Team India: టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతడి స్థానంలో మరో ఆటగాడిని త్వరలో ఎంపిక చేస్తామని తెలిపింది. దీంతో బుమ్రా స్థానంలో ఎవరు ఎంపికవుతారనే చర్చలు మొదలయ్యాయి. సీనియర్ బౌలర్ షమీని తీసుకుంటారా లేదా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రాణించిన దీపక్ చాహర్‌ను ఎంపిక చేస్తారా అంటూ పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సునీల్ గవాస్కర్ లాంటి మాజీ క్రికెటర్లు అయితే బుమ్రా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అభిప్రాయపడుతున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మనసులో ఏముందో అన్న ఉత్కంఠ మొదలైంది.
Read Also: Jammi Chettu: విజయ దశమి రోజు జమ్మి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారు..? ఏమిటా కథ..?
దక్షిణాఫ్రికాతో మూడో టీ20 ముగిసిన తర్వాత ఈ విషయంపై రోహిత్ స్పందించాడు. బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకోవాలో ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. బుమ్రా దూరమైన నేపథ్యంలో ఆస్ట్రేలియాలో బౌలింగ్ చేసిన అనుభవం ఉన్న బౌలర్ కోసం చూడాలని.. ఆ బౌలర్ ఎవరన్నది తెలియదన్నాడు. ప్రస్తుతానికి ఫలితంతో సంబంధం లేకుండా తాము ఓ టీమ్‌గా మెరుగుపడటంపైనే దృష్టి సారించామని రోహిత్ తెలిపాడు. తమ బౌలింగ్‌పై మరింత శ్రద్ధ వహించాల్సి ఉందన్నాడు. ప్రపంచకప్‌కు ఎంపికైన టీమ్‌లో చాలా మంది ఇప్పటివరకు ఆస్ట్రేలియా వెళ్లలేదని.. వాళ్లకు అక్కడ కండిషన్స్ తెలియవని రోహిత్ అన్నాడు. అందుకే ముందుగానే ఆస్ట్రేలియా వెళ్లి పెర్త్‌లోని పేస్ కండిషన్స్‌కు అలవాటు పడాలని భావిస్తున్నామని పేర్కొన్నాడు. కాగా రోహిత్ మాటలను బట్టి చూస్తే అనుభవం ఉన్న షమీనే బుమ్రా స్థానంలో తీసుకుంటారని స్పష్టమవుతోంది. మరి కరోనా నుంచి కోలుకున్న షమీ ఫిట్‌గా ఉన్నాడో లేదో తెలియాల్సి ఉంది.