2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నాడు తన రిటైర్మెంట్‌పై మోర్గాన్ ప్రకటన చేసే అవకాశముంది. త్వరలోనే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని మోర్గాన్ తొలుత భావించినా ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకోవడానికే అతడు ప్రయత్నిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండటం, పేలవ ఫామ్ వంటి అంశాల కారణంగా మోర్గాన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ అంశంపై పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మోర్గాన్‌కు 36 ఏళ్లు. అతడు గత 28 ఇన్నింగ్స్‌లలో రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. ఇటీవల ముగిసిన నెదర్లాండ్స్ సిరీస్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ డకౌట్ అయ్యాడు. మూడో మ్యాచ్‌లో గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఫామ్ లేమి కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ వేలంలోనూ మోర్గాన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
Read Also: Team India: అరుదైన రికార్డు సాధించిన హార్డిక్ పాండ్యా
2014లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న మోర్గాన్ జట్టును అద్వితీయంగా ముందుకు నడిపించాడు. వన్డే, టీ20ల్లో జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అతడి సారథ్యంలోని జట్టు 2019లో వన్డే ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది. ఇప్పటివరకు 126 వన్డేలు, 72 టీ20లకు సారథ్యం వహించిన 35 ఏళ్ల మోర్గాన్ 248 వన్డేల్లో 7,701 పరుగులు చేశాడు. 115 టీ20ల్లో 2,458 పరుగులు చేశాడు. 16 టెస్టు మ్యాచ్‌లకు కూడా మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2012లో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి మోర్గాన్ తప్పుకుంటే.. అతడి స్థానంలో జాస్ బట్లర్ లేదా మొయిన్ అలీలలో ఒకరు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునే అవకాశాలున్నాయి.