Danish Kaneria: పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్లతో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మ్యాచ్ నుండి వైదొలిగినందుకు మాజీ పాకిస్తాన్ బౌలర్ డానిష్ కనేరియా భారత క్రికెటర్లను విమర్శించారు. ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ మాజీ స్పిన్నర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మీకు అనుకూలమైనప్పుడు దేశభక్తిని ఉపయోగించడం మానేయండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఖరారైన తర్వాత భారత క్రికెటర్లపై విమర్శలు గుప్పించారు.
జూలై 20న బర్మింగ్‌హామ్‌లో నిర్ణయించిబడిని మ్యాచ్‌ను భారత మాజీ క్రికెటర్లు బహిష్కరించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, 2025 ఆసియా కప్‌లో రెండు దేశాలు తలపడతాయని శనివారం ధ్రువీకరించబడింది. ఈ నేపథ్యంలోనే కనేరియా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండనున్నాయి. యూఏఈ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
Read Also: Pakistan: పెళ్లికి నో చెప్పిందని, పాకిస్తానీ టిక్‌టాక్ స్టార్‌పై విషప్రయోగం..
WCL ను బహిష్కరించడంపై కనేరియా మాట్లాడుతూ.. భారత ఆటగాళ్ల చర్య ‘‘దేశభక్తి కంటే ప్రచారం’’గా ఉందని అభివర్ణించారు. ‘‘భారత ఆటగాళ్లు WCL ను బహిష్కరించి దానిని జాతీయవిధిగా అభివర్ణించారు. కానీ ఇప్పడు ఆసియా కప్‌లో భారత్ vs పాకిస్తాన్ బాగానే ఉందా? పాకిస్తాన్‌తో క్రికెట్ సరే అంటే WCL కూడా ఉండాలి. మీకు అనుకూలమైనప్పుడు దేశభక్తిని ఉపయోగించడం మానేయండి. క్రీడను క్రీడగా ఉండనివ్వండి – ప్రచారం కాదు.’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
పాకిస్తాన్ క్రికెట్‌తో సంబంధాలపై బీసీసీఐ వైఖరిని ప్రశ్నించారు. జూలైలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లో పాకిస్తాన్ లెజెండ్స్‌తో మ్యాచ్ ఆడకుండా శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ వైదొలిగారు. వీరిని ఉద్దేశిస్తూనే కనేరియా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.