కొన్ని క్లాసిక్స్ ను టచ్ చేయకూడదు. వాటిని రీమేక్ చేయడం అంటే కొరివితో తలగోక్కోవడమే. అలాంటి పని తగదునమ్మా అంటూ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ చేశాడు. ఆరు ఆస్కార్ అవార్డులు అందుకున్న హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ను హిందీలో ‘లాల్ సింగ్ చడ్డా’గా తీశాడు. ఐదేళ్ళ క్రితం ఆమీర్ ‘సీక్రెట్ సూపర్ స్టార్’ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అద్వైత్ చందన్ ఈ తాజా చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అనువాదమై గురువారం జనం ముందుకు వచ్చింది. తెలుగు వర్షన్ కు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించగా, తమిళ చిత్రాన్ని సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి విడుదల చేశాడు.
లాల్ సింగ్ చడ్డా (ఆమీర్ ఖాన్) బుద్ధిమాంద్యం ఉన్న పిల్లాడు. అతని తాత, తండ్రి యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు వదిలిన యోధులు. లాల్ ను కూడా అతని తల్లి (మోనా సింగ్) బాగా చదివించి, మిలిటరీకి పంపాలనుకుంటుంది. బుద్ధిమాంద్యంతో పాటు నడక సమస్య కూడా ఉన్న లాల్… తన బాల్య స్నేహితురాలు రూప (కరీనా కపూర్) ప్రోత్సాహంతో దాన్ని జయిస్తాడు. అందరి కంటే వేగంగా పరుగు పెట్టడం అతనికి అలవాటవుతుంది. దాంతో కాలేజీలో పరుగుల పోటీలో విజేతగా నిలుస్తాడు. ఎన్.సి.సి.లోనూ పాల్గొంటాడు. అలా అతనికి సైన్యంలోనూ ఉద్యోగం వస్తుంది. ఆర్మీలో చేరిన లాల్ సింగ్ చడ్డాకు మొదటి రోజునే బాల (నాగచైతన్య)తో స్నేహం ఏర్పడుతుంది. తన తాత ముత్తాతలు బన్నీ-చెడ్డీ బిజినెస్ చేసే వాళ్ళని, ఆర్మీ కొలువు పూర్తి అయిన తర్వాత తానూ అదే పరిశ్రమలోకి అడుగుపెడతానని బాల.. లాల్ తో చెబుతాడు. కార్గిల్ వార్ లో పాల్గొన్న వీరి జీవితాలు తారుమారవుతాయి. చిన్నప్పటి నుండి కుటుంబపరమైన కష్టాలను ఎదుర్కొన్న రూప బాగా డబ్బులు గడించడమే లక్ష్యంగా బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. సైన్యంలో ఉన్న లాల్, ఫిల్మ్ ఇండస్ట్రీలోని రూప తిరిగి కలుసుకున్నారా? ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ ఉన్న వీరిద్దరి జీవితాలు ఏ తీరాలకు చేరాయి? అన్నదే మిగతా కథ.
1986లో ‘ఫారెస్ట్ గంప్’ పేరుతో వచ్చిన నవల ఆధారంగా 1994లో అదే పేరుతో సినిమా రూపుదిద్దుకుంది. అమెరికాలోని రాజకీయ, సామాజిక సంఘటనలను ఆ సినిమాలో చూపించారు. వియత్నాంకు అమెరికన్ సైన్యం సాయం పేరుతో వెళ్ళడాన్ని అమెరికన్లే వ్యతిరేకించిన సమయమది. ఈ సన్నివేశాల చుట్టూనే ‘ఫారెస్ట్ గంప్’ మూవీ తెరకెక్కింది. దాంతో ఈ సినిమాను, ఇన్ని సంవత్సరాల తర్వాత హిందీలో రీమేక్ చేస్తున్నారనగానే, చాలామందికి ఈ కథను ఎలా భారతీయీకరణ చేస్తారనే సందేహం కలిగింది. బేసికల్ గా మంచి రచయిత కూడా అయిన నటుడు అతుల్ కులకర్ణి చక్కగా అడాప్ట్ చేశాడు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎత్తేసి నాటి నుండి 2018 వరకూ జరిగిన పలు సంఘటనలను ఇందులో తెర మీద చూపించారు. మండల్ కమీషన్ గొడవ, గోల్డెన్ టెంపుల్ లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్, ప్రధాని ఇందిర హత్య, తదనంతరం జరిగిన శిక్కుల ఊచకోత, వివాదాస్పద బాబ్రీమసీద్ కూల్చివేత, దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లు… అద్వానీ రథయాత్ర, కె. ఆర్. నారాయణన్ రాష్టపతిగా వ్యవహరించడం, నరేంద్రమోదీ ప్రధాని కావడం… వంటి సంఘటనలను సందర్భానుసారంగా తెరపై ప్రెజెంట్ చేశారు. ఆ విషయంలో అతుల్, దర్శకుడు అద్యైత్ ను అభినందించాలి.
ఈ అడాప్షన్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ రూప పాత్ర. మాతృకలో మాదిరి ఆమెను సింగర్ గా కాకుండా ఓ నటిగా చూపించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కనుసన్నల్లో మెలిగే బాలీవుడ్ లో రూప జీవితం ఎలా ఛిద్రమైందో తెలిపారు. ఆమె పాత్ర మోనికా బేడీని, ఆమెను వాడుకునే నిర్మాత అబ్బాస్ పాత్ర అబూ సలీమ్ ను గుర్తుకు తెస్తాయి. ఆ రకంగా రూప పాత్రను బాగానే మలిచారు. ఇక మాతృకలో తల్లి పాత్రకు ఇందులోని పాత్రకు కూడా కొంత వ్యత్యాసం ఉంది. అందులో కొడుకును ధైర్యవంతుడిగా పెంచి, తల్లి అన్నిరకాలుగా ప్రోత్సహిస్తుంది. కానీ ఇందులో కొడుకును కట్టడి చేసి, రక్షించే ప్రయత్నం చేసినట్టు చూపించారు. బాల్యంలో లాల్ కు ‘నువ్వు అందరిలాంటి వాడివే ధైర్యంగా ఉండు’ అని చెప్పిన ఆమె… ఆ తర్వాత సమాజంలో జరుగుతున్న విపరీత ధోరణులకు భయపడి… మతకలహాలను మలేరియా వ్యాప్తిగా చెప్పడం, వాస్తవాలను కొడుకుకు చెప్పకపోవడం అనేది ప్రధాన లోపమే!
అడాప్టేషన్ లో జరిగిన మరో పెద్ద పొరపాటు లెఫ్టెనెంట్ డాన్ పాత్రది. అమెరికన్ లెఫ్టినెంట్ డాన్ వియత్నాం వార్ లో రెండు కాళ్ళు కోల్పోతే, అతన్ని ఫారెస్ట్ గంప్ రక్షిస్తాడు. అయితే ఆ డాన్ పాత్రను ఇందులో పాకిస్తాన్ టెర్రరిస్ట్ గా మార్చారు. కార్గిల్ వార్ లో కాళ్ళు కోల్పోయిన ఆ టెర్రరిస్ట్ ను లాల్ కాపాడినట్టు చూపించారు. ఆ తర్వాత కూడా లాల్ అతనికి సాయం చేయడం, తాను చేసే వ్యాపారంలో భాగస్వామిని చేసి, మార్కెటింగ్ హెడ్ ను చేసినట్టు చూపడమనేది అంతగా అతకలేదు. మన సైనికుల మీద దాడి చేసిన టెర్రరిస్టు ఆర్మీ హాస్పిటల్ నుండి ఎలాంటి విచారణ లేకుండా బయటకు వచ్చేయడం, ఇండియాలోనే ఎస్.టి.డీ. బూత్ పెట్టుకుని జీవితాన్ని సాగించడం, మాజీ సైనికుడు నడిపే పెద్ద ఇండస్ట్రీకి మార్కెటింగ్ మేనేజర్ కావడం అనేది సినిమాటిక్ గా ఉంది. తాను కాపాడింది ఓ టెర్రరిస్టును అని లాల్ కు తెలియదన్నట్టుగా సినిమాలో చూపించారు. అంత తెలివి లేని వాడిని ఆర్మీలోకి ఎలా తీసుకున్నారో అర్థం కాదు. అలానే రూప తల్లిని ఆమె తండ్రి చంపినట్టు చూపించి, ఆ తర్వాత సీన్ లోనే ఆమె కూతురుని వదిలి ఓ క్రీస్టియన్ ను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పడమూ పెద్ద బ్లండరే! ఇలాంటి పొరపాట్లు మూవీలో చాలానే ఉన్నాయి.
నటీనటుల విషయానికి వస్తే… ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయాడు. కొన్ని సన్నివేశాలలో ‘త్రీ ఇడియట్స్’, మరి కొన్ని సన్నివేశాలలో ‘పీకే’ సినిమాల్లోనే నటనే గుర్తొస్తుంది. కరీనా రూపగా బాగానే మెప్పించింది. ఈ మూవీతో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ పాత్ర ఎంతో గొప్పగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అంత సీన్ లేదు! బాలా తాత, తండ్రీ నిర్వహించిన ‘చెడ్డీ – బన్నీ’ బిజినెస్ సన్నివేశాలూ కామెడీగా ఉన్నాయి. మాతృకలో ఆ పాత్ర నోరు తెరిస్తే రొయ్యలు, వాటికి సంబంధించిన వంటకాల గురించే మాట్లాడుతుంది. అందులో హీరో కూడా రొయ్యల ఎక్స్ పోర్ట్ బిజినెస్ లోకే అడుగుపెడతాడు. కానీ ఇక్కడ దాన్ని ‘చెడ్డీ – బన్నీ బిజినెస్’గా మార్చేశారు. నాగచైతన్య కాస్తంత భిన్నంగా తెర మీద కనిపించాడు తప్పితే… నటుడిగా మెప్పించేంత గొప్ప సన్నివేశాలేవీ అతనికి లేవు. ఈ సినిమాలో మోనాసింగ్ నటన గురించి చెప్పుకోవాలి. ఆమీర్ ఖాన్ తల్లిగా, నలబై సంవత్సరాల మోనాసింగ్ చక్కగా నటించి, మెప్పించింది. మహమ్మద్ పాత్రలో మానవ్ విజ్ నటన బాగుంది. సాంకేతికంగానూ, నటీనటుల పరంగానూ ఇది చెప్పుకోదగ్గ చిత్రమే అయినా… ‘ఫారెస్ట్ గంప్’లోని కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ కలిగిస్తాయి. కానీ దీనిని అలా మలచడంలో దర్శకుడు అద్వైత్ విఫలమయ్యాడు. మాతృక చూడని వారికి ఓ మేరకు ఈ సినిమా నచ్చే ఆస్కారం లేకపోలేదు. కానీ అందుకూ కొంత ఓపిక ఉండాలి. చిరంజీవి లాంటి వ్యక్తి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించారంటే సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని థియేటర్ కు వెళ్ళే అభిమానులకు మాత్రం నిరాశే మిగులుతుంది. ఓ సన్నివేశంలో ఆమీర్ చెప్పినట్టుగా సినిమా చూస్తుంటే ‘కడుపు నిండిపోయినట్టు ఉంటుంది కానీ మనసు మాత్రం నిండదు’!
రేటింగ్: 2.25 / 5
ప్లస్ పాయింట్స్
‘ఫారెస్ట్ గంప్’ రీమేక్ కావడం
నిర్మాణ విలువలు
ఆర్. ఆర్., సినిమాటోగ్రఫీ
మైనెస్ పాయింట్
రొటీన్ గా ఆమీర్ నటన
బోర్ కొట్టించే కథనం
భారీ అంచనాలు ఏర్పడటం
ట్యాగ్ లైన్: మనసు నిండదు