Cricket: ఆసియా కప్ 2023 విషయంలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం నెలకొంది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌లో పాల్గొనేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆసియా కప్‌ను తటస్థ వేదికలో నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌పై ఒత్తిడి తెస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. అయితే పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌ను ఇండియా బాయ్‌కాట్ చేస్తే.. వచ్చే ఏడాది ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌ను తాము బాయ్‌కాట్ చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా అంటున్నారు. అయితే జైషా ప్రకటన పీసీబీకి కోపం తెప్పించిందని తెలుస్తోంది. దీంతో ఈ అంశాన్ని వచ్చే నెలలో మెల్‌బోర్న్‌లో జరగబోయే ఐసీసీ బోర్డ్ మీటింగ్‌లో లేవనెత్తుతామని పీసీబీ అధికార ప్రతినిధి వెల్లడించారు.
Read Also: NASA: విశ్వంలో శక్తివంతమైన పేలుళ్లు.. గుర్తించిన నాసా
అటు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్‌కు ఇండియా టీమ్‌ను పంపించడంపై చర్చ జరుగుతుందని తాము ఊహించామని, అయితే ఇలా ప్రకటన వస్తుందని మాత్రం అనుకోలేదని పీసీబీ అధికార ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ టోర్నీని తటస్థ వేదికకు మార్చే అంశాన్ని పరిశీలిస్తామని జైషా ఏ హోదాలో చెప్పారని ఆయన ప్రశ్నించారు. అటు సోషల్ మీడియాలో పీసీబీని పాకిస్థాన్ ఫ్యాన్స్ రెచ్చగొడుతున్నారు. భారత్ వేదికగా జరిగే 2023 వన్డే ప్రపంచకప్‌ను పాకిస్థాన్ బాయ్‌కాట్ చేయాలని.. అప్పుడు బీసీసీఐ, ఐసీసీకి భారీ నష్టం వాటిల్లుతుందని, పాకిస్థాన్ లేకుండా టోర్నీని ఎలా నిర్వహిస్తారో చూద్దామని పలువురు నెటిజన్‌లు కామెంట్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.