2025-26 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ మాస్టర్ బ్యాట్స్‌మన్ జో రూట్ మరోసారి సత్తాచాటాడు. సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో రూట్ అద్భుత శతకం బాదాడు. మైకేల్ నెసర్ వేసిన బంతికి రెండు పరుగులు తీసి.. సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో ఇది అతడికి రెండో సెంచరీ కాగా.. టెస్టు క్రికెట్‌లో మొత్తం 41వ సెంచరీ. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ సరసన నిలిచి.. ఆల్‌టైమ్ టెస్టు సెంచరీల జాబితాలో మూడో స్థానాన్ని పంచుకున్నాడు.
Also Read: Mohammed Shami: అయ్యో పాపం.. ఇక షమీని భారత జెర్సీలో చూడలేమా?
ఈ యాషెస్ సిరీస్‌లో జో రూట్‌కు ఇది రెండో సెంచరీ. అంతకుముందు బ్రిస్బేన్‌లో జరిగిన డే-నైట్ టెస్టులో అజేయంగా 138 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై గత మూడు యాషెస్ పర్యటనల్లో రూట్ సెంచరీ చేయని విషయం తెలిసిందే. చివరకు ఆసీస్ గడ్డపై సెంచరీ కరువు తీర్చుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో రూట్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. 200 మ్యాచుల్లో 51 సెంచరీలు బాదాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్ 166 మ్యాచుల్లో 45 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. 35 ఏళ్ల రూట్ త్వరలోనే కలీస్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. రూట్ ఇంకా 3-4 ఏళ్లు ఆడే అవకాశాలు ఉన్నాయి. క్రికెట్ దిగ్గజం సచిన్‌కు చేరువగా లేదా బద్దలు కొట్టే అవకాశాలు లేకపోలేదు.