టీ-20 వరల్డ్‌కప్ వేదికపై క్లారిటీ వచ్చేసింది.. యూఏఈలోనే టీ-20 వరల్డ్ కప్ నిర్వహిస్తామని తెలిపింది బీసీసీఐ.. ఈ విషయంపై ఇవాళే ఐసీసీకి సమాచారం ఇచ్చినట్టు బీసీసీఐ తెలిపింది.. అయితే, వరల్డ్ కప్ తేదీలను ఐసీసీ నిర్ణయిస్తుందని తెలిపింది బీసీసీఐ. దీంతో.. కరోనా ఎఫెక్ట్‌తో మరో మెగా టోర్నీ ఇండియా నుంచి తరలిపోయినట్టు అయ్యింది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ నిర్వహించలేమని అందుకే.. యూఏఈలో టోర్నీ జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే, టోర్నీ నిర్వహణపై బీసీసీఐకి ఐసీసీ విధించిన గడువు ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో.. బీసీసీఐ ఆఫీస్ బేరర్ల మధ్య కాన్ఫరెన్స్ జరిగింది.. అందులో ఈ నిర్ణయానికి వచ్చినట్టు బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. భారత్‌లోనే ఈ టోర్నీని నిర్వహించాలని అనుకున్నాం. మన దేశానికి మొదటి ప్రాధాన్యతగా భావించాం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని.. ఐపీఎల్ ముగియగానే టీ-20 వరల్డ్‌కప్ ప్రారంభమవుతుందని తెలిపారు.. క్వాలిఫయర్స్ ఒమన్‌లో జరగొచ్చు. టోర్నీలో మ్యాచ్‌లు మాత్రం దుబాయ్, అబుదాబి, షార్జాల్లో జరుగుతాయన్నారు రాజీవ్ శుక్లా..