ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్ పై ఉన్న అజేయ రికార్డు చెరిగిపోయింది. కోట్లాది మంది హృదయాలను బద్దలు చేస్తూ.. టీమిండియా చెత్తగా ఆడి.. చిత్తుగా ఓడిపోయింది. ఓటమి కంటే ఓడిన తీరే ఎక్కువ బాధిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాక్ తో మ్యాచ్ లో టీమిండియాకు ఏదీ కలిసి రాలేదు. పసలేని ఆట, వ్యూహాత్మక తప్పిదాలు తీవ్రంగా దెబ్బతీశాయి. అసలు టీమిండియా గేమ్ ప్లాన్ ఎక్కడ ఫెయిలైంది..? పాక్ ను తక్కువగా అంచనా వేశారా..? అతి విశ్వాసంతో బోర్లాపడ్డారా..?
2021 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్ 10 వికెట్ల తేడాతో టీమిండియాపై అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన పూర్తిగా తేలిపోయింది. అన్ని విభాగాల్లో విఫలమైంది.
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో వరుసగా భారత్ చేతిలో ఓడిపోతూ వచ్చిన పాకిస్థాన్ జట్టు దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన పూర్తిగా తేలిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైంది. ఫలితంగా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. టాప్ ఆర్డర్ వైఫల్యం, ఫామ్‌లో లేని మిడిల్ ఆర్డర్.. పేలవ బౌలింగ్.. ఇలా ఒకటేమిటి భారత్ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. రోహిత్ డకౌట్ కాగా.. రాహుల్ 3 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరూ వెంటవెంటనే అవుట్ కావడంతో మిడిల్ ఆర్డర్‌పై పూర్తి భారం పడింది. అంచనాలు మించి రాణిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులు చేయగా.. కెప్టెన్ కోహ్లీకి, పంత్ దన్నుగా నిలిచి స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. అయితే పంత్ అవుట్ అయ్యాక హార్దిక్ కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. బ్యాట్‌తో మెరుపులు ఏం మెరిపించకుండానే పెవిలియన్ చేరాడు. మొత్తానికి కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు.
అశ్విన్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగాడు. నాలుగు ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చాడు. ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. అశ్విన్ బరిలోకి దిగి ఉంటే.. అతడి అనుభవం కచ్చితంగా ఉపయోగపడేది. ఫామ్‌లో లేని భువనేశ్వర్‌ను శార్దూల్ స్థానంలో తీసుకోవడం టీమిండియాకు మైనస్ అయింది. శార్దూల్ ఠాకూర్.. అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. అతడిని ఎందుకు జట్టులోకి తీసుకోలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ.. సీనియర్ బౌలర్లు అయినా.. పూర్తిగా తేలిపోయారు. అసలు మెంటార్‌గా ధోని సలహాలు ఇచ్చాడా.? లేదా మొత్తం కోహ్లీ ప్లానా.? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి అయితే కోహ్లి ప్లాన్ మరోసారి బెడిసికొట్టిందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అటు పాకిస్తాన్ మాత్రం అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు.
అంతా వన్‌సైడ్.. మామూలుగా చిరకాల ప్రత్యర్థితో పోరంటే ఎన్ని ట్విస్ట్ లు ఉన్నా.. చివరికి విజయం మాత్రం మనల్నే వరించేది. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. టాస్ దగ్గర నుంచి ఏదీ కోహ్లి సేనకు కలిసి రాలేదు. పాక్‌తో మ్యాచ్ అంటే మన వెంట ఉండే ఆ అదృష్టం ఈసారి మనల్ని వరించలేదు. ఎప్పుడూ పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టి ఫలితాన్ని సాధించే భారత్.. ఈసారి తానే ఒత్తిడిలో పడిపోయి ఓటమిని మూటగట్టుకుంది. కోట్లాది మంది భారతీయుల ఆశల్ని టీమిండియా నట్టేట ముంచింది. కనీస పోటి ఇవ్వకుండా తలదించుకునేలా చేసింది. వన్డే, టీ20 ప్రపంచకప్పుల్లో ఇప్పటిదాకా టీమిండియా చేతిలో 12 సార్లు ఓడిన దాయాది.. ఆ కసినంతా ఈ మ్యాచులో తీర్చుకుంది. 152 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేజ్ చేసింది.
ఈ మ్యాచ్ లో పాక్ పక్కా ప్రణాళికతో అడుగుపెట్టింది. రోహిత్ శర్మ బలహీనతకు తగ్గట్లే వేగవంతమైన బంతితో షహీన్ అతణ్ని వికెట్ల ముందు ఔట్ చేశాడో అంటే వారి మాస్టర్ ప్లాన్ అర్ధం చేసుకోవచ్చు. అయితే, పాక్ ఎంత ఏకపక్షంగా ఆడినా.. భారత్ తప్పిదాలు కూడా మనల్ని తలదించుకునేలా చేశాయ్. ఫామ్‌లో లేని భువనేశ్వర్‌తో బౌలింగ్ దాడిని ఆరంభించడం భారత్ చేసిన వ్యూహాత్మక తప్పిదం. తొలి ఓవర్లోనే రెండు పెద్ద షాట్లు పడటంతో పాక్ ఓపెనర్ల ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. వాళ్లు ఒత్తిడిలో పడలేదు.
భారత్ కాస్త ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా.. కీలక సమయంలో మళ్లీ బౌండరీలు రావడంతో పాక్‌కు తిరుగులేకపోయింది. మ్యాచ్‌లో ఏదో ఓ దశలో జట్టు పుంజుకుంటుందని.. ప్రత్యర్థికి చెక్ పెడుతుందని.. విజయాన్ని అందుకుంటుందని చివరి వరకూ ఎదురు చూడని అభిమాని లేడు. కానీ, ఫలితం మాత్రం కోట్లాది మంది భారతీయుల బాధను రెట్టింపు చేసింది.
మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం కీలకంగా మారింది. వాస్తవానికి టాస్ మన చేతుల్లో లేకపోయినా.. మ్యాచ్ ఫలితాన్ని సగం నిర్దేశించింది మాత్రం అదే. దాంతో.. టాస్ సమయంలోనే టీమిండియా కాస్త నిరుత్సాహంలో కనిపించింది. అయితే స్టార్ బ్యాట్స్ మెన్ ఉన్నారు.. అందరూ ఫామ్ లో ఉన్నారు కదా అని అభిమానులు భావించారు. కానీ టాపార్డర్ చేతులెత్తేసింది. వాస్తవానికి కోహ్లీ ఒక ఎండ్‌లో సెటిలై ఉన్నప్పుడు.. మరో ఎండ్‌లోని బ్యాట్స్‌మెన్‌లు హిట్టింగ్ బాధ్యత తీసుకుని ఉండాల్సింది. కానీ.. స్లాగ్ ఓవర్లలో హిట్టర్లు ఉండి కూడా ఆ పని చేయలేకపోయారు. దాంతో.. 151 పరుగులతోనే భారత్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
పాకిస్థాన్ ఛేదనకి దిగినప్పుడు.. ఫామ్‌లో లేని భువనేశ్వర్‌తో మొదటి ఓవర్‌ని విరాట్ కోహ్లీ వేయించడం పెద్ద తప్పిదంగా అందరూ అభిప్రాయపడుతున్నారు. భువీకి వరుసగా 4, 6 బాదిన రిజ్వాన్.. ఫస్ట్ ఓవర్‌లోనే కాన్ఫిడెన్స్ పెంచుకున్నాడు. భువీతో కాకుండా.. కచ్చితమైన యార్కర్లని సంధించే బుమ్రాతో వేయించి ఉంటే బాగుండేదని అంటున్నారు. అలానే సిక్త్స్ బౌలింగ్ ఆప్షన్ లేకుండా బరిలోకి దిగడం టీమిండియా తప్పిదంగా కనిపిస్తోంది. పాక్ ఆరుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించగా.. భారత్ ఐదుగురితోనే వేయించాల్సి వచ్చింది.
హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై సందేహాలున్నా.. కొనసాగించి తప్పు చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 8 బంతులాడిన పాండ్యా 11 పరుగులే చేశాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే అసౌకర్యంగా కనిపించిన పాండ్యా.. ఆ తర్వాత భుజం గాయం కారణంగా ఫీల్డింగ్‌కి రాలేదు. అతనికి బదులుగా నయా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌ని తుది జట్టులోకి తీసుకుని ఉంటే..? బాగుండేదనే వాదన వినిపిస్తోంది. దానికితోడు మంచు కారణంగా భారత బౌలర్లకి బంతిపై పట్టు చిక్కలేదు. మొత్తంగా.. పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియాకి ఏదీ కలిసిరాలేదు. టీమిండియా దగ్గర ప్లాన్ బి లేదని మాజీలు మొదట్నుంచీ చెబుతున్నారు. పాకిస్థాన్ మ్యాచ్ లో ఇదే సీన్ రిపీట్ అయింది. టీమిండియా ఓపెనర్లు ఫెయిలవ్వడంతో.. మనోళ్లు వేగంగా ఆడలేకపోయారు. ఎప్పుడూ ఓపెనర్లు మీదే ఆధారపడితే అసలుకేస ఎసరు తప్పదని ఈ మ్యాచ్ హెచ్చరించింది.
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ తొలిసారిగా భారత్‌పై ఆధిపత్యం చాటుకుంది. వరల్డ్ కప్ టోర్నీలో ఇన్నాళ్లు కొరకరాని కొయ్యగా ఉన్న భారత్‌పై మొదటిసారి విజయాన్ని సాధించి టైటిల్ వేటను అద్భుతంగా ప్రారంభించింది. మరోవైపు ఆత్మవిశ్వాసంతో మ్యాచ్ బరిలో దిగిన టీమిండియాకు అనూహ్య పరాజయం ఎదురైంది. మ్యాచ్ ముందు వరకు అంతా సక్రమంగానే ఉన్నప్పటికీ, బరిలోకి దిగాక భారత్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.
టీమిండియా పాకిస్తాన్ పై మ్యాచ్ ఓడిపోవడంతో.. పిచ్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. అయితే దుబాయ్ పిచ్ పరిస్థితులు పాకిస్తాన్ కే కాదు.. టీమిండియాకూ కొట్టిన పిండే. మొన్నటివరకు ఐపీఎల్ ఇక్కడే జరిగింది. ఐపీఎల్లో మన బ్యాట్స్ మెన్, బౌలర్లు సూపర్ గా రాణించారు. మరి అదే పిచ్ పై దాయాదితో పోరుతో ఎందుకు చేతులెత్తేశారంటే.. వ్యూహాత్మక తప్పిదాలతో పాటు అతివిశ్వాసం కూడా కారణాలుగా చెప్పాలి. ముఖ్యంగా టీమ్ కూర్పులో అనాలోచిత నిర్ణయాలే కొంపముంచాయంటున్నారు ఫ్యాన్స్. హార్దిక్ పాండ్యా గతంలో గాయపడినప్పటి నుంచి బౌలింగ్ చేయడం లేదు. అతని బౌలింగ్ లేకపోవడంతో జట్టులో సమతుల్యత లేకుండా పోయింది. హార్దిక్ బౌలింగ్ చేయకపోవడంతో భారత్ అయిదుగురు బౌలర్లతో వెళ్లాల్సి వచ్చింది. ప్యాండ్యా ఐపీఎల్‌లో కూడా అద్భుతాలు చేయలేదు. బ్యాటింగ్ ప్రాతిపదికన చూస్తే, రిషబ్ పంత్ కంటే ముందు అతన్ని దింపి ఉండాల్సింది. జట్టును తిరిగి ట్రాక్‌లో పెట్టడానికి విరాట్, పంత్ చేసిన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో పాండ్యా పూర్తిగా విఫలమయ్యాడు.
రవిచంద్రన్ అశ్విన్ దేశానికి నంబర్ వన్ స్పిన్నర్ అని అందరికీ తెలుసు. ఈ కారణంగానే చాలా సంవత్సరాల తర్వాత టీట్వంటీ ఫార్మాట్లో ఎంపికయ్యాడు. పాకిస్తాన్‌తో ఆడుతున్నప్పుడు ఆటగాళ్లలో కొంత టెన్షన్ ఉండటం సహజం. వార్మప్ మ్యాచ్‌లో చేసిన బౌలింగ్ మాదిరి బౌలింగ్ చేయాలని అశ్విన్ అనుకున్నాడు. అయితే జట్టు మేనేజ్‌మెంట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని సద్వినియోగం చేసుకోవాలని భావించింది. కానీ వరుణ్ కూడా టెన్షన్ తట్టుకోలేకపోయారు. అశ్విన్‌కు చోటివ్వకపోవడం ఒక తప్పయితే దేశంలో అత్యంత సక్సెస్‌ఫుల్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ని ఎంపిక చేయకపోవడం మరో పెద్ద తప్పు అని నిరూపణ అయ్యింది. అవసరమైనప్పుడు వికెట్లు తీయగల సత్తా చాహల్‌కు ఉంది. పైగా ఐపీఎల్‌లో కూడా బాగా బౌలింగ్ చేశారు. చివరి నిమిషంలోనైనా బీసీసీఐ చాహల్‌కు అవకాశం ఇస్తుందని అనుకున్నారు.కానీ, అలా చేయకపోవడంతో ఎటాకింగ్‌లో జట్టు బలహీనపడింది. జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ లేకపోవడం కూడా ఒక లోపమే. ఈ విషయంలో భారత్ కంటే ముందున్న పాకిస్తాన్..ఆరంభంలోనే భారత జట్టును కట్టడి చేయగలిగింది.
భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికే కేఎల్ రాహుల్ అవుటయ్యాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. షహీన్ ఆఫ్రిది బౌలింగ్‌లో రాహుల్ బౌల్డయ్యారు. కానీ అనంతరం టీవీల్లో చూపిన రీప్లే వీడియోలో మాత్రం బంతి వేసినప్పుడు షహీన్ కాలు గీత దాటినట్లుగా కనిపించింది. అది నోబాల్‌కు దగ్గరగా ఉందంటూ, దానిని మళ్లీ పరిశీలించాలని సోషల్ మీడియాలో పలువురు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్న అభిమానులు నోబాల్ కారణంగా రాహుల్ అవుటయ్యాడంటూ బాధ పడుతున్నారు. అయితే టీమిండియా ఓడిన బాధలో అలా అనొచ్చు కానీ.. రాహుల్ అన్నా మ్యాచ్ మలుపు తిప్పేవాడా.. అంటే గట్టిగా ఔను అని చెప్పలేని పరిస్థితి.
భారత బ్యాట్స్‌మెన్ తడబడిన చోట…పాకిస్తాన్ ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఆజమ్ చెలరేగారు. వీరిద్దరు అలవోకగా షాట్లు ఆడుతుంటే భారత బౌలర్లు చేష్టలుడిగిపోయారు. ఈ జంటను విడదీసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం సఫలం కాలేకపోయింది.
దీనికి ముఖ్య కారణం పిచ్‌పై కురిసిన మంచు. పగలంతా వేడిగా ఉండే యూఏఈ పిచ్‌లపై రాత్రి మంచు కురుస్తుంది. ఈ మంచు ప్రభావం కారణంగా బౌలర్లకు, ఫీల్డర్లకు బంతిపై పట్టు దొరకదు. బంతిని సంధించే క్రమంలో బౌలర్లకు పట్టు చేజారుతుంది. దీంతో వారు అనుకున్నంత ప్రభావవంతంగా బంతిని వేయలేరు. పాక్‌తో మ్యాచ్‌లో కూడా భారత బౌలర్లకు ఇదే జరిగింది. ఈ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకున్న బాబర్ ఆజమ్, రిజ్వాన్ చెలరేగిపోయారు.
మైదానంలో భారత ఆటగాళ్ల కదలికలు అంత చురుగ్గా లేవన్నది నిజం. ఫీల్డింగ్ సమయంలో వారి బాడీ లాంగ్వేజ్ గమనించిన వారెవ్వరికైనా ఇది అర్థం అవుతుంది. కళ్లు చెదిరే క్యాచ్, విస్మయపరిచే స్టంపింగ్, మెరుపు వేగంతో బౌండరీ వైపు దూకడంలాంటి ఒక్క ఘటన కూడా భారత ఆటగాళ్లు నుంచి కనిపించ లేదు. బౌండరీ వైపు బంతి వెళ్తుంటే అలా చూస్తుండటం తప్ప ఏం చేయలేకపోయారు. దీనికి అలసట కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇటీవలి కాలంలో భారత క్రికెటర్లు విపరీతమైన క్రికెట్ ఆడారు. కరోనా ఉన్నప్పటికీ భారత్ టోర్నీలు ఆడుతూనే ఉంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ కోసం ఇంగ్లండ్ వెళ్లింది. ఆ సుదీర్ఘ పర్యటన తర్వాత భారత క్రికెటర్లు ఇళ్లకు చేరకుండానే, ఐపీఎల్ రెండో దశ పోటీల కోసం యూఏఈ చేరారు. ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రపంచ కప్‌కు సన్నద్ధమయ్యారు. సంవత్సరంలోని 365 రోజుల్లో కనీసం 300 రోజులు క్రికెటర్లు ఆడుతూనే ఉంటారు. ఇలా విశ్రాంతి లేకుండా ఆడటం ఆటగాళ్ల శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత ఆటగాళ్లు నీరసంగా కనిపించారు. వారిలో పాక్‌తో ఆడినప్పుడు సాధారణంగా కనిపించే ఉత్సాహం, ఉద్వేగాలు కనిపించలేదు. ప్రపంచకప్ టైటిల్ గెలవాలనుకుంటే మాత్రం, టీమిండియా ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోక తప్పదు.
భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా చాలా కాలంగా ఈ రెండు జట్లు మైదానంలో తలపడటం లేదు. దీంతో పాక్ ఆటగాళ్ల బలాబలాలు, బలహీనతల గురించి భారత ఆటగాళ్లు తెలుసుకునేందుకు ఒకే మార్గం యూట్యూబ్. బౌలర్ షహీన్ షా ఆఫ్రిది, గత మూడేళ్లుగా అన్ని ఫార్మాట్‌లలో పాకిస్తాన్ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ట్వంటీ 20 లలో బాబర్ ఆజమ్-రిజ్వాన్ ఓపెనింగ్ జోడీ సత్తా చాటుతోంది. భారత స్టార్ కోహ్లితో బాబర్‌ను పోల్చుతుంటారు. పాకిస్తాన్ క్రికెట్‌లో ఎప్పుడు కూడా అద్భుత ఆటగాళ్లకు కొదవ లేదు. కానీ నిలకడ లేమి అనేది ఆ జట్టుకు ప్రధాన బలహీనత. ఇలా ప్రస్తుత పాకిస్తాన్ జట్టు బలాబలాలను పసిగట్టడంతో భారత్ వెనుకబడినట్లు అనిపించింది. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్, దక్షిణాఫ్రికాకు చెందిన వెర్నాన్ ఫిలాండర్‌లతో ప్రపంచకప్ కోచింగ్ బృందాన్ని పాకిస్తాన్ పటిష్టం చేసుకుంది. విధ్వంసకర, బలమైన అటాకింగ్ హేడెన్ సొంతం. భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ఆటతీరు దీన్ని ప్రతిబింబించింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ బట్టి క్రమశిక్షణతో కూడిన కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం ఫిలాండర్ స్టయిల్. పాక్ బౌలర్లు కూడా ఇదే తరహాలో భారత్‌ను దెబ్బ తీశారు.
ప్రపంచకప్ టోర్నీల్లో పాకిస్తాన్‌పై భారత్‌కు ఘనమైన రికార్డుంది. ప్రపంచకప్ టైటిల్ గెలుపొందేందుకు భారత్-పాక్ మ్యాచ్ అనేది ఒక సమీకరణంగా మారిపోయింది. అది వన్డే ప్రపంచకప్ కావచ్చు లేదా టి20 ఫార్మాట్ అవ్వొచ్చు… పాక్‌తో మ్యాచ్ అంటే గెలుపు మాత్రం భారత్‌దే అనే ముద్ర స్థిరపడింది. ఇదే ఆతి విశ్వాసం తాజా మ్యాచ్‌లో భారత్ కొంపముంచింది.
ఆత్మవిశ్వాసంగా మ్యాచ్ బరిలో దిగిన సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ కీలక సమయంలో వికెట్ పారేసుకున్నారు. పాకిస్తాన్‌కు 152 పరుగుల లక్ష్యాన్ని విధించారు. ఇది బౌలర్లు కాపాడుకోగలిగే లక్ష్యమే. కానీ భారత బౌలర్లెవరూ దీన్ని కాపాడలేకపోయారు. ధారాళంగా పరుగులివ్వడంతో పాటు వికెట్ తీయడంలో విఫలమయ్యారు. బాబర్-రిజ్వాన్ జోడీని విడగొట్టేందుకు భారత బౌలింగ్ దళం వద్ద సరైన వ్యూహమేదీ లేదని మ్యాచ్‌లో స్పష్టంగా తెలిసింది.
భారత్, పాక్ మ్యాచ్ అంటే భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయి. ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. గతంలో ఈ ఒత్తిడితోనే పాకిస్తాన్ చిత్తయ్యేది. కానీ ఈసారి పాక్ టీమ్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా కనిపించింది. ఎప్పుడూ పాజిటివ్ గా ఉండే టీమిండియా ఈసారి.. వరుసపెట్టి పొరపాట్లు చేసింది. అయితే ఇదేదో అనుకోకుండా జరగలేదని, కొన్నిరోజులుగా టీమిండియాలో జరుగుతున్న పాలిటిక్స్ కు ఇది సంకేతమనే వాదన కూడా ఉంది.
1996 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో క్వార్టర్‌ఫైనల్లో ఛేదనలో ఒక దశలో 84/0తో నిలిచింది పాక్.. అయినా ఆ జట్టు గెలవలేదు. 2011 ప్రపంచకప్ సెమీస్‌లోనూ ఛేజింగ్‌లో పాక్ కు శుభారంభమే దక్కింది అయినా నెగ్గలేదు. 2015 కప్‌లోనూ ఛేదనలో ఆ జట్టు 79/1తో నిలిచింది.. అయినా భారత్‌దే విజయం. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్! ఎంత ఎదురు చూసినా వికెట్లు పడలేదు. మనోళ్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అసలు ఆడుతోంది పాక్‌తోనేనా.. ప్రపంచకప్‌లోనేనా అన్న అనుమానం కలిగేంతగా.. ఫలితం భారత అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఉండే తీవ్రమైన ఒత్తిడే కనబడలేదు. అంతా వన్‌సైడ్.. మామూలుగా చిరకాల ప్రత్యర్థితో పోరంటే ఎన్ని మలుపులు తిరిగినా చివరికి విజయం మాత్రం మనల్నే వరించేది. ఉద్విగ్న భరిత క్షణాలు ఉన్నా ఆఖరికి భారత అభిమానుల పెదవులపైనే చిరునవ్వు పూసేది. కానీ ఈసారి మాత్రం మన రోజు కాదు. టాస్ దగ్గర నుంచి ఏదీ కోహ్లి సేనకు కలిసి రాలేదు. పాక్‌తో మ్యాచ్ అంటే మన వెంట ఉండే ఆ అదృష్టం ఈసారి మనల్ని వరించలేదు. ఎప్పుడూ పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టి ఫలితాన్ని సాధించే భారత్.. ఈసారి తానే ఒత్తిడిలో పడిపోయి ఓటమిని మూటగట్టుకుంది. ముఖ్యంగా భారీగా పరుగులు సమర్పించుకున్న మహ్మద్ షమిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. షమి నువ్వు పాక్ వెళ్లిపో అని మండిపోతున్నారు. అయితే షమిపై ట్రోలింగ్ ను అసద్ ఖండించారు. షమి ఒక్కడే ఓటమికి కారకుడా.. ఇదంతా బీజేపీ కుట్రే అంటున్నారు.
ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ రికార్డుకు ఏదో ఒక దశలో బ్రేక్ పడే అవకాశాలు లేకపోలేదని అందరికీ తెలుసు. కానీ మరీ ఇంత ఏకపక్షంగా ఓడటాన్నే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ పక్కా ప్రణాళికతో ఈ మ్యాచ్‌లో అడుగు పెట్టిందని.. రోహిత్ శర్మ బలహీనతకు తగ్గట్లే వేగవంతమైన బంతితో షహీన్ అతణ్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నపుడే అర్థమైపోయింది. బంతుల్లో ఎంత వేగం ఉంటే అంత బాగా షాట్లు ఆడే కోహ్లి, హార్దిక్ లాంటి బ్యాట్స్‌మెన్‌కు రవూఫ్ స్లో బంతుల్లో చెక్ పెట్టిన వైనం కూడా పాక్ ప్రణాళికకు నిదర్శనం. తొలి ఓవర్లోనే రెండు పెద్ద షాట్లు పడటంతో పాక్ ఓపెనర్ల ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. వాళ్లు ఒత్తిడిలో పడలేదు. భారత్ కాస్త ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా.. కీలక సమయంలో మళ్లీ బౌండరీలు రావడంతో పాక్‌కు తిరుగులేకపోయింది. మ్యాచ్‌లో ఏదో ఓ దశలో జట్టు పుంజుకుంటుందని.. ప్రత్యర్థిని వెనక్కి నెడుతుందని.. విజయాన్ని అందుకుంటుందని చివరి వరకూ ఎదురు చూడని అభిమాని లేడు. కానీ మ్యాచ్ సాగుతున్నా కొద్దీ ఎలాంటి ప్రతిఘటన చూపని భారత ఆటగాళ్లు ఇలా చిత్తవడం మింగుడు పడనినిదే. ఇది కేవలం ఓ ఓటమి మాత్రమే కాదు. ప్రపంచకప్‌ల్లో పాక్‌పై భారత ఆధిపత్యానికి పడిన గండి. ఇప్పటివరకూ 12 సార్లు భారత్ చేతిలో ఓడిన పాక్.. తొలిసారి పరాజయ బాధను కేవలం టీమ్‌ఇండియాకే కాదు మొత్తం దేశానికే పరిచయం చేసిన ఓ పీడకల ఇది. దాయాదిపై గొప్పగా చెప్పుకునేందుకు ఇన్నాళ్లుగా ఉన్న రికార్డు ఇప్పుడు కనుమరుగైందనే ఆవేదన ఇది.
ఈ ఓటమి ఎంతో వేదన కలిగించేదే కానీ.. ఈ ఒక్క మ్యాచ్‌తోనే అంతా అయిపోదు. ఈ టోర్నీలో భారత్ ప్రయాణం ఇంకా చాలా ఉంది. ఓ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, తర్వాత మ్యాచ్‌లో గాడిన పడితే.. సెమీస్ చేరడం తేలికే. అక్కడ గెలిచి, మరోవైపు పాక్ కూడా ముందంజ వేసి, 2007 ప్రపంచకప్ ఫైనల్లో మాదిరే మళ్లీ చిరకాల ప్రత్యర్థులు తలపడతాయని, అప్పుడు ఈ ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుని భారత్ రెండోసారి పొట్టి కప్పు అందుకుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. కానీ టీమిండియాలో పాలిటిక్స్ ఉన్నాయని, టీమ్ గ్రూపులుగా డివైడైపోయిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ కేరీర్‌లో 2021 క్రికెట్ క్యాలెండర్ ఇయర్ అత్యంత కీలకంగా మారింది. అతని కేరీర్‌లో కొన్ని కీలక మలుపులు ఈ ఏడాది సంభవించనున్నాయి. జాతీయ జట్టు సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోబోతోన్నట్లు విరాట్ కోహ్లీ ఇదివరకే ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ తరువాత అతను జట్టులో ఓ సాధారణ ప్లేయర్‌గా మాత్రమే కనిపిస్తాడు. అతని తరువాత రోహిత్ శర్మ కేప్టెన్సీ పగ్గాలను అందుకోవడం దాదాపు ఖాయమైంది. రోహిత్ పట్టాభిషేకం ఇక లాంఛనప్రాయమే. ఆ షాక్ నుంచి అభిమానులు తేరుకోక ముందే మరో సంచలన ప్రకటన చేశాడు కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ కేప్టెన్‌గా కూడా తనకు ఇదే చివరి ఐపీఎల్ టోర్నమెంట్ అని ప్రకటించాడు. ఓ ప్లేయర్‌గా జట్టులో కొనసాగుతాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి రిటైర్ అయ్యేంత వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో ఓ ఆటగాడిగా ఉంటానని స్పష్టం చేశాడు.
విరాట్ కోహ్లీ ఇలా వెంటవెంటనే సంచలన నిర్ణయాలను తీసుకోవడానికి ప్రధాన కారణం- ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలు కావడమేనని తెలుస్తోంది.
ఈ మ్యాచ్ ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం వేడెక్కిందని, కేప్టెన్‌గా విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన వ్యూహాలు దారుణంగా తిప్పి కొట్టాయంటూ కొందరు సీనియర్ ఆటగాళ్లు అసహనాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జయ్ షా దృష్టికి తీసుకెళ్లారని, మ్యాచ్‌లో ఓడిపోవడానికి గల కారణాలను వారు పాయింట్ టు పాయింట్ వివరించినట్లు వార్తలొస్తున్నాయి.
ఆ ఇద్దరు సీనియర్ క్రికెటర్ల నుంచి కంప్లయిట్లను అందుకున్న తరువాత.. జయ్ షా- ఇతర ప్లేయర్లతోనూ మాట్లాడాడని చెబుతున్నారు. వారు కూడా ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో ఓ రిపోర్ట్‌ను తయారు చేయించాడని తెలుస్తోంది. ఆ తరువాతే- వన్డే, టీ20 ఫార్మట్ క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లీ కేప్టెన్ హోదా నుంచి తప్పుకొంటాడనే వార్తలు వచ్చాయి.. ఈ వార్తలను తొలుత బీసీసీఐ తోసిపుచ్చింది. విరాట్ కోహ్లీని తప్పించే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది.
విరాట్ కోహ్లీ కేప్టెన్సీపై బీసీసీఐ నుంచి ఓ క్లారిటీతో ఆ వివాదానికి తెర పడినట్టే భావించారు అంతా. బీసీసీఐ క్లారిటీ ఇచ్చిన కొద్దిరోజులకే విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా ఓ ప్రకటన విడుదల చేశాడు. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. అతని అధికారిక ప్రకటన వెలువడటానికి ముందే మీడియాలో కథనాలు రావడం వల్ల బీసీసీఐ స్పందించిందనేది ఇక్కడ స్పష్టమౌతోంది. క్లారిటీ ఇచ్చిన కొద్ది రోజులకే కోహ్లీ.. కేప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు టీమ్ లో కోహ్లీ వర్సెస్ రోహిత్ పోరు నడుస్తోందని, ఆటగాళ్లు కూడా కోహ్లీ మాట వినడం లేదనే అభిప్రాయాలున్నాయి. కోహ్లీ అతి దూకుడే అతడి పట్ల టీమ్ లో వ్యతిరేకత తెచ్చిందని, పాక్ తో మ్యాచ్ లో మెంటర్ ధోనీ సలహాలు కూడా విరాట్ పట్టించుకోలేదనే వార్తలు మరింత హీటు పుట్టిస్తున్నాయి.