరిత రాజకీయాలను బీసీలు గమనిస్తున్నారని కొల్లు రవీంద్ర చెప్పారు.