టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ప్రకటన ఎప్పుడు? ఎమ్మెల్సీ ఖాళీల భర్తీ పూర్తికావడంతో ఇకపై సంస్థాగతంగా పార్టీ కూర్పుపై దృష్టి పెడతారా? రాష్ట్ర కమిటీలో చోటు దక్కేదెవరికి? డ్రాప్ అయ్యేది ఎవరు?
టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీని ప్రకటిస్తారా?
ఆ మధ్య తెలంగాణ భవన్‌లో వరసగా టీఆర్‌ఎస్ నేతలతో మీటింగ్స్ జరిగాయి. నియోజకవర్గాల వారీగా సమావేశాల దుమ్ము దులిపేశారు. జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తారు.. ఆ తర్వాత టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీపై ప్రకటన ఉంటుందని అనుకున్నారు. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మొదటి వారంలోనే కసరత్తు కొలిక్కి వస్తుందని భావించారు. హుజురాబాద్ ఉపఎన్నిక రావడంతో ప్రకటన వాయిదా పడిందనే చర్చ నడిచింది. తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అడ్డుపడినట్టు టాక్. ఆ ప్రక్రియ కూడా చివరి దశకు వచ్చింది. కొన్నిచోట్లే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికైనా టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీని కొలిక్కి తీసుకొస్తారా.. లేదా?
రాష్ట్ర కమిటీలో చోటు ఎవరికి?
టీఆర్‌ఎస్‌ను సంస్థాగతంలో ఇంకా బలోపేతం చేయాలన్నది పార్టీ పెద్దల ఆలోచన. రానున్న కాలంలో వరసగా పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలు చేపట్టాలనే ప్రణాళికలపై సమాలోచనలు జరుగుతున్నాయి. సామాజిక సమీకరణాలు, కొత్త-పాత అంశాలను పరిగణనలోకి తీసుకుని నేతలకు కమిటీలో చోటు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.
నామినేటెడ్ పదవులు దక్కని వారంతా కమిటీపై ఫోకస్..!
గతంలో రాష్ట్ర కార్యవర్గంలో ఉండి.. యాక్టివ్‌గా లేని నాయకులకు మరోదఫా అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. అయితే వారెవరు.. పెద్దల దృష్టిలో మైనస్ మార్కులు ఎవరికి పడ్డాయి అన్నది పార్టీ వర్గాలు అంచనా వేయలేని పరిస్థితి. అయితే ఇప్పటి వరకు నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు చేసిన పలువురు నాయకులు.. టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీలోనైనా చోటు దక్కించుకునేందుకు లాబీయింగ్ మొదలుపెట్టినట్టు చెబుతున్నారు.
కమిటీ కూర్పులో పెద్దల ఆలోచనేంటి?
అప్పట్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను నియమించాలని టీఆర్ఎస్ అనుకుంది. ఈ క్రమంలో చాలా మంది ఆశావహులు తెరపైకి వచ్చారు. అయితే జిల్లా అధ్యక్షుల నియామకంపై టీఆర్‌ఎస్ వెనక్కి తగ్గినట్టు చర్చ జరుగుతోంది. జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా చక్రం తిప్పాలని చూసిన వాళ్లంతా ప్రస్తుతం నిరాశలో ఉన్నారు. రాష్ట్ర కమిటీలోనైనా బెర్త్ సంపాదిస్తే చాలన్న ప్రయత్నాల్లో ఉన్నారట గులాబీ నాయకులు. కమిటీ కూర్పులో పార్టీ పెద్దల ఆలోచన ఏంటన్నది వారికి అంతుచిక్కని ప్రశ్న. కమిటీలో తమను ఎంపిక చేయకపోతారా అని ఎవరికి వారు ఆశగా ఎదురు చూస్తున్నారు.
పార్టీ అధికారంలో ఉండటంతో నేతల మధ్య పోటీ.?!
నామినేటెడ్ పదవులు దక్కకపోయినా.. పార్టీ అధికారంలో ఉండటంతో రాష్ట్ర కమిటీలో చోటు కల్పిస్తే.. ఒక హోదా వస్తుందని చాలా మంది నాయకులు లెక్కలేసుకుంటున్నారు. కమిటీ ప్రకటన ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ లేదు. మరి.. నామినేటెడ్ పదవులు దక్కక.. అటు కమిటీలోనూ చోటు లభించకపోతే నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.