టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అభిషేక్ గొప్ప ప్లేయర్ అని.. చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడన్నాడు. అభిషేక్ మ్యాచ్ విన్నర్ అని, టీ20 సిరీస్లో అతడి వికెట్‌కు తమకు చాలా కీలకమైనదని తెలిపాడు. ఆరంభ ఓవర్లలోనే అభిషేక్ వికెట్ తీస్తే టీమిండియా పరుగుల వేగాన్ని ఆపొచ్చని మార్‌క్రమ్ చెప్పుకొచ్చాడు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబరు 9 నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. ఈరోజు తొలి మ్యాచ్ కటక్ వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
మొదటి టీ20 మ్యాచ్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ‘నేను ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మతో కలిసి ఆడాను. అతను మంచి ప్లేయర్. బాగా బ్యాటింగ్ చేస్తాడు. అభిషేక్ మ్యాచ్ విన్నర్. ఎలాంటి బెరుకు లేకుండా బ్యాటింగ్ చేస్తాడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడటానికి స్వేచ్ఛ ఇవ్వడంతోనే ఇలా ఆడుతున్నాడు. టీ20 సిరీస్లో అతడి వికెట్ మాకు చాలా కీలకమైంది. ఆరంభ ఓవర్లలోనే వికెట్ తీయడం మాకు చాలా ముఖ్యం. ప్రస్తుత ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. ఇలా ఆడడం వల్ల పలు లీగ్‌ల్లో ఆడటానికి అవకాశాలు వస్తాయి. దేశం తరఫున టీ20 క్రికెట్‌లో ఆడదానికి కూడా ఉపయోగపడుతుంది’ అని మార్‌క్రమ్ చెప్పాడు.
Also Read: Tirupati Rape Case: తిరుపతిలో దారుణం.. మైనర్ బాలికపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారం!
టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆడిన కొన్ని మ్యాచ్‌లలోనే టాప్ ర్యాంక్ సాధించడం అంటే మాటలు కాదు. అభిషేక్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో 163 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భారీగా రన్స్ బాదాడు. 50.66 సగటు, 249 స్ట్రైక్ రేట్‌తో 304 పరుగులు చేశాడు. బెంగాల్ జట్టుపై 52 బంతుల్లో 148 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాపై అదే ఫామ్ కొనసాగించాలని అభిషేక్ చూస్తున్నాడు.