దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత సంతోష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `జాక్ అండ్ జిల్`. సినిమాటోగ్రాఫర్ గా తనదైన బాణీ పలికించి, యావద్భారతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించారు సంతోష్ శివన్. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రాలు సైతం కొన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో `జాక్ అండ్ జిల్` పైనా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యేడాది మే 20న ఈ చిత్రం థియేటర్లలో విడుదలై పరాజయాన్ని చవిచూసింది. అమెజాన్ ఓటీటీలో జూలై 14న స్ట్రీమింగ్ అయింది.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో ఆరితేరి సొంతగా ఓ రోబోను కనుగొని, దానిని ఓ బుల్లిపెట్టెలో పెట్టుకొని తన తాత ఉండే ఊరికి వస్తాడు కేశ్. అతనితో పాటు క్లాస్ మేట్ ఇంగ్లిష్ అమ్మాయి కూడా వస్తుంది. ఆమెను చూసి తాత, మనవడిని కోప్పడతాడు. ఎందుకంటే తన ఊరిలో ఓపిల్లను ఇచ్చి పెళ్ళి చేయాలని తాత భావించి ఉంటాడు. ఇక కేష్ తాను కనుగొన్న రోబోటిక్స్ తో ఊళ్ళో ఉండేవారి మానసిక రోగాలను బాగు చేయాలని తపిస్తాడు. దాని ద్వారా సమస్యలకు ఎలాంటి పరిష్కారం ఇస్తే రోగి బాగవుతాడు అనే సూచనలు లభిస్తూఉంటాయి. అలాగే రోగిని టైమ్ ట్రావెలింగ్ ద్వారా గతంలోకి వారి మనసులు తీసుకుపోవచ్చు. ఫస్ట్ ఫేజ్ లో ఫెయిల్ అవుతాడు కేశ్. తరువాత పార్వతి అనే పిచ్చి అమ్మాయిపై ప్రయోగం చేస్తాడు. రెండు ఫేజుల్లోనూ సక్సెస్ సాధిస్తాడు. అయితే పార్వతి తనకు గతం జ్ఞాపకం రాగానే తన కుటుంబాన్నినాశనం చేసిన దుండగులపై పగ తీర్చుకోవడానికి వెళ్తుంది. అక్కడ పార్వతి తండ్రి స్నేహితుని కూతురు కూడా ఆమెను చూసి, అసలు ఆమెకు ఎలా మతిస్తిమితం తప్పిందో కేశ్ కు వివరిస్తుంది. తరువాత పార్వతి తన పగ తీర్చుకుంటుంది. పిచ్చి అమ్మాయి చేతిలో చావడం వల్ల కేసు ఉండదు. కానీ, ఆమెకు పిచ్చి తగ్గిపోయిందని కేశ్ గుర్తిస్తాడు. తరువాత పార్వతి కూడా తనకు సెకండ్ పేజ్ లోనే పిచ్చి తగ్గిందని చెబుతుంది. తన తండ్రి చివరి కోరిక మేరకే తాను ఏఐ రోబోటిక్స్ లో సైంటిస్ట్ గా ఉన్నా, సొంత ఊరికి వచ్చి సేవలు అందిస్తాడు కేశ్. అతని రోబో ద్వారా భలే కామెడీ పండుతుంది.
సంతోష్ శివన్ ఇతరులకు భిన్నంగా సినిమాలు రూపొందిస్తాడని పేరు. రీమేక్స్ తీసినా, వాటిలో తనదైన బాణీ పలికించేవారాయన. కానీ, ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన మంజు వారియర్ పోషించిన రోల్ గతంలో భాగ్యరాజా దర్శకత్వంలో రూపొందిన `ఆరారో ఆరిరారో` సినిమాలోని భానుప్రియ పాత్రకు నఖలులాగా అనిపిస్తుంది. అంతేకాదు, మంజు వారియర్ మేకప్ సైతం భానుప్రియను పోలి ఉండడం, ఆమె గెటప్స్ పదే పదే భానుప్రియను గుర్తుకు తెచ్చేలాగే ఉన్నాయి.
సంతోష్ శివన్ వంటి ఏస్ సినిమాటోగ్రాఫర్ పనిచేసిన ఈ సినిమాలో కెమెరా పనితనం ఆయన స్థాయిలో లేదనే చెప్పాలి. ముఖ్యంగా గ్రాఫిక్స్ మిక్స్ చేసిన తీరు చాలా నాసిరకంగా అనిపిస్తుంది. ఇక సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలేవైనా ఉన్నాయంటే అది మంజు వారియర్ అభినయం అని అంగీకరించక తప్పదు. రోబోగా సాహిర్ పండించిన కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. ముగ్గురు సంగీతం సమకూర్చినా, అలరించలేకపోయారు.
ప్లస్ పాయింట్స్:
మంజు వారియర్ అభినయం
రోబోగా సౌబిన్ సాహిర్ కామెడీ
మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం లేకపోవడం
సాగదీసినట్టుగా ఉండే సన్నివేశాలు
సాంకేతికంగానూ అలరించలేక పోవడం
ట్యాగ్ లైన్ : కొత్తదనం నిల్