Ranji Trophy: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అతడిని సెలక్టర్లు మాత్రం కరుణించడం లేదు. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీలో పృథ్వీ షా కసితీరా ఆడుతున్నాడు. అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్ సెంచరీతో రాణించి తనకు టీమిండియాలో స్థానం కల్పించాలంటూ పరోక్షంగా సంకేతాలు పంపించాడు. ఈ మ్యాచ్‌లో ఒక దశలో పృథ్వీ షా 400 పరుగులు చేస్తాడని అభిమానులు భావించారు. కానీ 379 పరుగులు చేసి అవుటయ్యాడు. 383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సులతో పృథ్వీ షా 379 పరుగులు చేసి మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
Read Also: Tegimpu Review: తెగింపు మూవీ రివ్యూ
పృథ్వీ షా విజృంభణతో రెండో రోజు లంచ్ సమయానికి ముంబై మూడు వికెట్ల నష్టానికి 598 పరుగులు చేసింది. అటు ముంబై జట్టు కెప్టెన్ ఆజింక్యా రహానె కూడా సెంచరీతో రాణించాడు. అతడు 131 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కెప్టెన్ రహానె కూడా టీమిండియాలో చోటు కోసం కష్టపడుతున్నాడు. అతడు ఈ మ్యాచ్‌లో ఇంకా ఎన్ని పరుగులు జోడిస్తాడో చూడాలి. కాగా విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ ట్రోఫీల్లో యువ ఆటగాడు పృథ్వీ షా రాణిస్తున్నా.. అతనికి భారత జట్టులో చోటు దక్కడం లేదు. అయితే ధాటిగా ఆడగలిగే పృథ్వీ షాను జట్టులోకి తీసుకోవాలని, అతడిని జట్టుకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ లాంటి మాజీ ఆటగాళ్లు టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచిస్తున్నారు.