తెలుగు ప్రేక్షకులకు కన్నడ రాజ్ బి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనోడు చేసిన గరుడ గమన వృషభవాహన సినిమా కన్నడలోనే చూసి అదిరిపోయింది అని తెలుగు వాళ్ళు భుజం తట్టారు. ఆ తర్వాత వచ్చిన చార్లీ ట్రిపుల్ సెవెన్, కాంతార వంటి సినిమాలకు స్క్రిప్ట్‌లో సహకారం అందించాడు రాజ్. ఇప్పుడు ఆయన నిర్మాతగా సూ ఫ్రం సో అనే సినిమా తెరకెక్కింది. నాలుగున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తెలుగులో ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసింది. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
సు ఫ్రమ్ సో కథ: కర్ణాటకలోని ఓ పల్లెటూరిలో అశోక్ అనే యువకుడికి (దర్శకుడు జేపీ తుమ్మినాడు) దయ్యం పడుతుంది. ఆ ఊరికి పక్క ఊరైన సోమేశ్వరంకి చెందిన సులోచన ఆత్మ ఆ యువకుడిని ఆవహించిందని ఆ ఊరి ప్రజలందరూ భావిస్తారు. ఆ ఊరికి పెద్దగా ఉండే రవన్న (శనిల్ గౌతమ్) ఒక పెద్ద స్వామీజీ (రాజ్ బి శెట్టి)ని తీసుకొచ్చి ఆ ఆత్మను వదిలించాలని ప్రయత్నం చేస్తారు. ఒక కుటుంబ సమస్య ఊరి సమస్యగా మారుతుంది. మరి ఆ యువకుడిని ఆవహించిన సులోచన ఆత్మ వదిలేసిందా? అసలు నిజంగానే సులోచన ఆత్మ ఆ యువకుడిని ఆవహించిందా? అసలేం జరిగింది? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: సినిమా బడ్జెట్ నాలుగున్నర కోట్ల అయిందని రాజ్ బి శెట్టి చెప్పాడు కానీ స్వతహాగా నాకు తెలిసింది కోటిన్నర పెట్టి తీస్తే దాదాపు 40 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయని. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అడిగితే నాలుగున్నర కోట్లతో సినిమా చేసామని చెప్పుకొచ్చాడు. రాజ్ బి శెట్టి తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త మొఖాలే అయినా కన్నడలో ఆ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. బేసిక్‌గా సినిమా మీద ఆసక్తి కలగడానికి అదే ముఖ్య కారణం. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఒక థియేటర్‌లో ఉన్నాను అనే విషయాన్ని మర్చిపోయేలా చేశాడు దర్శకుడు. సినిమా మొదలైనప్పటినుంచి నేను కూడా ఆ పల్లెటూరిలో ఒకడిగా మారిపోయి, జరుగుతున్న తంతు వారి పక్కన నిలబడి చూస్తున్న ఫీలింగ్ కలిగేలా చేశాడు. కథగా చెప్పాలంటే ఇందులో చాలా సింపుల్ కథ. ఒక పల్లెటూరిలో కుర్రాడికి దయ్యం పడుతుంది, ఆ దయ్యాన్ని వదిలించేందుకు ఆ ఊరు మొత్తం చేసే ప్రయత్నం ఈ కథ. వినడానికి చాలా సింపుల్‌గా ఉన్నా, తనదైన స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడు దర్శకుడు. సినిమా ఓపెనింగ్‌లోనే ఆ ఊరు, ఊరి జనాల క్యారెక్టర్‌లను బాగా పరిచయం చేసి, చాలా తక్కువ సమయంలోనే అసలైన కథలోకి తీసుకువెళ్ళాడు. నిజానికి దయ్యం గురించి అసలు విషయం ప్రేక్షకులకు ముందే తెలుసు, అయినా సరే అది ఉందేమో అని భయపడుతూ, ఆ ఊరి ప్రజలందరూ పడుతున్న ఇబ్బందులను చాలా ఎంజాయ్ చేశారంటే, కథ ఎంతలా ఎంగేజ్ చేసేలా రాసుకున్నారు అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో ఆ దయ్యాన్ని దాచి, చివరి విషయంలో రివీల్ చేస్తారు, కానీ ఈ సినిమా విషయంలో అలా చేయలేదు. బహుశా అక్కడే సక్సెస్ అయ్యాడేమో దర్శకుడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో కడుపుబ్బా నవ్వించి, సెకండ్ హాఫ్ కూడా అలాగే నవ్విస్తూ ఒక సీరియస్ సమస్యను డిస్కస్ చేశాడు. అలా సెకండ్ హాఫ్ కూడా నవ్విస్తూ, ఆలోచింపచేస్తూ, చివరికి థియేటర్ నుంచి ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలిగజేస్తూ పంపించాడు.
నటీనటుల విషయానికి వస్తే: ఈ సినిమాలో అశోక్ అనే కీలక పాత్రను దర్శకుడే పోషించాడు. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్రలో జేపీ ఇమిడిపోయాడు. అలాగే రవన్న అనే పాత్ర పోషించిన శనిల్ గౌతమ్ ఆ పాత్రకు కరెక్ట్‌గా సూట్ అయ్యాడు. ఊరి పెద్దగా, అన్ని విషయాలు తనకే తెలుసని ఫీలయ్యే వ్యక్తిగా అదరగొట్టాడు. ఇక రాజ్ బి శెట్టి స్వామీజీ పాత్రలో కనిపించిన ప్రతిసారి నవ్వించాడు. ఈ సినిమా మొత్తం మీద హైలైట్ పాత్ర బావ అనే పాత్ర. తాగుబోతు వ్యక్తిగా నటించిన అతను కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు నవ్వకుండా ఉండలేడు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే, మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. నిజానికి పాట ఒకటే ఉంటుంది, కానీ బావ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి వచ్చే బిట్ అందరి చేత డాన్స్ చేయించేలా ఉంది. ఇక లొకేషన్స్ రెక్కీ ఎవరు చేశారో కానీ, ఇండియాలో ఇలాంటి ఒక పల్లెటూరు ఉందా, ఉంటే ఇప్పుడే వెళ్లి సమయం గడిపి రావాలి అనిపించేలా ఉంది. దానికి తోడు సినిమాటోగ్రఫీతో మాయ చేశారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. సినిమా నిడివి కూడా పెద్ద కంప్లైంట్ ఏమీ కాదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. ఇలాంటి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన మైత్రి సంస్థను అభినందించాల్సిందే.
ఫైనల్లీ: సూ ఫ్రం సో ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తూ, ఆలోచింపచేస్తూ బయటికి పంపే సినిమా.