టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా కూర్పు ఎలా ఉంటుందో అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. యూఏఈలో పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువగా అనుకూలిస్తున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలా లేదా ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలా అన్న అంశంపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ఆడించకుండా ఇషాన్ కిషన్‌ను పరీక్షించారు. ఈ టెస్టులో నూరు శాతం ఇషాన్ పాసయ్యాడు. ముఖ్యంగా అతడు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను టీమిండియా చేతుల్లో పెట్టాడు. దీంతో అసలు పోరులో ఓపెనింగ్‌కు ఎవరు దిగుతారో సందిగ్ధం నెలకొంది. అయితే ఈ విషయంపై విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు. రోహిత్-రాహుల్ జోడీనే బరిలో దిగుతుందని అతడు స్పష్టం చేశాడు.
కాగా బుధవారం నాడు ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో వార్మప్ మ్యాచ్‌లో అయినా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దిగుతాడా లేదా అని అభిమానులు ఎదురుచూస్తుండగా టీమ్ మేనేజ్‌మెంట్ శుభవార్తను చెప్పింది. దీంతో రెండో వార్మప్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ స్థానంలో రోహిత్ ఆడనున్నాడు. ఒకవేళ రాహుల్‌కు మరింత ప్రాక్టీస్ అవసరమని టీమ్ భావిస్తే ఇషాన్ కిషన్ డగౌట్‌కే పరిమితం అవుతాడు. మరోవైపు తొలి వార్మప్ మ్యాచ్‌లో విఫలమైన కోహ్లీ రెండో వార్మప్‌లో సత్తా చాటి మెగా టోర్నీకి ముందు రిథమ్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా ఆడేది అనుమానంగా మారింది. అతడి స్థానంలో రవీంద్ర జడేజా ఆడతాడని సమాచారం. వరుణ్ చక్రవర్తి, శార్దూల్ ఠాకూర్ కూడా బరిలోకి దిగుతారని టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. అయితే వారు ఎవరి స్థానాలను భర్తీ చేస్తారో స్పష్టత రావాల్సి ఉంది.