రాజకీయాల్లో గుమ్మడికాయంత అవకాశాలే కాదు.. ఆవ గింజంత అదృష్టం ఉండాలి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు ఈ విషయం తెలియంది కాదు. ప్రభుత్వ అధికారిగా.. ప్రజాప్రతినిధిగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆయన.. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పాయకరావుపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన తీవ్ర వేదనలో కూరుకుపోయారు. తన సహజమైన వ్యక్తిత్వందాటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత అధినాయకత్వంపై ధిక్కారస్వరం వినిపించారు గొల్ల బాబూరావు. తనను తాను హింసావాదినని ప్రకటించుకోవడం.. అధిష్ఠానం మోసం చేసిందని ఆయన చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అయ్యాయి. వాస్తవానికి కేబినెట్‌లో అవకాశాలు రాక చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ నిరసనను తెలియజేశారు. గొల్ల బాబూరావు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.
మంత్రి పదవి రాకపోవడంతో తాడేపల్లికి పెద్దఎత్తున కార్యకర్తలతో వెళ్లారు. నాయకత్వం ఎదుట తన ఆవేదనను వెళ్లగక్కి న్యాయం చేయమని ఆయన చేసిన ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు. దీంతో బరస్ట్ అయిపోయారు బాబూరావు. వేదిక ఏదైనా తనలో ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేయడానికి వెనుకాడలేదు. బాబూరావు చేస్తున్న వ్యాఖ్యలు హైకమాండ్‌కు తలనొప్పిగా మారాయి. ఎప్పుడూ స్వామి భక్తిని ప్రదర్శించే బాబూరావు ఎందుకు గర్జిస్తున్నారు…? కేవలం మంత్రి పదవి కోసమే అధిష్ఠానంతో ఢీ అంటున్నారా..? అదే నిజమైతే కుమారుడికి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనే ఆలోచన సంగతేంటి? ప్రస్తుతం ఈ ప్రశ్నలపైనే చర్చ జరుగుతోంది.
బాబూరావు స్వరం పెంచడానికి, ఆయనలో ధిక్కార ధోరణి కనిపించడానికి అసలు కారణం వేరే ఉందనేది హాట్ టాపిక్. పాయకరావుపేటలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు ఎమ్మెల్యేకు ఏమాత్రం జీర్ణించుకోలేనివిగా మారాయి. నాలుగు మండలాల నాయకత్వం బాబూరావు నీడను సైతం అంగీకరించడం లేదు. వర్గ రాజకీయాలు, టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం, అవినీతి ఆరోపణలను ముందుపెట్టి ద్వితీయ శ్రేణి తిరుగుబాటు చేసింది. ఎమ్మెల్యేను సొంత నియోజకవర్గంలోనే జనం, కార్యకర్తలు అడ్డుకోవడం దుమారం రేపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గట్టిగానే వైసీపీ పెద్దలను కోరారు. ఇంకోవైపు బాబూరావు వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని వాదిస్తున్న వాళ్లు ఈ పంచాయితీని తాడేపల్లికి తీసుకెళ్లారు.
ఈ గొడవల్లో ఎమ్మెల్యే బాబూరావు ఒంటరయ్యారనే సంకేతాలు వెలువడ్డాయి. ఇంత జరుగుతున్నా బాబూరావుకు లభించిన పెద్ద ఊరట అధినాయకత్వానికి సాఫ్ట్ కార్నర్ ఉండటమే. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారనే అభిప్రాయం కలుగుతోంది. జిల్లాలో సీఎం పర్యటన జరుగుతుంటే ముఖం చాటేశారు. దానికి కారణం వేరే ఉందనేది అంతర్గత సమాచారం. వచ్చే ఎన్నికల్లో బాబూరావుకు టికెట్ ఇవ్వరని.. మరో అభ్యర్థిని ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలియడం వల్లే మంత్రి పదవి కోసం తన అసంతృప్తిని గట్టిగా వినిపించారని అనుకుంటున్నారట. ఈ వైఖరి ద్వారా తన వారసుడుకి అవకాశం దక్కించుకోవాలని ఎత్తుగడ వేస్తున్నారట. ఇదే పాయకరావుపేట నుంచి అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు. విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌ను వెంకట్రావు కలవడం కలకలం రేపుతోంది. మరి.. పాయకరావుపేటలో కొత్త సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.