Suryakumar Yadav Catch in IND vs SA Final: 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా మాజీ బౌలర్ ఎస్ శ్రీశాంత్ పట్టిన క్యాచ్ భారత క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బాదిన సిక్సర్ భారత క్రికెట్‌లోనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలో కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఇక 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ కూడా ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేకంగా నిలవనుంది.
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరం అయ్యాయి. క్రీజులో డేవిడ్ మిల్లర్ ఉండడంతో భారత అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతిని మిల్లర్ భారీ షాట్ ఆడగా.. అది సిక్సర్ వెళ్లేలా కనిపించింది. లాంగాఫ్ నుంచి మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. ఒక్కసారిగా బంతిని అందుకున్నాడు. క్యాచ్ పట్టక నియంత్రణ కోల్పోయిన సూర్య.. బౌండరీ లైన్ దాటాడు. అయితే బౌండరీ లైన్ దాటేలోపే బంతిని గాల్లోకి విసిరాడు. తిరిగి మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు.
Also Read: Virat Kohli Retirement: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ!
సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్‌కు డేవిడ్ మిల్లర్ పెవిలియన్ చేరక తప్పలేదు. ఆపై హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్‌తో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఒకవేళ సూర్య క్యాచ్ పట్టకుంటే.. మిల్లర్ కొట్టిన షాట్ కచ్చితంగా సిక్స్ వెళ్లేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేదేమో. ఈ క్యాచ్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సూపర్ క్యాచ్‌తో మ్యాచ్‌ను టర్న్ చేసిన సూర్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సూర్యా భాయ్ భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్ పట్టావ్, సూర్యకుమార్ సెన్సేషనల్ క్యాచ్, సూర్యకుమార్ సూపర్ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.