Jio Ipo: రిలయెన్స్ జియో కంపెనీ ప్రజల్లోకి ఎంత వరకు వెళ్లిందంటే.. ఇప్పుడు ఆ పేరు తెలియనివారు లేరనే రేంజ్‌కి చేరుకుంది. అదే స్థాయిలో జియో ఫైనాన్షియల్ సంస్థ కూడా జనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ నెలలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి రావాలనుకుంటోంది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్ పేరునుసాధ్యమైనంత తొందరగా.. అంటే.. మరో ఐదారు నెలల్లో స్టాక్ మార్కెట్‌లో నమోదు చేయించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
read more: Super Success Story: ప్రతిఒక్కరూ చూడాల్సిన ప్రత్యేక ఇంటర్వ్యూ. వహ్‌వా అనిపించే విజయగాథ
ముఖేష్ అంబానీ సారథ్యంలోని ఈ వ్యాపార సామ్రాజ్యం.. జియో ఐపీఓకి సంబంధించిన అనుమతులు పొందేందుకు నియంత్రణ సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఈ సంప్రదింపులు కొనసాగుతున్నాయని, పూర్తయ్యే నాటికి మార్పులు చేర్పులు ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఐపీఓకి షేర్ హోల్డర్లు మరియు క్రెడిటర్ల అంగీకారం కూడా తీసుకునేందుకు మే నెల 2వ తేదీన మీటింగ్ ఏర్పాటుచేస్తున్నట్లు మార్చి నెలలో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమర్పించిన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
జియో ఐపీఓ ద్వారా రిలయెన్స్ ఆర్థికంగా మరింత ఎత్తుకు ఎదుగుతుంది. జియో కంపెనీ ఇండియాలోనే అతిపెద్ద వైర్‌లెస్ ఆపరేటర్ కావటం కలిసొచ్చే అంశం. రిటైల్ రంగంలోనూ రిలయెన్స్ తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలయెన్స్ వినియోగదారుల కార్యకలాపాలు రోజురోజుకీ విస్తరిస్తున్నాయి. దీనికితోడు.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ మార్గదర్శకత్వంలో సంస్థ నడుస్తుండటం మరింత సానుకూల అంశం. ఇవన్నీ జియో ఐపీఓకి ప్లస్ పాయింట్లుగా మారనున్నాయి.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఐదేళ్ల లోపే స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌కి వెళుతుందని రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ 2019లోనే ప్రకటించారు. ఆ గడువు దగ్గర పడుతుండటంతో ప్రయత్నాలు మొదలుపెట్టారు. రిలయెన్స్ అనగానే ముందుగా ముడి చమురు శుద్ధికి సంబంధించిన వ్యాపారాలే గుర్తుకొస్తాయి. కానీ.. ఆ పరిధిని మించి పైకెదగాలనే లక్ష్యంలో భాగంగా రిటైల్ మరియు టెలీకమ్యూనికేషన్ల విభాగాలను స్టాక్ మార్కెట్‌లో నమోదుచేయాలని అప్పట్లోనే సంకల్పించారు.
ఈ టార్గెట్‌ని రీచ్ అయ్యేందుకు గత నవంబర్‌లో కేవీ కామత్‌ని జియో ఫైనాన్షియల్ సంస్థకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించారు. అంతేకాదు. మెక్ లారెన్ స్ట్రాటజిక్ వెంచర్స్‌కి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హితేష్ సేథియాకి జియో ఫైనాన్షియల్ యూనిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పగ్గాలు అప్పగించారు. ఈ ఐపీఓ వల్ల ప్రతి రిలయెన్స్ షేర్ హోల్డర్‌కి జియో ఫైనాన్షియల్ సంస్థలో ఒకటి చొప్పు షేర్ లభిస్తుంది. అయితే.. ఈ వార్తలపై స్పందించేందుకు రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి నిరాకరించటం గమనించాల్సిన విషయం.