Team India: ముంబై రంజీ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నా అతడికి టీమిండియాలో చోటుదక్కలేదని పలువురు బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. కానీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం సెలక్టర్లపై విమర్శలకు దిగుతుండటం పలువురికి నచ్చడం లేదు. అయితే తాజాగా సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషధ్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తెలిసీ తెలియని వయసులో సర్ఫరాజ్ తనతో చెప్పిన మాటల్ని నౌషధ్ గుర్తు చేసుకున్నాడు. చిన్నతనం నుంచి చిన్నాచితక పనులు చేస్తూ తన కుమారుడిని క్రికెటర్‌ను చేశానని.. ఈ క్రమంలో ఒకసారి తన కుమారుడు అన్న మాటలు విని తన నోట మాట రాలేదని వివరించాడు.
Read Also: ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే..
క్రికెట్ దేవుడుగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌తో సర్ఫరాజ్ చిన్నతనంలో ఎక్కువ క్రికెట్ ఆడాల్సి వచ్చిందని నౌషధ్ తెలిపాడు. అయితే ఓ సందర్భంలో అర్జున్ గురించి సర్ఫరాజ్ మాట్లాడుతూ ‘అర్జున్ టెండూల్కర్ ఎంత లక్కీనో కదా నాన్న. తను సచిన్ కొడుకు. అతడి దగ్గర అన్నీ ఉన్నాయి. కార్లు, ఐప్యాడ్లు..’ అంటూ సర్ఫరాజ్ అన్నాడని.. ఆ మాటలకు తనకు ఏం చెప్పాలో తెలియలేదని గుర్తుచేసుకున్నాడు. కాసేపటికే సర్ఫరాజ్ తన దగ్గరకు పరుగెత్తుతూ వచ్చి ‘అయినా కూడా అర్జున్ కంటే నేనే అదృష్టవంతుడిని. నువ్వు రోజంతా నాతో ఉంటావు. కానీ అతని తండ్రి సమయం కేటాయించలేడు’ అని చెప్పాడని నౌషధ్ కన్నీటి పర్యంతమయ్యాడు.