Hyderabad Cricket Association: కొన్నిరోజులుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వార్తల్లో మెయిన్ టాపిక్ అవుతోంది. భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20కి సంబంధించి టిక్కెట్ల అమ్మకాలలో అక్రమాలకు పాల్పడిందంటూ ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విమర్శల పాలైంది. అయితే తాజాగా టిక్కెట్లకు సంబంధించి మరో తప్పిదం చేసిందని హెచ్‌సీఏపై అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. టిక్కెట్లపై మ్యాచ్ టైమింగ్ తప్పుగా ముద్రించిందని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. టాస్ సాయంత్రం 6:30 గంటలకే వేస్తారు. కానీ టికెట్లపై మ్యాచ్ 7:30 గంటలకు మొదలవుతుందని హెచ్‌సీఏ ముద్రించింది. పది రోజుల ముందు నుంచే టికెట్లు అమ్ముతున్నా హెచ్‌సీఏ దీన్ని గుర్తించలేకపోయిందని పలువురు సెటైర్లు వేస్తున్నారు.
Read Also:ఇండియాలో టాప్ 10 శీతాకాల పర్యాటక ప్రాంతాలు
అయితే హెచ్‌సీఏ తన తప్పును శనివారం రాత్రి గుర్తించింది. దీంతో దీని గురించి మీడియాకు ఓ ఈమెయిల్ పంపించింది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవుతుందని మెయిల్ ద్వారా తెలిపింది. కానీ టికెట్లపై టైమింగ్‌ను తప్పుగా ముద్రించిన విషయాన్ని మాత్రం హెచ్‌సీఏ ఒప్పుకోకపోవడం గమనించాల్సిన విషయం. టికెట్లపై టైమ్‌ను చూసి అభిమానులు రాత్రి 7:30 గంటలకు వస్తే అరగంట ఆటను కోల్పోతారని పలువురు విమర్శిస్తున్నారు. అటు మ్యాచ్‌కు సంబంధించి స్టేడియంలో 39వేల టిక్కెట్లను ముద్రించాల్సి ఉండగా అందులో సగం టిక్కెట్లను కూడా హెచ్‌సీఏ విక్రయించలేదని అభిమానులు మండిపడుతున్నారు. దాదాపు 12,500 టికెట్లు ఏం చేశారో, ఎవరికి అమ్మారో అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఉప్పల్‌లో ప్రేక్షకుల కోసం సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని.. దుమ్ము, ధూళితో నిండిన సీట్లను శుభ్రం చేయలేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్‌లు ఆరోపిస్తున్నారు.