టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్నా ఇంకా ఈ సినిమా మేనియా నడుస్తూనే ఉంది. ఈ సినిమాకు క్రికెటర్లు మరింత పబ్లిసిటీ తెచ్చి పెడుతున్నారు. ఇప్పటికే మన దేశ క్రికెటర్లు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా క్రికెట్ డేవిడ్ వార్నర్ కూడా పుష్ప సినిమాలోని పాటలకు స్టెప్పులు వేస్తూ అలరించాడు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేసి అలరించాడు.
తాను ఇటీవల పుష్ప సినిమా చూశానని, అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడని సురేష్ రైనా ప్రశంసలు కురిపించాడు. అల్లు అర్జున్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించాడు. శ్రీవల్లి పాటకు ఏదో ఇలా డ్యాన్స్ చేస్తున్నానని తెలిపాడు. ఇటీవల భారత క్రికెటర్ రవీంద్ర జడేజా మరోసారి పుష్ప రాజ్‌లా తయారై సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు విదేశాల్లో పలువురు చిన్నారులు కూడా పుష్ప సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.