ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం టీమిండియా ఆస్ట్రేలియాకు పయనం కానుంది. త్వరలోనే భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించనుంది. మరోవైపు ఈ ఏడాదంతా టీమిండియా బిజీ బిజీ షెడ్యూల్‌తో గడపబోతోంది.
ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతున్నారు. ఇది ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. జూన్ 9న భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. అనంతరం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆపై జూలై 1న భారత్-ఇంగ్లండ్ మధ్య ఏకైక టెస్టు ప్రారంభం కానుంది. కరోనా కారణంగా గత ఏడాది ఐదు టెస్టుల సిరీస్‌లో ఐదో టెస్టు వాయిదా పడింది. ఈ టెస్టును ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్ పూర్తి కాగానే ఇంగ్లండ్ జట్టుతోనే టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అనంతరం ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌లో పాల్గొంటుంది.