ఆయన మాజీ మేయర్. గతంలో టీఆర్ఎస్‌ను వీడి మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఘర్ వాపసీ అయిన తర్వాత సర్దార్ జోర్‌దార్‌గా ఉన్నారని చర్చ సాగుతోంది. ఇప్పుడు సీఎంతోపాటు బీహార్ వెళ్లడంతో.. పార్టీలో ఆయనకిస్తున్న ప్రాధాన్యం ఏంటి? ఎందుకు సీఎం వెంట వెళ్లారు అనే చర్చ సాగుతోందట.
ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటనలో తళుక్కుమన్నారు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్. రెండు రోజులుగా కరీంనగర్‌తోపాటు టీఆర్ఎస్ వర్గాల్లో ఆయనే హాట్ టాపిక్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే విధంగా కేసీఆర్ వెంట కనిపించేవారు. మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆ దూరం తగ్గిందా? ఏ అంశాలు కలిసి వచ్చాయి? రానున్న రోజుల్లో కరీంనగర్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనే చర్చ నడుస్తోందట.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రవీందర్ సింగ్ టీఆర్ఎస్‌ను వీడి రెబల్‌గా బరిలో దిగారు. ఆ సమయంలో టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు కూడా. ఆ ఎన్నికల్లో రవీందర్ సింగ్ ఓడిపోయారు. ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌లో ఉన్న సమయంలో రవీందర్ సింగ్ ఆయనతో ఎక్కువగా కనిపించేవారు. ఈటల ప్రోత్సాహంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారని చర్చ జరిగింది. బీజేపీలోకి వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే పరిణామాలు మారిపోయాయి. రవీందర్‌సింగ్‌ను ప్రగతిభవన్‌కు పిలిపించుకుని మాట్లాడారు సీఎం కేసీఆర్. జరిగిందేదో జరిగిపోయింది.. మళ్లీ కలిసి పనిచేయాలని గులాబీ బాస్ చెప్పారట. అప్పటి నుంచి సర్దార్‌జీ గాడిలో పడినట్టు టాక్.
వాస్తవానికి మంత్రి గంగుల కమలాకర్‌కు, రవీందర్ సింగ్‌కు పొసగడం లేదనే చర్చ పార్టీలో ఉంది. తాను రాజకీయంగా ఎదగలేకపోవడానికి గంగులే కారణమని భావించి అప్పట్లో పార్టీని వీడారనే చర్చ నడిచింది. టీఆర్ఎస్‌లోకి రీఎంట్రీ తర్వాత రవీందర్‌సింగ్‌కు రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. అయితే ఆ పదవి వద్దన్నారట మాజీ మేయర్. తాజాగా సీఎం కేసీఆర్ బీహార్ వెళ్తే.. ఆ పర్యటనలో రవీందర్‌సింగ్ అంతా తానై కనిపించారు. జాతీయ స్థాయి రాజకీయాలపై కేసీఆర్ దృష్టి పెట్టడంతో.. రవీందర్ సింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ ఉంది.
సామాజికవర్గంతోపాటు మొదటి నుంచి టీఆర్ఎస్‌లో ఉండటం రవీందర్‌సింగ్‌కు కలిసి వచ్చిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉందట. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల పర్యటనకు కేసీఆర్ వెళ్తే.. రవీందర్ సింగ్ కనిపించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాలు కరీంనగర్ టీఆర్ఎస్‌లో మాత్రం రకరకాల ఊహాగానాలకు తెరతీస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆసక్తికర నిర్ణయాలు ఉంటాయని అభిప్రాయ పడుతున్నారట. మరి సర్దార్‌జీ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.