Gautham Gambhir: టీమిండియా వన్డే ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న వేళ టీమ్ కాంబినేషన్‌పై రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో రోహిత్‌కు జోడీగా ఇషాన్ కిషన్‌ను ఆడించాలని సూచించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో డబుల్ సెంచరీతో ఇషాన్ కిషన్ రాణించిన విషయాన్ని గంభీర్ గుర్తుచేశాడు. ఇంతకంటే ఇషాన్ కిషన్ సత్తాకు నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించాడు. దీంతో ఓపెనర్ల విషయంలో ఎలాంటి సందేహాలకు తావు ఇవ్వకుండా సెలక్టర్లు రోహిత్, ఇషాన్ కిషన్ జోడీని ఎంచుకోవాలన్నాడు.
కాగా కొంతకాలంగా టీమిండియాలో ఓపెనర్ల విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది. టెస్టుల్లో రోహిత్‌కు జోడీగా మయాంక్ అగర్వాల్ లేదా శుభ్‌మన్ గిల్ ఆడుతున్నారు. వన్డేల్లో శిఖర్ ధావన్ లేదా కేఎల్ రాహుల్‌ను ఆడిస్తున్నారు. టీ20లలో కూడా కేఎల్ రాహుల్ లేదా అతడు అందుబాటులో లేకపోతే ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లలో ఒకరికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ కూడా కావడంతో అతడి ఎంపిక విషయంలో ఎలాంటి చర్చలు అవసరం లేదని గంభీర్ అంటున్నాడు.
Read Also: Samantha: జీవితం మరోలా ఉంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సామ్
అటు ప్రపంచకప్‌లో బ్యాటింగ్ లైనప్ గురించి కూడా గంభీర్ కీలక సూచనలు చేశాడు. రోహిత్ – ఇషాన్ ఓపెనింగ్ చేయాలని.. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఆడాలని… నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఉండాలన్నాడు. ఏడాదిన్నర కాలంగా అయ్యర్ వన్డేల్లో నిలకడగా ఆడుతున్నాడని గుర్తుచేశాడు. అయ్యర్ తర్వాత ఆరో స్థానంలో హార్ధిక్ పాండ్యా ఉండాలన్నాడు. అయితే ఇషాన్ కిషన్‌కు బ్యాకప్‌గా కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలని గంభీర్ చెప్పడం గమనించాల్సిన విషయం.