Jasprit Bumrah Needs Rested For T20 World Cup Said Wasim Jaffer: ఐపీఎల్ 2024లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించి.. ఏకంగా 8 పరాజయాలను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పట్టికలో 9వ స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచినా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2024ను దృష్టిలో ఉంచుకుని.. ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌కు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక సూచన చేశాడు.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు ప్లే ఆఫ్స్ వెళ్లే ఛాన్సెస్ ఎలాగూ లేవు కాబట్టి.. కనీసం ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని వసీం జాఫర్ సూచించాడు. ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో జాఫర్ మాట్లాడుతూ… ‘ఇంకో మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కు చేరదని నిర్ధారణ అయితే.. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి. ఇది టీమిండియాకు చాలా మంచిది. విశ్రాంతి తీసుకుంటే.. బుమ్రా మరింత మెరుగ్గా బౌలింగ్ చేసి అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని ముంబై మేనేజ్మెంట్, బీసీసీఐ గమనించాలి’ అని అన్నాడు. ఐపీఎల్ 2024లో బుమ్రా 11 మ్యాచ్‌ల్లో 6.25 ఎకానమీ రేట్‌తో 17 వికెట్లు పడగొట్టి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
Also Read: Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. ఇక కష్టమే!
జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. జూన్ 5న భారత్ తన జైత్రయాత్ర ప్రారంభించనుంది. మెగా టోర్నీ కోసం ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్ చివరి సరిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటి నుంచి టీమిండియా ఖాతాలో మరో ట్రోఫీ లేదు. దాంతో ఈసారి కప్ కొట్టాలనే లక్ష్యంతో రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.