ద ఒవల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ కుదిర్చిన స్వల్ప లక్ష్యాన్ని (111) ఒక్క వికెట్ కోల్పోకుండానే భారత్ చేధించింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ (76*), శిఖర్ ధవన్ (31*).. తొలుత ఆచితూచి ఆడారు. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదడంతో.. 18.4 ఓవర్లోనే భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయి ఆడాడు.
తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంపిక చేసుకోవడంతో.. బ్యాటింగ్ చేసేందుకు ఇంగ్లండ్ రంగంలోకి దిగింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. ఇంగ్లండ్ బ్యాట్స్మన్లు కనీస షాట్లు కూడా ఆడలేకపోయారు. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ చేరారు. బుమ్రా (7.2 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 మెయిడెన్, 6 వికెట్లు) అయితే స్వింగ్ మ్యాజిక్‌తో ఇంగ్లండ్ ఆటగాళ్లకి చుక్కలు చూపించాడు.
మహమ్మద్ షమీ (7 ఓవర్లలో 31 పరుగులు, 3 వికెట్లు) సైతం తన మాయాజాలంతో కన్ఫ్యూజ్ చేసేశాడు. ఏకంగా నలుగు బ్యాట్స్మన్లు సున్నా పరుగులకే ఔటయ్యారు. కెప్టెన్ జాస్ బట్లర్ (32 బంతుల్లో 30 పరుగులు), డేవిడ్ విల్లీ (26 బంతుల్లో 21) మాత్రమే కొంచెం రాణించారు. మిగతా వాళ్లంతా దారుణ ప్రతిభ కనబర్చారు. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ 25.2 ఓవర్లలోనే 110 పరుగులకి కుప్పకూలింది.
ఇక ఇంగ్లండ్ నిర్దేశించిన 111 పరుగుల్ని ఛేదించడం కోసం బరిలోకి దిగిన భారత బౌలర్లు.. చలాకీగా రాణించి, వికెట్ కోల్పోకుండానే రప్ఫాడించారు. తొలుత ఇంగ్లండ్ బౌలర్లు భారత ఆటగాళ్లకి కట్టడి చేసేందుకు ప్రయత్నించారు కానీ, ఓపెనర్లు తెలివిగా రాణించి, ఆ తర్వాత దూకుడు ప్రదర్శించారు. ఫలితంగా 18.4 ఓవర్లలోనే మ్యాచ్ కైవసం చేసుకున్నారు. దీంతో.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.