MSK Prasad Reveals The Reason Behind Ambati Rayudu 2019 World Cup Snub: 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో అప్పటి టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మధ్య పెద్ద వివాదమే నడిచిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ కంటే ముందు భారత జట్టు నాలుగో స్థానంలో నిలదొక్కుకున్న రాయుడిని కాదని.. 3డీ ప్లేయర్ అంటూ విజయ్ శంకర్‌ను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మెగా టోర్నీలో భారత్ ఓడిపోవడంతో మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. మరోవైపు ప్రపంచకప్‌కు తనను ఎంపిక చేయలేదని.. రాయుడు ఏకంగా రిటైర్మెంట్ కూడా ఇచ్చేశాడు. అప్పటినుంచి అవకాశం వచ్చినప్పుడల్లా ఎమ్మెస్కేపై రాయుడు విమర్శలు చేస్తూనే ఉన్నాడు.
ఇటీవల ఓ తెలుగు చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో కెరీర్ ప్రారంభంలో ఉన్న విభేదాలే ప్రపంచకప్ 2023 జట్టులో చోటు దక్కకుండా చేశాయని అంబటి రాయుడు అన్నాడు. దాంతో ఎమ్మెస్కేపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎమ్మెస్కే తాజాగా ఓ తెలుగు ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి అన్ని ఆరోపణలకు సమాధానం ఇచ్చాడు. ప్రపంచకప్ జట్టులో రాయుడి ఎంపిక చేయకపోవడం కారణం తాను కాదని, అది సెలెక్షన్ కమిటీ సమష్టిగా తీసుకున్న నిర్ణయం అని చెప్పాడు. అందరూ తన వల్లే రాయుడు ప్రపంచకప్ ఆడలేదనుకుంటున్నారని, అయితే అతడు భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడానికి అసలు కారణం తానే అని చెప్పుకోచ్చాడు.
‘నిజం చెప్పాలంటే ఇప్పటివరకు అంబటి రాయుడు నాపై వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలు చేయలేదు. బోర్డు, సభ్యులపై మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం గురించి నేను ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఆ రోజు నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు. నేను కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నా. అయితే ఒక ఆటగాడిని ఎంపిక చేసేటప్పుడు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా నాతో పాటు సెలెక్షన్ స్టాఫ్, కోచ్, కెప్టెన్ ఉంటారు. అందరికి ప్రణాళికలు ఉంటాయి. 2-3 రోజులు చర్చలు జరుగుతాయి. ఫామ్, .ఫిట్‌నెస్ లెక్కలు ఉంటాయి. నా కులం వాడనో, నా రాష్ట్రం వాడనో ఒక ఆటగాడిని ఎంపిక చేయడం అక్కడ కుదరదు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.
Also Read:
AP IPL Team: ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదు.. చిన్నతనంగా లేదా?! ఎమ్మెస్కే ప్రసాద్ ఏం చెప్పాడంటే
‘నేను అంబటి రాయుడిని ఆడించాలనుకున్నానుకోండి.. నలుగురు ఒప్పుకోవాలి. ముందుగా కెప్టెన్ ఒప్పుకోవాలి, ఆపై 3-2 ఓటింగ్ రావాలి.. ఇలా ఎన్నో ఉన్నాయి. జనాలకు ఇవన్నీ తెలియక నాపై మండిపడుతున్నారు. ఎందుకంటే చీఫ్ సెలెక్టర్ నేను కాబట్టి. బార్డర్ దాటితే కమ్మూనిటీ అంటూ ఏమీ ఉండదు. ఒకే కులం వారు అందరూ ఆడితే జట్టు గెలిస్తుందా?. ఇవన్నీ ఎవరికీ తెలియదు. ఇవేమీ ఆలోచించకుండా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని ఎమ్మెస్కే వివరణ ఇచ్చారు.
‘2019 వన్డే వరల్డ్‌కప్‌నకు ముందు అంబటి రాయుడిని జట్టులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో నెను అతనితో మాట్లాడాలనుకున్నా. కానీ అతడు ఫోన్ వాడడని తెలిసి.. మీడియా మిత్రుడు దాస్ సాయంతో రాయుడి ఫ్యామిలీ ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడా. ఫిట్‌నెస్ టెస్ట్‌కు హాజరవ్వమని చెప్పా. అందులో విఫలమయితే ఎన్‌సీఏలో చేర్పించి భారత్-ఎ జట్టులో ఆడేలా చేశా. రాయుడుపై నాకు శ్రద్ధ ఉండబట్టే ఇదంతా చేశా. ఓ ఆటగాడి కోసం సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఇలా చేస్తాడా? ఇవన్నీ ఎవరికీ తెలియవు. రాయుడుకు కూడా నా గురించి తెలుసు. నేను చైర్మన్ అయ్యాకే రాయుడు రీఎంట్రీ ఇచ్చాడు. రాయుడును కాదని శంకర్‌ను ఎంపిక చేయడానికి ప్రధాన కారణం.. అతను ఆల్‌రౌండర్. ఇప్పటికైనా అందరికీ స్పష్టత వస్తుందనుకుంటున్నా’ అని ఎమ్మెస్కే చెప్పుకోచ్చాడు.