దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డిలో రెండు పార్శ్వాలు ఉన్నాయి. ‘సొంతవూరు, గంగపుత్రులు, గల్ఫ్, వలస’ వంటి చిత్రాలను రూపొందించిన ఆయనే మరో పక్క ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ, 69 సంస్కారకాలనీ’ వంటి సినిమాలనూ తెరకెక్కించారు. కొన్ని సినిమాలలో తాను చెప్పదలుచుకున్న సందేశాన్ని స్ట్రయిట్ గా చెబితే, మరికొన్ని సినిమాలలో షుగర్ కోటెడ్ పిల్ మాదిరి కమర్షియల్ అంశాలు జోడించి సందేశం ఇస్తూ వచ్చారు. అయితే తాజా చిత్రం ‘మా నాన్న నక్సలైట్’లో ఆయన తన మొదటి పంథానే అనుసరించారు. యుక్తవయసులో రక్తం ఉరకలెత్తుతున్నప్పుడు అడవి బాట పట్టిన ఓ యువకుడు, వయసు మీద పడ్డాక కొడుకు మీద ప్రేమతో తిరిగి ఊరు బాట పట్టిన కథ ఇది.
దాదాపు మూడు దశాబ్దాల ముందు జరిగిన కథ ఇది. హింసామార్గం ద్వారానే సమసమాజాన్ని స్థాపించవచ్చని నమ్మిన కొండరుద్ర సీతారామయ్య (రఘు కుంచే) నిండుచూలాలైన భార్యను వీడి ఉద్యమంలోకి అడుగుపెడతాడు. అడవిలోనే దాదాపు రెండున్నర దశాబ్దాలు గడిపేశాక, వృద్ధాప్యం మీద పడినప్పుడు కొడుకును చూడాలనే కోరిక కలుగుతుంది. ఇక పట్టణంలో ఉండే కొడుకు సత్య (కృష్ణ బూరుగుల) తండ్రి నక్సలైట్ కావడం వల్ల సమాజంలో సూటి పోటీ మాటలు పడుతుంటాడు. అయినా అతనికి తండ్రి అంటే గొప్ప గౌరవం. ఎవరైనా తండ్రిని తూలనాడితే తట్టుకోలేడు. అలాంటి సత్య… తన తండ్రిని కలుసుకునే సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు? అనేదే ఈ చిత్రంలోని ప్రధానాంశం. అయితే ఇది కేవలం ఓ నక్సలైట్ నాయకుడికి, అతని కొడుకుకు మధ్య జరిగే కథ కాదు. విలువల కోసం ప్రాణాలు పణంగా పెట్టే ఓ జర్నలిస్ట్ (ఎల్.బి. శ్రీరామ్), అతని స్వార్థపూరిత కొడుకు (వినయ్ మహదేవ్) కథ. భార్య చనిపోయినా కూతురు (రేఖ నిరోష)ని అల్లారుముద్దుగా, ప్రాణంకంటే మిన్నగా పెంచిన ఓ తండ్రి (కాశీ విశ్వనాథ్) కథ! తన తండ్రి (జీవా) రాజకీయ అవినీతి కారణంగా నక్సల్స్ చేతిలో ఖతం కావడంతో వారి ఉనికిని తుడచి పెట్టేయాలని భావించిన ఓ హోమ్ మినిస్టర్ (సుబ్బరాజు) కథ. అటు ఉద్యోగ ధర్మంగా రాజ్యహింసకు పాల్పడుతూనే, మరో పక్క మానవత్వం చాటలేకపోతున్నానని కుమిలిపోయే ఓ పోలీస్ అధికారి (అజయ్) కథ.
రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ప్రతి సన్నివేశంలోనూ తండ్రీ కొడుకుల అనుబంధాన్ని పాజిటివ్ వే లో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రతి పాత్ర ద్వారా ప్రయత్నించారు. అందులో చాలా వరకూ సఫలీకృతుడయ్యారు. ఈ ప్రధాన పాత్రలే కాకుండా నక్సల్స్ చేతిలో చనిపోయిన ఓ పోలీస్ కొడుకు కథ, యుక్తవయసులో తప్పుదోవపట్టి టెర్రరిస్ట్ గా మారిన మరో యువకుడి కథ కూడా ఇమిడి ఉన్నాయి. అయితే… ఇదంతా నక్సలిజం నేపథ్యంలో దర్శకుడు చెప్పాలనుకోవడంతో ఈ సినిమా రీచ్ తగ్గిపోయిందనిపిస్తోంది. కొండరుద్ర సీతారామయ్య అనే తండ్రి పాత్రతో ఎవరూ ఐడెంటిఫై కాలేని పరిస్థితి నెలకొంది. ఆ పాత్రకంటే కూడా ఇటు ఎల్.బి. శ్రీరామ్, అటు కాశీ విశ్వనాథ్ పాత్రలలో తమని తాము ఎక్కువ మంది తండ్రులు చూసుకునే ఛాన్స్ ఉంది. ఆ రెండు పాత్ర మీద చెప్పలేని సానుభూతి కూడా కలుగుతుంది. రఘు కుంచే పోషించిన ఆ పాత్రకు పీపుల్స్ వార్ మాజీ నాయకుడు కొండపల్లి సీతారామయ్య పేరును పోలిన పేరు పెట్టడం పబ్లిసిటీ గిమ్మిక్ తప్పితే మరొకటి కాదు. ఎందుకంటే… ఇది కొండపల్లి సీతారామయ్య జీవిత కథ కాదు. ఆయన ఉద్యమంలోకి వెళ్ళిన పరిస్థితులు, అక్కడ ఆయన సాగించిన పోరు, అంతర్గత కుమ్ములాటలతో బయటకు వచ్చిన తీరు, ఆయన మరణం… అన్ని ముందు తరాలకు తెలిసిందే. కాబట్టి ఆ పేరును బట్టి ఈ సినిమాకు వచ్చిన వారికి నిరాశ కలగక మానదు. ఇక ఈ తరానికి కొండపల్లి సీతారామయ్య గురించి పెద్దంతగా తెలిసే ఆస్కారం లేదు. సో… సినిమాలోని ప్రధాన పాత్రతో ఎవరూ మమేకం కాలేరు. పైగా నక్సలిజం అనేది ఈ తరానికి పట్టే విషయం కాదు. ఆ చాప్టర్ ను మన దర్శక నిర్మాతలు ఇక వదిలేయడం బెటర్. సినిమాలో ఒకటి రెండు సన్నివేశాలు అలాంటివి ఉన్నా ఫర్వాలేదు కానీ అదే నేపథ్యంగా పూర్తి స్థాయి సినిమా తీస్తే జనాలు చూసే పరిస్థితి లేదు.
నటీనటుల విషయానికి వస్తే… రఘు కుంచే కొండరుద్ర సీతారామయ్య పాత్రలో చక్కని అభినయం ప్రదర్శించారు. కానీ ఆహార్యం అడవి బాట పట్టిన నక్సలైట్ లా లేదు. ‘సీతారామయ్య గారి మనవరాలు’లో అక్కినేని తరహాలో ఉంది. ఈ మనిషి కొండలు గుట్టలు ఎక్కలేడని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆ పాత్రను చూస్తే తెలియదు, డైలాగ్ రూపంలో చెబితే తప్పితే! ఆ పాత్రకు సంబంధించి అదో పెద్ద లోపం. ఆయన కొడుకు సత్యగా కృష్ణ, అతని ప్రియురాలుగా రేఖ నిరోష చక్కగా నటించారు. హోమ్ మంత్రిగా సుబ్బరాజు, పోలీస్ ఆఫీసర్ గా అజయ్, మైనింగ్ మంత్రిగా జీవా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాలో చక్కని నటన కనబరిచిన వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎల్. బి. శ్రీరామ్ గురించి. లోభాలకు లొంగిపోని నిఖార్సైన జర్నలిస్ట్ గా ఆయన చక్కగా నటించారు. అన్ బయాస్డ్ గా వ్యవహరించడమే ఆ పాత్ర స్వభావమని దర్శకుడు చెప్పినా, నక్సలైట్ల సానుభూతి పరుడిగా ఆయనను చూపించారు. ఇక ఇతర పాత్రలలో కాశీ విశ్వనాథ్, ఎఫ్. ఎం. బాబాయ్, డ్రాగన్ ప్రకాశ్, బాబ్జీ, పద్మజా లంక, అనీల్ కళ్యాణ్, వినయ్ మహాదేవ్ తదితరులు నటించారు. ఎస్వీ శివరామ్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ ఇమ్మడి సంగీతం బాగున్నాయి. ముఖ్యంగా పెద్దాడ మూర్తి రాసిన ‘కన్న ప్రేమ ఆకాశం… ఉన్నదంత అనురాగం…’ సాంగ్ హంట్ చేస్తుంది. దానికి సమకూర్చిన స్వరాలు, రఘు కుంచే గాత్రం అద్భుతం. తగిన బడ్జెట్, సరైన సాంకేతిక నిపుణులు, మంచి ఆర్టిస్టులను ఇస్తే… సునీల్ కుమార్ రెడ్డి క్వాలిటీ మూవీస్ చేయగలరు. ఆయన గత చిత్రాలతో పోల్చతే ఇది చాలా మెరుగైన సినిమా. అందుకు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ప్రధాన కారకులు. ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా రూపుదిద్దుకున్న మంచి చిత్రాల కోవలోకి ఇదీ వస్తుంది. కానీ ముందు అనుకున్నట్టు నక్సలిజం నేపథ్యం ఈ సినిమా విజయానికి ప్రతిబంధకమయ్యే ఛాన్స్ ఉంది.
ప్లస్ పాయింట్స్
ఫాదర్ సెంటిమెంట్
ప్రధాన తారాగణం నటన
ఆకట్టుకునే సంగీతం, సంభాషణలు
మైనెస్ పాయింట్స్
నక్సలిజం నేపథ్యం కావడం
పండని మెలో డ్రామా
ట్యాగ్ లైన్: ఓ తండ్రి కథ!