Allen Donald Says Sorry To Rahul Dravid After 25 Years: 1997లో జరిగిన గొడవకి గాను.. ఇప్పుడు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు క్షమాపణలు చెప్పాడు బంగ్లాదేశ్ బౌలింగ్ కౌచ్ అలెన్ డొనాల్డ్. అంతేకాదు.. డిన్నర్‌కి కూడా ఆహ్వానించాడు. డొనాల్డ్ మాట్లాడుతూ.. ‘‘1997లో డర్బన్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మా సౌతాఫ్రికా బౌలర్లను ద్రవిడ్, సచిన్ బాదేస్తున్నారు. అప్పుడు నేను కాస్త పరిమితి దాటాను. మా బౌలర్లని బాదుతుండడంతో కోపమొచ్చి, ద్రవిడ్‌పై నోరు పారేసుకున్నాను. అందుకు నేను ద్రవిడ్‌కి సారీ చెప్పాలనుకుంటున్నాను. ద్రవిడ్‌పై నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. ద్రవిడ్ ఓ అద్భతమైన వ్యక్తి. ఒకవేళ నేను చెప్పేది ద్రవిడ్ వింటుంటే.. నాతో డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అప్పుడు మరోసారి ద్రవిడ్‌కి సారీ చెప్తాను’’ అంటూ డొనాల్డ్ పేర్కొన్నాడు. ఈ వీడియోని చూసి ముసిముసి నవ్వులు నవ్విన ద్రవిడ్.. డొనాల్డ్ క్షమాపణని మన్నించాడు. అంతేకాదు, అతనితో కలిసి డిన్నర్‌కి వెళ్లడానికి కూడా సిద్ధమేనని చెప్పాడు. బిల్లు అతడు కడతానంటే.. ఎందుకు వద్దంటాను? అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు.
ఇంతకీ 1997లో ఏం జరిగిందంటే.. అప్పుడు భారత్, సౌతాఫ్రికా మధ్య డర్బన్ వేదికగా వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో సచిన్, ద్రవిడ్ కలిసి సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఎలాంటి బంతులు వేసినా, తమకు అనుకూలంగా మార్చుకుంటూ పరుగుల వర్షం కురిపిస్తున్నారు. వాళ్లు అలా కొట్టడాన్ని డొనాల్డ్ జీర్ణించుకోలేకపోయాడు. అసలే అతనికి కోపం ఎక్కువ. తన బౌలింగ్‌తో ప్రత్యర్థుల్ని వణికించడమే కాదు, వారిని బలహీనపరిచేందుకు నోరు పారేసుకునేవాడు. ఆ మ్యాచ్‌లో ద్రవిడ్‌పై అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. వాళ్లని ఔట్ చేయడానికి మరో దారి లేక.. ఆ పని చేశాడు. ఆ వెంటనే ద్రవిడ్ ఔట్ అవ్వడం జరిగింది. ఈ ఘటనని గుర్తు చేసుకుంటూ.. ఇప్పుడు ద్రవిడ్‌కి సారీ చెప్పాడు డొనాల్డ్. ఆ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 278 పరుగులు చేసింది. మ్యాచ్ కారణంగా భారత్ టార్గెట్‌ను 40 ఓవర్లకు 252 పరుగులుగా నిర్ణయించారు. ఆ మ్యాచ్‌లో ద్రవిడ్ 94 బంతుల్లో 84 పరుగులు కొట్టాడు. అయినా.. భారత్ లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 17 పరుగులు ఉండగానే ఓటమి పాలైంది.