గత కొంతకాలంగా సాయిపల్లవి సీరియస్ సబ్జెక్టులకే ప్రాధాన్యమిస్తోంది. వంచనకు గురైన పాత్రలనే వెండితెరపై పోషిస్తోంది. గతేడాది వచ్చిన ‘లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్’లో జాలి కొలిపే పాత్రలే ఆమె చేసింది. ఇక ఈ ఏడాది వచ్చిన ‘విరాట పర్వం’లోని పాత్ర కూడా అందుకు మినహాయింపేమీ కాదు. తాజాగా వచ్చిన ‘గార్గి’లోనూ విషాదభరితమైన పాత్రనే ఆమె పోషించింది. సభ్య సమాజం అని మనం గొప్పగా చెప్పుకుంటున్న దానిలోని కుళ్ళును ‘గార్గి’ చిత్రం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు గౌతమ్ రామచంద్రన్. తమిళంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలైంది. దీనిని సూర్యకు చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ రిలీజ్ చేయడం విశేషం.
పురాణేతిహాసాల్లోని గార్గి మాదిరిగానే దేనినైనా ఎదిరించి ప్రశ్నించే తత్త్వం ఇందులోని గార్గి (సాయిపల్లవి) పాత్రకు ఉండటంతో ఆ పేరే కథానాయికకు పెట్టేశారు. స్కూల్ టీచర్ అయిన గార్గీకి పెళ్ళి కుదురుతుంది. త్వరలో ఆమె ఓ ఇంటిది అవుతుందనగా ఊహించని రీతిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే ఆమె తండ్రి ఓ గ్యాంగ్ రేప్ లో అరెస్ట్ అవుతాడు. ఆయన్ని ఎవరికీ తెలియని స్థలంలో పోలీసులు బంధిస్తారు. ఆచూకీ తెలియని తండ్రి గురించి గార్గీ ఎలాంటి పోరాటం చేసింది? చేయని తప్పుకు సమాజం నుండి ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? పోలీసుల నుండి లభించని న్యాయాన్ని ఆమె కోర్టు ద్వారా ఎలా పొందగలిగింది? అసలు గ్యాంగ్ రేప్ కు కారకులు ఎవరు? అనేదే ‘గార్గి’ కథ.
ఇవాళ సమాజంలో నైతిక విలువలు దారుణంగా పడిపోయాయి. అందుకు అన్ని రంగాలూ కారణమే. ఓ మంచి సంఘటనను సమాజానికి ఉదాహరణగా చూపించాల్సిన మీడియా చెడు మీదనే ఫోకస్ పెట్టడం కూడా అందుకు కారణమే. అమ్మాయిలు… ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో ఎంతో మంది ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు. నిజానికి తల్లిదండ్రులే ఈ విషయంలో పిల్లలను హెచ్చరించాలి. కానీ వారు ఆ విషయాలను పట్టించుకోకపోవడంతో ఎలాంటి అనర్థాలు చోటు చేసుకుంటాయో ఇందులో చూపించారు. ఇక్కడో ప్రశ్న కూడా ఉదయించే ఆస్కారం ఉంది. ఒకటి రెండు సంఘటనలను బేస్ చేసుకుని, వాటిని బూతద్దంలో చూపించి, సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకూ సమంజపం అని?! ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. అయితే కొన్ని సున్నితమైన అంశాలను తెర మీద కూడా సున్నితంగానే చూపించాలి. కానీ ప్రేక్షకుల మనసు మీద బలమైన ముద్ర వేయాలనే భావనతో వాస్తవానికి దగ్గరగా తీయాలనే ఆలోచనతో తీస్తే మాత్రం సున్నిత మనస్కులు తట్టుకోవడం కష్టం. ఇందులో కొన్ని సన్నివేశాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. చేదు నిజాన్ని చెప్పేప్పుడు ఆడియెన్స్ ను కాస్తంత ప్రిపేర్ చేయాలి. అలా కాకుండా షాక్ గురి చేయాలని భావిస్తే… అందరూ దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉండరు. ఈ సినిమా క్లయిమాక్స్ విషయంలో అదే జరిగింది. ఎంచుకున్న కథాంశం మంచిదే అయినా, కోర్టు సన్నివేశాలను సహజతత్త్వం పేరుతో సాగదీశారు. మరీ ముఖ్యంగా ద్వితీయార్థంలో మూవీ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఓ అంశాన్ని నిజాయితీతో చెప్పడం ఎంత అవసరమో, దానిని ఆసక్తికరంగా మలచడం కూడా అంతే అవసరం. అప్పుడు చెప్పాలనుకున్న ఆ సందేశం ఎక్కువ మంది ప్రజలను చేరుతుంది. ఈ విషయంలో దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ సరైన హోమ్ వర్క్ చేయలేదు. ఇలాంటి సినిమాలను కుటుంబంతో కలిసి థియేటర్లలోనే కాదు ఓటీటీలో చూడటం కూడా కాస్తంత ఇబ్బందే! ఈ మధ్య కాలంలో ఇలాంటి బిట్టర్ ఎక్స్ పీరియన్స్ ను బాహాటంగా సినిమాలలో చూపించడం ఎక్కువైంది. అయితే, ఆ యా సంఘటనలను గ్లోరిఫై చేసి చూపడం వల్ల ఒక్కోసారి మంచితో పాటు చెడు కూడా జరిగే ఆస్కారం ఉంటుంది.
నటీనటుల విషయానికి వస్తే… చేయని నేరానికి బందీ అయిన తండ్రిని విడిపించుకోవడానికి న్యాయ పోరాటం చేసే యువతిగా సాయిపల్లవి చక్కగా నటించింది. ఆమె తండ్రిగా ఆర్.ఎస్. శివాజీ, అప్ కమింగ్ లాయర్ గా కాళీ వెంకట్ చక్కటి నటన కనబరిచారు. మొన్న వచ్చిన ‘గాడ్సే’ సినిమాలో నటించిన ఐశ్వర్య లక్ష్మీ ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా నిర్మాతల్లో ఆమె కూడా ఒకరు కావడం విశేషం. ఇతర ప్రధాన పాత్రలను శరవణన్, జయప్రకాశ్, ప్రతాప్, సుధ, లివింగ్ స్టన్, కవితాలయ కృష్ణన్ తదితరులు పోషించారు. గోవింద్ వసంత్ తన నేపథ్య సంగీతంతో మెప్పించారు. ఓ ఊహించని సంఘటన జరిగినప్పుడు పూర్తి వివరాలను తెలుసుకోకుండా మీడియా ఓవర్ గా రియాక్ట్ కావడంతో బాధిత కుటుంబాలు ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఇటీవలే వచ్చిన ‘రాకెట్రీ’లో మనం చూశాం. తాము చేసింది తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని సరిచేసుకోవడం అనేది జరగని పని. సో… మీడియా సంయమనం పాటిస్తే మంచిదనే అంశాన్ని ఇందులో చూపించారు. అయితే దర్శకుడు గౌతమ్ తాను ఇవ్వాలనుకున్న సందేశం మీద పెట్టిన దృష్టి కథ, కథనాలను ఆసక్తికరంగా మలచడం మీద పెట్టకపోవడంతో ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అయ్యే ఛాన్స్ తక్కువ.
ప్లస్ పాయింట్స్
సాయిపల్లవి నటన
ఎంచుకున్న కథాంశం
గోవింద్ వసంత్ నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
ఆకట్టుకోని కోర్ట్ డ్రామా
బోర్ కొట్టే ద్వితీయార్థం
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం
ట్యాగ్ లైన్: బిట్టర్ ట్రూత్
రేటింగ్ : 2.5 / 5