ఉద్యోగ సంఘాల నేతలుగా ఓ వెలుగు వెలిగి.. టీఆర్ఎస్‌లో పదవులు అనుభవించి.. ఇప్పుడు ఎందుకు కారు దిగి వెళ్లిపోతున్నారు? బీజేపీవైపు అడుగులు వేయడం వెనక వారి ఆలోచనలేంటి? ఉద్యోగ, రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఏసీలో ఉద్యోగ సంఘాలది కీలక పాత్ర. పలు ఉద్యోగ సంఘాల నేతలు గులాబీ దళపతి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో రావడంతో.. ఉద్యమంలో కలిసి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టి అవకాశాలు ఇచ్చింది. ఆ విధంగా స్వామిగౌడ్ ఎమ్మెల్సీ అయ్యారు. ఆపై శాసనమండలి ఛైర్మన్‌గానూ ఉన్నారు. టీజీవో అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాస్‌గౌడ్.. ఎమ్మెల్యేగా ఎన్నికైతే.. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా కలిసి రాలేదు. దీంతో ఆయనకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. అదే కోవలో మరో ఉద్యోగ సంఘాల నేత విఠల్‌ను TSPSC సభ్యుడిగా అవకాశం కల్పించింది అధికారపార్టీ. ఇలా ఉద్యమకాలం నుంచీ కలిసి వచ్చిన వాళ్లు ఇప్పుడు టీఆర్ఎస్‌లో కుదురుకోలేకపోతున్నారో ఏమో.. ఆపార్టీని వీడి విపక్షపార్టీలలోకి జంప్ అవుతున్నారు.
బీజేపీలో చేరిపోయిన స్వామిగౌడ్..!
విఠల్ సైతం బీజేపీలో చేరిక..!
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఉద్యోగ సంఘాల నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ముందుగా స్వామిగౌడ్ టీఆర్ఎస్‌ను వీడి.. బీజేపీలో చేరిపోయారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక ఆయనలో బలంగా ఉండిపోయింది. అది నెరవేరకపోవడంతో టీఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకున్నారు స్వామిగౌడ్. ఇప్పుడు విఠల్ వంతు వచ్చింది. బీజేపీ కండువా కప్పేసుకున్నారు. పదవిలో ఉన్నంతకాలం సైలెంట్‌గా ఉన్న ఈ ఇద్దరు నాయకులు.. పదవీకాలం ముగిశాక వేరేదారి చూసుకోవడం వెనక ఉన్న కారణం ఏంటి? ఈ అంశంపైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు.
ఉద్యోగ సంఘాల్లో తమ మాజీ నేతల తీరుపై చర్చ..!
టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ కార్పొరేషన్ పదవీకాలం ముగిసింది. పై రెండు ఎపిసోడ్‌లు గమనించిన వాళ్లు.. తాజా పరిణామాలను బేరీజు వేసుకుని.. ఏం జరగబోతుంద్నదానిపై రకరకాల చర్చలు చేస్తున్నారు. తమకు పరిచయం ఉన్న నేతల దగ్గర ఆరా తీస్తున్నారట. రాజకీయ పార్టీల వైఖరి ఏదైనా.. ఉద్యోగ సంఘాల్లో మాత్రం.. మన మాజీ నాయకులకు ఏమైంది? ఉద్యోగ సంఘాలలో భవిష్యత్‌లో వచ్చే మార్పులు.. చేర్పులపై చెవులు కొరుక్కుంటున్నట్టు సమాచారం.