Asia Cup 2022: దాయాదులు భారత్, పాకిస్థాన్ తలపడుతుంటే వాళ్ల పోరును అభిమానులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వీక్షిస్తే వచ్చే ఆ మజానే వేరు. ఈనెల 28న ఆసియాకప్‌లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్థాన్‌పై టీమిండియానే గెలుస్తుందని జోస్యం చెప్పాడు. అయితే ఇందుకు గల కారణాలను కూడా డానిష్ కనేరియా వివరించాడు. పాకిస్థాన్ కంటే భారత బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉందన్నాడు. రవిచంద్రన్ అశ్విన్, చాహల్, రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాతోపాటు ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌలర్లు భారత్‌కు ఉన్నారని.. వీళ్లు అద్భుతాలు చేయగలరని కనేరియా తెలిపాడు.
Read Also: Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీలో పురుగులు.. ఒక్కసారి తినేటప్పుడు చూసుకోవాలమ్మా
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడినా.. ఈ సారి మాత్రం 60 శాతం భారత్‌కే విజయవకాశాలున్నాయని డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పాడు. చాలా రోజుల తర్వాత రాహుల్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాడని.. అందుకే అతడి ఫామ్ ఆసక్తికరంగా మారిందన్నాడు. అలాగే బ్యాక్ పెయిన్‌తో ఇబ్బంది పడి కోలుకున్న రోహిత్ శర్మ ఆసియా కప్‌లో ఎలా ఆడతాడనేది కీలకంగా మారిందని కనేరియా పేర్కొన్నాడు. అటు పాకిస్థాన్ విషయానికి వస్తే.. నసీమ్ షా మోకాలి గాయంతో బాధపడుతున్నాడని.. షాహీన్ షా అఫ్రిదికి ఫిట్నెస్ సమస్య ఉందని తెలిపాడు. దీంతో పాకిస్థాన్ కంటే భారత్‌కే విజయావకాశాలు ఉన్నాయని తాను అభిప్రాయపడుతున్నట్లు కనేరియా వివరించాడు.