Pakistan: పాకిస్తాన్‌లో మహిళల హక్కులకు ప్రాధాన్యతే లేకుండా పోయింది. ముఖ్యంగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టిక్‌టాక్ స్టార్లు హత్యలకు గురవుతున్నారు. వీరిపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా, పాకిస్తాన్ టిక్‌టాక్ స్టార్ సుమీరా రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. సింధ్ ప్రావిన్సులోని ఘోట్కి జిల్లాలోని బాగో వా ప్రాంతంలో తన ఇంట్లోనే చనిపోయింది.
Read Also: TCS: ఉద్యోగులకు టీసీఎస్ భారీ షాక్.. 12,000 మంది తొలగింపు..
బలవంతపు వివాహానికి ఒప్పుకోకపోవడంతోనే విషప్రయోగం ద్వారా ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. తన తల్లిని కొందరు వ్యక్తులు బలవంతపు వివాహం కోసం ఒత్తిడి చేస్తున్నారని ఆమె 15 ఏళ్ల కుమార్తె చెప్పినట్లు ఘోట్కి జిల్లా పోలీస్ అధికారి అన్వర్ షేక్ ధ్రువీకరించారు. తన తల్లికి విషపూరిత మాత్రలు ఇచ్చారని, వాటి వల్లే ఆమె మరణించిందని కుమార్తె ఆరోపించింది. ఈ కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, విషప్రయోగం జరిగిందా, లేదా అని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టిక్‌టాక్‌లో సుమీరా రాజ్‌పుత్‌కు 58,000 ఫాలోవర్స్ ఉన్నారు.
పాకిస్తాన్ వ్యాప్తంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు లక్ష్యంగా హత్యలు జరుగుతున్నాయి. గత నెలలో 17 ఏళ్ల టిక్‌టాకర్ సనా యూసఫ్ ఇస్లామాబాద్‌లోని తన ఇంట్లో కాల్చిచంపబడింది. ఇదే కాకుండా, బలవంతపు వివాహాలు, మతమార్పిడిలకు ప్రతిఘటిస్తున్న కొన్ని కేసుల్లో కూడా హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మైనారిటీ హిందూ మతానికి చెందిన బాలికల అపహరణలు, బలవంతపు వివాహాలు నిత్యకృత్యంగా మారాయి.