కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో దారుణం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ కారు కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేటుగాళ్లు కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వదిలి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కానిస్టేబుళ్ల పైనుంచి కారు వెళ్లినా కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గంపేట సీఐపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద నూతన సంవత్సర వేళ మంగళవారం రాత్రి జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్సై జి సతీష్ కలిసి కానిస్టేబుళ్లతో వాహన తనిఖీలు చేపట్టారు. దదాపు ఒంటి గంటన్నర సమయంలో విశాఖ వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న కారును ఆపారు. రోడ్డు పక్కకు ఆపుతున్నట్లే ఆపిన కారు డ్రైవర్.. ఒక్కసారిగా ముందుకు పోనిచ్చాడు. అప్పటికే కారు ముందు నిలుచున్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ రాజి లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్‌ను ఢీకొని వెళ్లింది. లోవరాజు అపస్మారక స్థితికి చేరుకోగా.. వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఏ ఘటనలో మరో కానిస్టేబుల్‌కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. కేటుగాళ్లు కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వదిలి పరారయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కారులో గంజాయి ఉన్నట్లు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో కేటుగాళ్లను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానిస్టేబుళ్ల పైనుంచి కారు వెళ్లినా కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గంపేట సీఐపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.