ఇంగ్లండ్‌తో జరగనున్న కీలక టెస్టు మ్యాచ్‌లో శుక్రవారం నుంచి టీమిండియా తలపడనుంది. గత ఏడాది జరగాల్సిన ఈ టెస్టును ఐసీసీ రీ షెడ్యూల్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో అభిమానులు ఆసక్తికర పోరును వీక్షించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ వర్సెస్ జేమ్స్ అండర్సన్ మధ్య జరిగే పోరు అందరిలోనూ ఉత్కంఠకు గురిచేస్తోంది. దశాబ్ద కాలంగా ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నారు. అండర్సన్ కెరీర్‌లో చివరి దశకు చేరుకోవడంతో టీమిండియాతో అతడికి ఇదే చివరి టెస్టు మ్యాచ్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎడ్జ్ బాస్టన్ టెస్టులో ఎవరి ఆధిపత్యం కొనసాగుతుందో అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Read Also: IND Vs ENG: జడేజా, హార్డిక్ పాండ్యా వచ్చేశారు.. కొత్తగా అర్ష్‌దీప్ కూడా..!!
క్రికెట్‌లో కొందరు ఆటగాళ్ల మధ్య పోరు ఆసక్తి రేపుతుంది. గతంలో సచిన్-వార్న్, ద్రవిడ్-మెక్‌గ్రాత్, గంగూలీ-బ్రెట్ లీ మధ్య పోరును అభిమానులు ఆస్వాదించేవాళ్లు. ప్రస్తుత కాలంలో విరాట్ కోహ్లీ-అండర్సన్ మధ్య పోరు కూడా ఈ జాబితాలో ఉంటుంది. 2012 నుంచి కోహ్లీ, అండర్సన్ మధ్య పోరు జరుగుతోంది. 2012లో భారత పర్యటనకు ఇంగ్లండ్ వచ్చినప్పుడు తొలిసారి కోహ్లీని అండర్సన్ ఔట్ చేశాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఆరు పరుగులకే అవుటయ్యాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. 2014లో ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీపై అండర్సన్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. అతడి బౌలింగ్‌లో నాలుగు సార్లు పెవిలియన్ బాట పట్టాడు. పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై అండర్సన్ ఔట్ స్వింగర్ బంతులేసి విరాట్‌ను చావుదెబ్బ తీశాడు. ఈ పర్యటనలో వైఫల్యం విరాట్ కోహ్లీని మానసికంగా కుంగదీసింది.
Read Also: Neeraj Chopra: డైమండ్ లీగ్‌లోనూ సత్తా చాటిన నీరజ్.. రజతం కైవసం
అయితే 2014 వైఫల్యంపై పాఠాలు నేర్చుకున్న కోహ్లీ.. ఇంగ్లండ్‌తో జరిగిన తదుపరి సిరీస్‌లలో అండర్సన్‌కు వికెట్ ఇవ్వలేదు. 2016లో ఇంగ్లండ్ జట్టు భారత్‌కు వచ్చినప్పుడు ఒక శతకం, ఒక ద్విశతకంతో మొత్తం 655 పరుగులు పిండుకున్నాడు. అంతేకాకుండా 2018లో టీమ్‌ఇండియా ఇంగ్లండ్‌కు వెళ్లినప్పుడు రెండు సెంచరీల సాయంతో మొత్తం 593 పరుగులు చేశాడు. ఈ రెండు సిరీస్‌లలో 10 మ్యాచ్‌లు జరగ్గా అండర్సన్ 8 మ్యాచ్‌లు ఆడాడు. కానీ విరాట్‌ను ఒక్కసారి కూడా అవుట్ చేయలేకపోయాడు. గత ఏడాది ఇంగ్లండ్‌లో భారత్ నాలుగు టెస్టులు ఆడగా.. విరాట్ కోహ్లీని అండర్సన్ రెండు సార్లు అవుట్ చేశాడు. అయితే కోహ్లీ కూడా ఫర్వాలేదనిపించేలా ఆడాడు. రెండు హాఫ్ సెంచరీలతో రాణించాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ 218 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఇప్పుడు జరిగే ఐదో టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.