Deepak Chahar doubtful For IPL 2024: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ దాదాపుగా ఓ బెర్త్ ఖాయం చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఏకంగా 7 టీమ్స్ పోటీలో ఉన్నాయి. కోల్‌కతా, లక్నో, హైదరాబాద్ సహా చెన్నై కూడా ప్లే ఆఫ్స్ రేసులో ముందు వరసలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో టాప్‌లో ఉన్న చెన్నైకి వచ్చే మ్యాచ్‌లు అన్ని చాలా కీలకం. ఈ సమయంలో యెల్లో ఆర్మీకి బిగ్ షాక్ తగిలింది. చెన్నై స్టార్ పేసర్ దీపక్ చహర్ ఐపీఎల్ 2024లోని మిగిలిన మ్యాచ్‌లు ఆడడం అనుమానమే అని తెలుస్తోంది.
ఇటీవల చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా దీపక్ చహర్ గాయపడ్డాడు. రెండు బంతులు మాత్రమే వేసి మైదానాన్ని వీడాడు. అతడికి హామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ అయింది. దీపక్ గాయంపై సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్ అప్‌డేట్ ఇచ్చారు. ఐపీఎల్ 2024లూనీ మిగిలిన మ్యాచ్‌లకు దీపక్ అందుబాటులో ఉండటం అనుమానమేనని తెలిపారు. దాంతో దీపక్ మిగిలిన మ్యాచ్‌లు ఆడడం ఇక కష్టమే. మే 5న పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్ కోసం చెన్నై జట్టుతో కలిసి ధర్మశాలకు దీపక్ వెళ్లలేదు. ప్రస్తుతం చెన్నైలోనే ఉన్న అతడు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. చెన్నై మరో పేసర్ తుషార్ దేశ్‌పాండే సైతం ఫ్లూతో బాధపడుతున్నాడు.
Also Read: David Warner: డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియన్ కాదు.. ఢిల్లీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో జూనియర్ మలింగా మతీషా పతిరానాను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మహేశ్ తీక్షణ, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ చౌదరి ఇప్పుడు చెన్నైకి అందుబాటులో ఉన్నారు. సొంత దేశం కోసం ఆడేందుకు ముస్తాఫిజుర్ రెహమాన్ ఇప్పటికే చెన్నై జట్టును వీడిన విషయం తెలిసిందే. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2024లో ఆడడం అనుమానంగానే ఉంది. సైడ్ స్ట్రెయిన్‌తో అతను బాధపడుతున్నాడు.