ఐపీఎల్ తర్వాత టీమిండియా బిజీ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా రెండుగా చీలిపోయింది. ఒకే సమయంలో వివిధ సిరీస్‌లు ఉండటంతో సెలక్టర్లు సీనియర్, జూనియర్ జట్లను వేర్వేరుగా ప్రకటించారు. సీనియర్ జట్టు ఇంగ్లండ్‌లో ఉండగా.. జూనియర్ జట్టు ఐర్లాండ్ పర్యటనలో ఉంది. టీమిండియా, ఐర్లాండ్ మధ్య రెండు టీ20ల సిరీస్ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు డబ్లిన్ స్టేడియంలో ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. హార్డిక్ పాండ్యా నేతృత్వంలోని యంగ్ టీమిండియాకు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. లక్ష్మణ్ కోచ్ అవతారం ఎత్తడం ఇదే తొలిసారి కావడం విశేషం.
టీమిండియాకు కుర్రాళ్లకు ఇదే మంచి అవకాశం అని చెప్పాలి. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో రాణిస్తే త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో స్థానం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, చాహల్, వెంకటేష్ అయ్యర్ వంటి ఆటగాళ్లకు ఐర్లాండ్‌తో సిరీస్ ఎంతో ఉపయోగపడుతుంది. త్వరలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ కూడా జరగనుంది. దీంతో ఐర్లాండ్‌లో రాణిస్తే సెలక్టర్ల దృష్టిలో పడొచ్చు. తొలి మ్యాచ్ జరిగే డబ్లిన్ స్టేడియం పిచ్ మందకొడిగా ఉంటుందని అంచనా. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా టీ20ల్లో భారత్, ఐర్లాండ్ ఇప్పటివరకు మూడుసార్లు తలపడగా మూడింటిలోనూ భారత్ గెలిచింది.