పార్టీ సర్వేలో నిలిచేది ఎందరు?సర్వేలు.. వడపోతలు.. నిఘా వర్గాల నివేదికలు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో చర్చగా మారిన అంశాలివే. వీటి ఆధారంగానే టికెట్స్ కేటాయింపు ఉంటుందనే అంతర్గత చర్చ చాలామంది ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోంది. సర్వేలో నిలిచింది ఎవరు? జారిపోయింది ఎవరు అనేది అంతుచిక్కని పరిస్థితి. ఇదే సమయంలో రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఎమ్మెల్యేలకు కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఉద్యమ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి.. 2014లో తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ అధికారాన్ని కాపాడుకుంది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల మూడ్‌లోకి రాష్ట్రం వెళ్తుండటంతో.. గులాబీ గుప్పిట్లోనే పవర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది టీఆర్ఎస్. ఇందుకోసం కసరత్తు మొదలు పెట్టేసింది కూడా. అంతర్గత సర్వేలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఒక అంచనాకు వచ్చే పనిలో ఉంది. అభ్యర్థుల ఎంపికే ఈ వడపోతల్లో కీలకంగా మారింది. చాలా అంశాలను బేరీజు వేసుకుంటోందట టీఆర్‌ఎస్ అధిష్ఠానం. ఎవరికి టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలుస్తారు అనేదే ఆసక్తిగా మారుతోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎంతమంది అధిష్ఠానం దగ్గర పాస్ మార్కులు వేసుకున్నారు? ఎవరి సీటు సేఫ్? ఎవరికి ఎర్త్ పడబోతుంది అని గులాబీ శిబిరంలో హాట్ టాపిక్ ఉంది. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు వారసులను బరిలో దింపేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారట. మరి.. ఆ ఎమ్మెల్యేలు సర్వేలో నిలిచారా లేదా అన్నది ప్రశ్న. తమకే గ్యారెంటీ లేని సమయంలో వారసులకు ఛాన్స్ ఇస్తారా లేదో తెలియదు. కాకపోతే 2018 ఎన్నికల టైమ్‌లో జరిగిన కొన్ని పరిణామాలను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. మాజీ మంత్రి రెడ్యానాయక్‌కు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్.. తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కుమార్తె మాలోతు కవితను ఎంపీగా బరిలో దింపింది పార్టీ.
ఈ క్రమంలోనే వారసుల కోసం పార్టీలో లాబీయింగ్ చేస్తున్న ఎమ్మెల్యేలు చర్చల్లోకి వస్తున్నారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తదితరులు వారసుల కోసం గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారట. ప్రస్తుతం సర్వేలతో టెన్షన్ ఉన్నా.. ఎన్నికల సమయానికి 2018 ఫార్ములా అనుసరించే అవకాశాలు లేకపోలేదన్న లెక్కల్లో ఉన్నారట చాలా మంది శాసనసభ్యులు. ఆ ఆశతోనే వారసులను నియోజకవర్గాల్లో తిప్పేస్తున్నారు. మరి… ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ఎటువంటి వ్యూహం అనుసరిస్తుందో? వారసులను బరిలో నిలిపే విషయంలో ఎవరు సక్సెస్ అవుతారో.. ఎవరికి ఎర్త్ పడుతుందో చూడాలి.