India vs Bangladesh 1st Test Day2 Summary: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి కేవలం 133 పరుగులే చేసింది. ప్రస్తుతం మెహిదీ హసన్ (16) , ఇబాదత్ హుసేన్ (13) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ తొలిరోజు ఆటను ఎక్కడి నుంచి ముగించిందో.. అక్కడి నుంచి రెండో రోజు ప్రారంభించింది. అప్పటికే క్రీజులో ఉన్న శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వెనువెంటనే ఔట్ అవ్వగా.. రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40) బాగా రాణించారు. ఈ క్రమంలో అశ్విన్ అర్థశతకం కూడా పూర్తి చేసుకున్నాడు. వీళ్లిద్దరు ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 92 పరుగులు జోడించారు. దీంతో.. భారత్ 404 పరుగులకు ఆలౌటైంది.
ఆ తర్వాత బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఆది నుంచే తడబడింది. భారత బౌలర్ల ధాటికి, బంగ్లా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. వచ్చినవాళ్లు వచ్చినట్టుగానే తమ వికెట్లు సమర్పించుకుంటూ.. పెవిలియన్ బాట పట్టారు. ఇప్పటివరకూ బంగ్లా ఇన్నింగ్స్‌లో ముష్ఫికుర్ రహీమ్ ఒక్కడే 28 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఇలాంటి క్లిష్ట సమయాల్లో మెహిదీ హసన్ తన జట్టుని కాపాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి, మరి 16 పరుగులతో క్రీజులో ఉన్న అతగాడు ఈసారి కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతాడా? లేదా? అనేది చూడాలి. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ 3, ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. ప్రెజెంట్ బంగ్లా జట్టు టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 271 పరుగుల వెనుకంజలో ఉంది.